ఆదివారం వస్తే చాలు ఎవరో ఒకరి మీద కుట్ర పలుకులు పలికే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ వారం విశాఖ ఉక్కు మీద పడ్డారు. తన రాతల్లో ఎదుటి వ్యక్తి వ్యక్తిగత విషయాలమీద విషం కక్కుతూ సాగే రాధాకృష్ణ పాళీకి మోడీ అన్న బిజెపి అన్న ఎంత భయమో వ్యాసంలో కనిపించింది.
ఒక రాష్ట్రంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ప్రజలు ఒక అంశం మీద ఉద్యమించినప్పుడు మొదట స్పందించాల్సింది ప్రతిపక్ష నాయకుడు. ఎందుకంటే అధికారం లేదు కనుక దానిని సాధించేందుకు, అధికార పరిమితులు సైతం అడ్డు పడవు కాబట్టి కచ్చితంగా ప్రజా ఉద్యమాల వైపు ప్రతిపక్షాలు నిలబడాలి. అది ఎక్కడైనా ఉండేదే. అయితే ఏబీఎన్ వారి కుట్ర పలుకుల్లో ఎక్కడ చంద్రబాబు కనిపించరు. విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తే కనీసం మాట్లాడటానికి భయపడుతున్న చంద్రబాబునాయుడు రాధా కృష్ణకు అసలు కనిపించరు. ఎంతసేపు జగన్ మోహన్ రెడ్డి, ఆయన కుటుంబం మీద ఊహాగానాలు,కల్పితాలు రాస్తుంటారు.
విశాఖ ఉక్కు పోరాటంలో అమరావతి ఎందుకు వచ్చింది?
విశాఖ ఉక్కు విషయంలో నీతులు చెప్పిన ఏబిఎన్ ఆర్కే వారు చాకచక్యంగా అమరావతిని తీసుకొచ్చారు. అమరావతి విషయంలో రాష్ట్ర ప్రజలంతా ఏకమై ఉద్యమించలేదంటూ బాధపడుతూ దానిని ఇప్పుడు ఉక్కు పరిశ్రమ కాపాడుకోవడానికి లంకె పెట్టారు. అమరావతి రాజధాని ఉద్యమం ఒకే సామాజిక వర్గానికి పరిమితమైందని రాష్ట్ర ప్రజలంతా భావించారని, ఇప్పుడు ఉద్యమంలో సైతం అలాంటి ప్రాంతీయత చూపితే వచ్చే భవిష్యత్తు ప్రమాదకరం అంటూ బాధపడ్డారు .
దీనిలో నిజానిజాలు ఆర్కేకు తెలుసు. అమరావతి రాజధాని ఉద్యమం ఎవరు నడిపిస్తున్నారు వెనక ఉన్నది ఎవరు అన్నది రాష్ట్ర ప్రజలు గుర్తించారు కాబట్టే, దాని వెనుక ఉన్న ప్రయోజనాలను తెలుసుకున్నారు కాబట్టే ఆ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తం అవ్వలేదు.కనీసం గుంటూరు జిల్లా మొత్తం పాకలేదు . ప్రజలు అమరావతి ఉద్యమాన్ని కులకోణంలో కన్నా రియల్ ఎస్టేట్ వ్యాపార ఉద్యమమగానే చూశారు . ఇప్పుడు విశాఖ ఉక్కుకు సంబంధం ఏమిటో శ్రీమాన్ ఆర్కే గారి కే తెలియాలి. ప్రతి విషయంలోనూ చంద్రబాబుకు అవసరం అయిన విషయాలను తన కథనాల్లో చూపించే ఆర్కేకు అకస్మాత్తుగా ఇప్పుడు విశాఖ ఉక్కు ఉద్యమ అలజడి కనిపిస్తున్న సమయంలో అమరావతి ఉద్యమం ఎందుకు చేయలేదంటూ ప్రజలపై నిందమోపటం కేవలం రాజకీయమే .
పోలవరం నిధులపై స్పష్టత ఉంది!
పోలవరం ప్రాజెక్టు నిధులు విషయంలో చంద్రబాబు సాధించింది చాలా పరిమితం. జగన్ పలుమార్లు ఢిల్లీ పర్యటనలో పోలవరం మీద ఢిల్లీ పెద్దలను పూర్తిస్థాయిలో నిధులు విడుదలకు ఒప్పించగలిగారు. ఇటీవల జలశక్తి శాఖ తన వార్షిక నివేదికలో సైతం పోలవరానికి పూర్తిస్థాయిలో నిధులు అందించేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. పునరావాసం దగ్గరనుంచి విద్యుత్ ప్లాంటు తాగునీటికి సంబంధించిన నిధులను సైతం అందిస్తామని కేంద్రం తెలిపింది.
చంద్రబాబు హయాంలో పోలవరం అప్పుడు పెడతాను ఇప్పుడు కడతాం అంటూ వృధా మాటలు చెప్పారే తప్ప, జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరం విషయంలో కనీసం కేంద్రం నిధులను తీసుకురాలేకపోయారు. పోలవరం కేవలం చిన్న బ్యారేజిగా రాబోతుందని, కేంద్రం సైతం ఆ చిన్న బ్యారేజీకి నిధులు ఇస్తామని ఒప్పుకుంది అంటూ కొత్త వివాదానికి, కొత్త ఆరోపణలను రాధాకృష్ణ ప్రజల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పోలవరం విషయంలో దీనిమీదే నానాయాగీ చేయబోతున్నట్లు అర్థమవుతోంది. ముఖ్యమంత్రి జగన్ పోలవరం ఎత్తు విషయంలో రాజీ పడేది లేదని, ఖచ్చితంగా 45 మీటర్లు ఎత్తు పోలవరం ఉంటుందని తేల్చి చెప్పారు. మరి జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరాన్ని బ్యారేజిగా ఎలా వర్ణిస్తారు?? దీనిమీద పచ్చ దండు భవిష్యత్తు కుట్ర ఏమిటో రాధాకృష్ణ రచించిన వ్యూహం ఏమిటో ఆయనకే తెలియాలి.
జగన్ లేఖ కనపడదా?
అధికార పక్షం హోదాలో ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్న ఒక వ్యక్తి రాష్ట్రంలో జరుగుతున్న ఓ కీలక విషయం మీద ఎలా స్పందించాలో అంతటి హుందాగా జగన్ స్పందించారు. విశాఖ ఉక్కులో ప్రైవేటీకరణ చేయవద్దని కోరుతూనే, దానికి లాభాలు తెచ్చిపెట్టే మార్గాలను సైతం వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో 4 పేజీల్లో చాలా నిర్మాణాత్మకంగా వివరిస్తూ ప్రధానమంత్రి మోడీ కి లేఖ రాశారు. విశాఖ ఉక్కు ముందున్న లాభాల దారులు ఏమిటి అన్నది ఆ లేఖలో చాలా వివరంగా రాశారు . కేవలం బీజేపీ మీద విమర్శలకో, కేంద్రం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న జగన్ లేఖ రాయలేదు. విశాఖ ఉక్కు ను కాపాడుకోవడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి వివరిస్తూ దానిని అనుసరించి కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. దీనిపై మేధావి వర్గం సైతం జగన్ లేఖను అభినందిస్తూ ఉంది. ఇది మాత్రం ఏబీఎన్ రాధాకృష్ణ కు అస్సలు కనిపించదు వినిపించదు.
చంద్రబాబు పోరాడరు….
విశాఖ ఉక్కు విషయంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలకు హితబోధ చేసి, తన వ్యాసంలో ఎన్నెన్నో చెప్పిన రాధాకృష్ణ కనీసం తెలుగుదేశం పార్టీ అధినేత ఏం చేయబోతున్నారు అన్న విషయాన్ని కనీసం రాయలేదు. చంద్రబాబు కేంద్రంతో ఈ విషయం మీద ఎలా పోరాడాలి రాష్ట్రంలో ఎలా ముందుకు వెళ్లాలి అన్న కనీసం విషయాలను రాయలేదు. బహుశా తెలుగుదేశం పార్టీ దీనిమీద కక్కలేక మింగలేక మదన పడుతున్న సమయంలో ఇతర పార్టీల మీద ఉక్కు పోరాటాన్ని తోసేసి తెలుగుదేశం పార్టీ సేఫ్ జోన్ లోకి వెళ్లే ప్రయత్నంలో భాగంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈవారం కుట్ర పలుకు ఒక దిశానిర్దేశం చేస్తోంది కాబోలు…