నోటిఫికేషన్ కు ముందే తెలంగాణలో ఉప ఎన్నికల హోరు మొదలైంది. రైతు ధన్యవాద సభ పేరుతో సాగిన నల్గొండ జిల్లా హాలియా సభలో కేసీఆర్ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. రైతులకు వరాల జల్లుతో పాటు కాంగ్రెస్, బీజేపీలకు హెచ్చరికలు జారీ చేశారు. చానాళ్ల తర్వాత జీహెచ్ ఎంసీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ బహిరంగ సభ జరిగినప్పటికీ అంతకు మించిన స్థాయిలో నల్గొండ లో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగం సాగింది. ఉద్యమ గడ్డ నల్గొండ వేదికగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కు శంఖారావం పూరించారు. ప్రధానంగా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు, కార్యక్రమాల లక్ష్యంగా కేసీఆర్ ప్రసంగం సాగింది.
కేసీఆర్ చెప్పే నాలుగు మాటలు విందామని ఎదురెండను తట్టుకుని మరీ వేచి ఉన్న ప్రజలకు ధన్యవాదాలు అంటూ.. ముందుగా వారిని చల్లబరిచే విధంగా వరాల జల్లు కురిపించారు. జిల్లాలోని 844 పంచాయతీలు ఉండగా.. ఒక్కో పంచాయతీకి రూ. 20 లక్షల నిధులు మంజూరు చేశారు. మండల కేంద్రాలకు రూ. 30 లక్షలు కేటాయించారు. అలాగే జిల్లాలో 8 మున్సిపాలిటీలు ఉండగా.. జిల్లా కేంద్రమైన నల్గొ్ండకు రూ. 10 కోట్లు, మిర్యాలగూడ మున్సిపాలిటీకి రూ.5కోట్లు, మిగతా ఒక్కో మునిసిపాల్టీకి రూ.కోటి చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి ఆకట్టుకున్నారు. మొత్తం రూ.186 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు రేపే జీవో విడుదల చేస్తానని తనదైన శైలిలో హామీఇచ్చారు. అలాగే పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న 4,5 వేల ఎకరాల భూ వివాదాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి రెండు, మూడు రోజుల్లో పరిష్కరించి సమస్య పరిష్కారం, పట్టాల పంపిణీకి శ్రీకారం చుడతారని చెప్పారు. ప్రతి గ్రామానికీ నూతన రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేస్తామన్నారు.
టీఆర్ఎస్ వీరుల పార్టీ..
హామీల అనంతరం నల్లొండ జిల్లాకు గత పాలకులు చేసిన అన్యాయాన్ని ఎత్తిచూపుతూ తాము చేయబోయే ప్రాజెక్టులను, ఖర్చు చేయనున్న నిధులను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి ముందు ఇదే హాలియా సభలో ఆయన ఇచ్చిన హామీలను కూడా గుర్తు చేశారు. ఎడమ కాలవ ఆయకట్టు కింద ప్రతి ఎకరాకూ నీళ్లు అందించేలా రూ.2500 కోట్ల నిధులతో లిఫ్ట్ స్కీంలు మంజూరు చేస్తున్నట్లు, ఈరోజే శంకుస్థాపన చేసినట్లు ప్రకటించారు. ఏడాదిన్నరలో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి నీళ్లు అందిస్తామన్నారు. టీఆర్ఎస్ అంటే వీరుల పార్టీ అని.. వీపు చూపదని చెప్పారు. స్థానిక ఎంపీలు,ఎమ్మెల్యేలకు ప్రజల తరఫున ఓ చాలెంజ్ విసిరి ఆకట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లోగా ఈ లిఫ్ట్ స్కీంలన్నీ పూర్తి చేయకపోతే ఓట్లు అడగమని చాలెంజ్ విసిరారు.
సీతారామ ప్రాజెక్టు ద్వారా దిగువన ఉన్న దేవులపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లిఫ్ట్ స్కీంలు పూర్తి చేసేందుకు రూ. 600 కోట్లు కేటాయించామన్నారు. అలాగే కృ ష్ణా-గోదావరి అనుసంధానం చేసి నల్లగొండ జిల్లా రైతుల కాళ్లు కడుగుతా అన్నారు.
గులాబీ పార్టీ ఏర్పాటుకు కాంగ్రెస్సే కారణం
హాలియా సభ ద్వారా కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రధానంగా ఇటీవల పొలం బాట – పోరు బాట కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ సీఎల్ పీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ర స్పందించారు. పిచ్చిపిచ్చి మాటలన్నీ బంద్ చేసి బుద్ధిగా ఉండాలని హెచ్చరించారు. కాంగ్రెస్ కు తెలంగాణ పేరు ఉచ్ఛరించే అర్హత లేదన్నారు. తమకు ప్రజలు నాణ్యమైన తీర్పు ఇచ్చారని, మీలా ఢిల్లీ నాయకులో ఎవరో తీర్పు ఇవ్వరని చెప్పారు. తెలంగాణలో ఈరోజు ఉన్న దుస్థితికి కాంగ్రెసే కారణమన్నారు. అద్భుతమైన హైదరాబాద్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసిన పాపాత్ములు కాంగ్రెస్ నాయకులు కారా..? అని ప్రశ్నించారు. రైతులు చచ్చిపో్యే పరిస్థితి కారణం కాంగ్రెస్ పార్టీయే అన్నారు. తెలంగాణ గోస పోసుకున్నదెవరో ఆలోచించాలని ప్రజలకు సూచించారు. గులాబీ జెండా పార్టీ ఏర్పాటుకు కారణం కాంగ్రెస్సే అన్నారు. నాగార్జున సాగర్, తదితర ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన పొరపాట్లను ఎత్తిచూపారు. కాంగ్రెస్ ఉమ్మడి ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని చెబితే ఒక్క నాయకుడు కూడా మాట్లాడదేలని, ఇప్పుడు పొలం బాట బొంద బాట అంటూ తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారన్నారు.
సభలో నిరసనలు – కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
అర్జీలు ఇచ్చారు.. బయటకు వెళ్లండి పిచ్చి పనులు చేయకండి.. మీరు ఐదుగురు లేరు.. జాగ్రత్త అంటూ సభలో నిరసనలు చేస్తున్న పలువురిని కేసీఆర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు సంధించారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని అన్నారు. ముల్లు ఎక్కువుంటే పొల్లు పొల్లు చేస్తాం జాగ్రత్త అన్నారు. హద్దు మీరితే ఏం చేయాలో మాకు తెలుసునని, మేం చాలా మంది రాకాసులతో కొట్లాడామని, ఈ గోకాసులు తమకు లెక్కకాదన్నారు. ఇలా అటు కాంగ్రెస్, ఇటు బీజేపీకి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే నోముల నర్సింహ మృతిపై విచారం వ్యక్తం చేశారు. అనంతరం నేను చెప్పేవి అబ్బదాలైతే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను ఓడించండని, నిజమైతే ప్రతిపక్షాలకు డిపాజిట్ దక్కకుండా చేయాలని పిలుపునిచ్చి ఎన్నికల శంఖారావం పూరించారు. ప్రజలకు వరాలు ప్రకటిస్తూ.. ప్రతిపక్షాలపై ఆగ్రహాలు వ్యక్తం చేస్తూ.. హాలియా సభ ద్వారా కేసీఆర్ మరోసారి తన వాగ్దాటి ప్రదర్శించారు.