కేంద్రంలోనూ, దేశంలోని పలు రాష్ట్రాల్లోనూ అధికారం అందుకోలేక దిగాలుపడుతున్న కాంగ్రెసును.. ఇటీవలి కాలంలో అనేకమంది యువ నాయకుల రాజీనామాలు మరింత కుంగదీశాయి. వచ్చే ఏడాది అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ తో సహా ఏడు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సిన తరుణంలో వరుసగా నేతలు పార్టీని విడిపోవడం ఇబ్బందికరంగా పరిణమించింది. పార్టీ శ్రేణుల్లో ఉన్న కొద్దిపాటి ఉత్సాహం నీరుగారిపోతోంది.
దాంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ అధిష్టానం కొత్తతరం నేతలకు ఆహ్వానించడం ద్వారా పార్టీలో కొత్త రక్తం, కొత్త ఉత్సాహం నింపడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే సీపీఐ యువ నేత కన్హయ్య కుమార్, గుజరాత్ దళిత నేత జిగ్నేశ్ మేవానీలను పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఇటీవలి కాలంలో జ్యోతిరాదిత్య సిందియా, జితిన్ ప్రసాద, సుస్మితా దేవి, ప్రియాంక చతుర్వేది వంటి ప్రజాదరణ ఉన్న యువ నేతలు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. వారి స్థానాలను ప్రజల్లో పట్టున్న కొత్తవారితో భర్తీ చేయాలన్నది కాంగ్రెస్ ఆలోచన.
కన్హయ్య చేరికకు సిద్ధం
బీహార్ కు చెందిన యువ నాయకుడు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్హయ్య కుమార్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కావడంతో ఆయన ఆ పార్టీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది.ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడైన కన్హయ్య తన ప్రసంగాలతో యువజనులను ఆకట్టుకోవడంలో దిట్ట. 2019 ఎన్నికల్లో బీహార్ లోని బెగుసరాయ్ ఎంపీ స్థానం నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినా.. భారీగానే ఓట్లు సంపాదించారు. గత కొంతకాలంగా పార్టీ తీరు పట్ల అసంతృప్తితో ఉన్న ఆయన కాంగ్రెసులో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు.
కాంగ్రెస్ వర్గాలు కూడా దీన్ని ధృవీకరిస్తున్నాయి. పార్టీలో చేరడం ద్వారా కన్హయ్య బీహార్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తారని.. ఆయన చేరిక పార్టీలో కొత్త బలం ఇస్తుందని అంటున్నారు. మరికొందరు కాంగ్రెస్ వాదులు ఆయన పార్టీకి భారం అవుతారు తప్ప ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు. తన మాటలతో తరచూ వివాదాలు సృష్టిస్తుంటారని, ఆ కారణంతోనే కొన్నాళ్ల క్రితం సీపీఐ నాయకత్వం ఆయనపై చిన్నపాటి క్రమశిక్షణ చర్యలు తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే కన్హయ్య పార్టీలో చేరితే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న యూపీలోని పూర్వాంచల్ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రచారానికి ఉపయోగపడతారని మరికొందరు అంటున్నారు.
గుజరాత్ దళిత నేతపైనా దృష్టి
మరోవైపు గుజరాత్ లోనూ బలం పెంచుకునేందుకు కాంగ్రెస్ మార్గాలు అన్వేషిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలో పెల్లుబికిన పాటీదార్ ఉద్యమానికి నేతృత్వం వహించిన హార్దిక్ పటేల్ తో పాటు బీజేపీ ప్రభుత్వాన్ని షేక్ చేసిన దళిత నేత జిగ్నేశ్ మేవానితో కాంగ్రెస్ అగ్రనేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. గత ఎన్నికల్లో బనస్కాంత జిల్లా వద్గమ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన జిగ్నేశ్ పై అభ్యర్థిని నిలపకుండా ఆయన గెలుపునకు కాంగ్రెస్ సహకరించింది. దాంతో కాంగ్రెస్ పట్ల ఆయన సానుకూలంగా ఉన్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన జిగ్నేశ్ రాష్ట్రీయ దళిత అధికార మంచ్ కన్వీనర్ కూడా. దళిత వర్గాల్లో మంచి పట్టు ఉన్న నాయకుడు కావడం వల్ల ఆయన చేరిక వచ్చే ఏడాది జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో లభిస్తుందని కాంగ్రెస్ అంచనా.