రాజ్యసభ ఎన్నికలకు ముందు ఉత్తర కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యేలు మాజీ ఎంపి రమేష్ కత్తి ఆధ్వర్యంలో బి.ఎస్.యడ్యూరప్ప నాయకత్వంపై అసమ్మతి గళం వినిపించారు. ఈ వివాదం సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో మాజీ ఎమ్మెల్యే హెచ్.విశ్వనాథ్ గతేడాది యడ్యూరప్ప నాయకత్వంలో బిజెపి ఎలా అధికార పీఠం దక్కించుకుందో బహిర్గతం చేస్తానని ప్రకటించాడు.ఆనాడు జెడిఎస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగి బిజెపికి మద్దతు పలికిన మాజీ ఎమ్మెల్యే హెచ్.విశ్వనాథ్ తాను “ఆపరేషన్ కమలం ” తో తెర వెనుక జరిగిన ఒప్పందాల గురించి ఒక పుస్తకం రాస్తానని వెల్లడించి యడ్యూరప్ప గుండెలలో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు.
గత జూలైలో జెడిఎస్-కాంగ్రెస్ సంకీర్ణాన్ని కూల్చివేసి 17 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతుతో యడ్యూరప్ప ఎలా అధికారంలోకి వచ్చారో ప్రజలకు తెలియజేయాలని తాను కోరుకుంటున్నట్లు హెచ్.విశ్వనాథ్ తెలిపాడు.
నా లాంటి అగ్ర నాయకుడు ఫిరాయించిన తరువాత మాత్రమే ఇతర ఎమ్మెల్యేలకు నమ్మకం కుదిరింది.దీంతో మిగిలిన ఎమ్మెల్యేలందరూ నాతోపాటు ఫ్లైట్‌లో ఎక్కి ముంబైలోని బిజెపి క్యాంప్‌కు చేరాలని ఆయన వెల్లడించాడు. మేము యడ్యూరప్పను ముఖ్యమంత్రిగా చేసాము,మా త్యాగం వల్ల ఆయన అధికారంలోకి వచ్చారు.నేను ప్రతి అంశాన్ని బహిర్గతం చేసి ప్రజలకు వివరించాలని భావిస్తున్నట్లు తెలిపాడు.
బిజెపికి మద్దతు ప్రకటించిన జెడిఎస్,కాంగ్రెస్‌లకు చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ శాసన సభ్యత్వాలకు రాజీనామా చేశారు.దీంతో అసెంబ్లీలో ఖాళీ అయిన15 స్థానాల భర్తీ కోసం డిసెంబర్ 5 న ఉప ఎన్నికలు జరిగాయి.అందులో హెచ్.విశ్వనాథ్, నాగరాజ్ మినహా 11 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు బిజెపి టికెట్‌పై విజయం సాధించారు.అనంతరం వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు.అలాగే ఉప ఎన్నికలలో ఓడిపోయిన అతనికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని సీఎం యడ్యూరప్ప వాగ్దానం చేశాడు.కానీ గత వారం కర్ణాటక శాసన మండలికి బిజెపి తరఫున ఆయన పేరును సీఎం పార్టీ అధిష్ఠానానికి పంపించగా ఢిల్లీ పెద్దలు తిరస్కరించారు.అదే సమయంలో విశ్వనాథ్‌తో పాటు ఎమ్మెల్యేగా ఓటమిపాలైన నాగరాజ్‌ను ఎమ్మెల్సీని చేశారు.
ఈ రాజకీయ పరిణామాలు జెడిఎస్ మాజీ అధ్యక్షుడు విశ్వనాథ్ కు సీఎం యడ్యూరప్పపై కోపం తెప్పించాయి. దీంతో కర్ణాటక,భారతదేశ ప్రజలకు తెలియకుండా తెర వెనుక జరిగిన బాగోతాన్ని “బాంబే డేస్” పేరుతో పుస్తకంలో తెలియజేస్తానని ఆయన ప్రకటించారు.రాబోయే రెండు నెలలలో పుస్తక రచన పూర్తి చేసి కన్నడ, హిందీ,ఆంగ్ల భాషలలో ఒకేసారి పుస్తకాన్ని విడుదల చేస్తానని తెలిపారు.
అయితే విశ్వనాథ్ “బాంబే డేస్” పుస్తక రచన బిజెపి నాయకత్వంపై ఒత్తిడి పెంచే ఒక ప్రయత్నంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.ఇది బిజెపిని ఎక్కడో ఒకచోట తనకు అవకాశం కల్పించమని బలవంతం చేసే ఎత్తుగడగా ఆ పార్టీ నాయకత్వం అభిప్రాయపడుతోంది.కానీ ఇప్పటివరకు విశ్వనాథ్ పుస్తక రచన బెదిరింపుపై సీఎం యడ్యూరప్ప స్పందించలేదు.
ఇక ఫిరాయింపుల కోసం యడ్యూరప్ప విశ్వనాథ్ సహా ప్రతి ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు చెల్లించారని మాజీ ముఖ్యమంత్రి,ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య ఆరోపించారు.విశ్వనాథ్ మాట మీద నిలబడి గతేడాది 17 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలతో బిజెపి చేసుకున్న చీకటి ఒప్పందాలను పుస్తకరూపంలో వెల్లడిస్తే కన్నడనాట సంచలనంగా మారే అవకాశం ఉంది.