Vanajeevi Ramaiah Son Passed Away: వనజీవి రామయ్య ఇంట విషాదం.. గుండె పోటుతో ఆయన కుమారుడు మృతి!

వనజీవి రామయ్య ఇంట విషాదం.. గుండె పోటుతో ఆయన కుమారుడు మృతి!

ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ వనజీవి రామయ్య గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన జీవితంలో కోటికి పైగా మొక్కలు నాటి.. ప్రకృతిని కాపాడుతూ.. ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 60 సంవత్సరాల వయస్సులోనూ రామయ్య అడవుల వెంట తిరుగుతూ వివిధ రకాల విత్తనాలను సేకరించి మొక్కలు నాటుతూ సమాజం పట్ల తన బాధ్యతను చాటుకుంటారు. ఈ క్రమంలో తాజాగా రామయ్య ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమారుడు గుండెపోటు కారణంగా మృతి చెందాడు.

వనజీవి రామయ్య కుమారుడు సైదులు(48) ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు. ఉన్నట్లుండి హార్ట్‌ ఎటాక్‌ రావడంతో.. ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. కుటంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఖమ్మం జిల్లా రూరల్‌ మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో వనజీవి రామయ్య తన కొడుకు సైదులుతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం సైదులు ఉన్నట్లుండి కళ్లు తిరిగి కిందపడపోయాడు. అది గమనించిన వెంటనే కుటుంబ సభ్యులు ఆయనకు సపర్యలు చేసి.. ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందాడు.

సైదులుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తెకు వివాహం జరిగింది. రెండో కుమార్తె ప్రస్తుతం చదువు పూర్తి చేసి.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తుంది. చిన్న వయసులోనే సైదులు మృతి చెందడం తీవ్ర విషాదకరం అంటున్నారు. ఇక కుమారుడి మృతితో వనజీవి రామయ్య ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

Show comments