కేంద్ర ప్రభుత్వం కనికరించడం లేదు. సామాన్యుడికి ఊరట దక్కడం లేదు. పెట్రో ఉత్పత్తుల ధరలు పెట్రేగిపోతున్నాయి. గ్యాస్ గుబులు పుట్టిస్తుంటే, పెట్రోల్, డీజిల్ ధరలు దడదడలాడిస్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్ సెంచరీకి చేరువయ్యింది. ఇప్పుడు గ్యాస్ సిలెండర్ కూడా వెయ్యి కి ఎప్పుడెప్పుడా అన్నట్టుగా సాగుతోంది. దాంతో వాటి ప్రభావం సామాన్యులకు కొత్త చిక్కులు తెస్తోంది.
అసలే కరోనా, లాక్ డౌన్ కారణలతో అనేకమంది దిగువ మధ్య తరగతి, సామాన్యుల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమయ్యింది. మళ్లీ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే అంచనాలున్నప్పటికీ సాధారణ బడుగు జనాలకు వాటి ప్రయోజనం దక్కేదెన్నడూ అన్నది సందిగ్ధంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు మరింత చేదోడుగా ఉండేలా ప్రజా సంక్షేమ చర్యలకు పూనుకోవాలని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. దానికి అనుగుణంగా ప్రభుత్వ వ్యయం పెంచాలని చెబుతున్నారు. కానీ మోడీ నేతృత్వంలోని కేంద్రం తీరు భిన్నంగా ఉంది. ప్రజలకు మరింతగా ఆర్థిక భరోసా కల్పించే బదులుగా ప్రజల మీద మరిన్ని భారాలకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది.
పెట్రో ఛార్జీలు పెరగడం అంటే అన్నిటా ధరాఘాతానికి అవకాశః ఇచ్చినట్టే. రవాణా ఛార్జీలు పెరగడం ద్వారా నిత్యాసవరాల సరుకులు ధరలు పెరుగుతుండడం ఇప్పటికే మార్కెట్లో ప్రస్ఫుటమవుతోంది. సన్ ఫ్లవర్ ఆయిల్ లీటర్ రూ. 150కి చేరువ కావడం, చింతపండు వంటివి ఏకంగా ట్రిపుల్ సెంచరీ దాటిపోవడం గమనిస్తే ధరలు ఏస్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. పెరుగుతున్న ధరలతో సామాన్యుడి బడ్జెట్ తారుమారవుతోంది. అదే సమయంలో వంట గ్యాస్ ధరలు ఈ వారంలోనే మూడు సార్లు పెరిగినట్టుగా ఉంది. దాంతో సబ్సిడీ కుచించుకుపోగా, ప్రజలే మొత్తం భారం మోయాల్సిన స్థితి వచ్చేసింది.
పెరుగుతున్న ధరలు, తగ్గుతున్న సబ్సిడీల నేపథ్యంలో మార్కెట్ పుంజుకునే అవకాశాలు నామమాత్రంగా మారుతున్నాయి. స్టాక్ మార్కెట్ వేగాన్ని చూపించి ప్రజలను సంతృప్తి పరచడం సాధ్యం కాదు.సామాన్యుడికి ఊరట కల్పించే రీతిలో ప్రభుత్వ వైఖరి ఉండాలి. దానికి విరుద్ధంగా మోడీ సర్కారు పెట్రోల్ ధరలను అమాంతంగా పెంచేస్తూ ఏటా రూ. 2.5లక్షల కోట్ల వరకూ ప్రయజనం పొందుతున్న తీరు అందరినీ చితికిపోయేలా చేస్తోంది. పైగా ఇటీవల బడ్జెట్ లో అగ్రి సెస్ పేరుతో డీజీల్, పెట్రోల్ ధరలు మరింత పెంచేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ తీరు మీద ప్రజల్లో వ్యతిరేకత అనివార్యం అవుతుంది. దీనిని గమనంలో ఉంచుకుని కేంద్రం వ్యవహరించడం శ్రేయస్కరమని పలువురు సూచిస్తున్నారు.