మాజీ ఎమ్మెల్యే వైఖరితోనే కాకినాడ మేయర్ అవిశ్వాసం?
-రమణ దమరసింగ్, శ్రీకాకుళం
కాకినాడ నగర రాజకీయాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. నగర తెలుగుదేశంలో రెండు నెలల క్రితం రాజుకున్న అసమ్మతి జ్వాల ఆ పార్టీకి చెందిన మేయర్ సుంకరి పావని పదవికి ముప్పుగా పరిణమించింది. ఆమెతోపాటు ఉప మేయర్ కాల సత్తిబాబులపై అవిశ్వాస తీర్మానానికి వైఎస్సార్సీపీ, టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు 34 మంది కార్పొరేటర్ల సంతకాలతో లేఖ కూడా సిద్ధం చేశారు.
కార్పొరేటర్ల రహస్య భేటీ
ఆగస్టు నెలలో జరిగిన రెండో ఉప మేయర్ ఎన్నిక సమయంలోనే తెలుగుదేశం పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. ఆ ఎన్నిక సందర్బంగా ఆ పార్టీ అసమ్మతి కార్పొరేటర్లు బయటపడి వైఎస్సార్సీపీ కార్పొరేటర్లతో చేతులు కలిపారు. రెండుపక్షాలు కలిసి టీడీపీ అసమ్మతి కార్పొరేటర్ బుచ్చిబాబును రెండో డిప్యూటీ మేయర్ చేయడంలో విజయం సాధించారు. అప్పుడే మేయర్ పావనిపై అవిశ్వాసానికి పునాది పడింది. అయితే కార్పొరేషన్ పాలకవర్గం నాలుగేళ్లు పూర్తి అయ్యే వరకు ఆగాలనుకున్నారు. బుధవారంతో నాలుగేళ్లు పూర్తి అయ్యాయి. దాంతో కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని ఓ కన్వెన్షన్ హాల్లో రహస్య సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ, టీడీపీ అసమ్మతి, బీజేపీ, స్వతంత్ర కార్పొరేటర్లు మొత్తం 34 మంది పాల్గొన్న ఈ సమావేశంలో మేయర్, ఉప మేయర్-1పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. జిల్లా కలెక్టర్ ను కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరాలని నిర్ణయం తీసుకున్నారు. కాలెక్టరుకు సమర్పించేందుకు ఒక లేఖ కూడా సిద్ధం చేశారు. దానిపై 34 మంది కార్పొరేటర్లు సంతకాలు చేశారు. ఆ మేరకు ఒకటి ఈ రోజు లేదా రేపు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కలెక్టరును కలవనున్నారు.
మాజీ ఎమ్మెల్యేపై అసంతృప్తితో..
2017లో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. అయితే కొన్నాళ్లకు అప్పటి టీడీపీ నగర ఎమ్మెల్యే కొండబాబు తీరుతో ఆ పార్టీ కార్పొరేటర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. 2019 ఎన్నికల్లో కొండబాబుకు టికెట్ ఇవ్వొద్దని పార్టీ అధినేత చంద్రబాబుపై అసమ్మతి కార్పొరేటర్లు విజ్ఞప్తి చేశారు. అయితే దానికి భిన్నంగా ఆయనకే టికెట్ ఇవ్వడం.. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలిచి అధికారంలోకి రావడంతో సీన్ మారిపోయింది. టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు వైఎస్సార్సీపీ కి అనుకూలంగా మారిపోయారు. ఈ తరుణంలో ఆగస్టులో జరిగిన రెండో ఉప మేయర్ ఎన్నికలో విభేదాలు పూర్తిగా బయటపడ్డాయి. అప్పటి నుంచి మేయర్, ఒకటో ఉప మేయర్ పై అవిశ్వాసానికి పావులు కదుపుతున్నారు.
నగరపాలక సంస్థలో మొత్తం కార్పొరేటర్ల సంఖ్య 48. వారిలో ముగ్గురు చనిపోయారు. ఒకరు రాజీనామా చేశారు. దాంతో ప్రస్తుతం 44 మంది సభ్యులు ఉన్నారు. ప్రత్యేక సమావేశం పెట్టి అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపడానికి 31 మంది సభ్యుల హాజరు తప్పనిసరి. హాజరైనవారిలో సగానికంటే ఎక్కువమంది ఓటేస్తే అవిశ్వాస తీర్మానం నెగ్గుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ అసమ్మతి, బీజేపీ, ఇండిపెండెంట్ సభ్యులతో కలిపి 34 మంది అవిశ్వాసానికి అనుకూలంగా సంతకాలు చేశారు. వీరు కాకుండా ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా కాకినాడ నగర, రూరల్ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత ఉన్నారు. దాంతో ప్రతిపక్ష బలం 37 అవుతుంది. ఈ పరిస్థితుల్లో మేయర్ పై అవిశ్వాసం పెడితే నెగ్గడం, సుంకరి పావని పదవి నుంచి దిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.