తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్‌.. 3 రోజుల పాటు కుండపోత వర్షాలు!

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్‌.. 3 రోజుల పాటు కుండపోత వర్షాలు!

గత వారం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇక భాగ్యనగరంలో అయితే ఏకంగా నాలుగు రోజుల పాటు ఎడతెరపి లేని వర్షాలు కురిసాయి. మధ్యలో రెండు రోజులు కాస్త తెరిపి ఇచ్చినట్లే.. ఇచ్చి సోమవారం సాయంత్రం ఒక్క సారిగా కుంభవృష్టిని తలపించేలా భారీ వర్షం కురిసింది. ఇక హైదరాబాద్‌ రోడ్ల మీద భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఈ క్రమంలో తాజాగా వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలకు రెయిన్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు కుండపోత వానలు కురస్తాయని తెలిపింది. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం.. రెండు తెలుగు రాష్ట్రాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది అన్నారు. ఇది అల్పపీడనంగా మారి ఏపీ, తెలంగాణల మీద తీవ్ర ప్రభావం చూపనుందని.. వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.

ఇప్పటికే గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో.. దాని ప్రభావం కారణంగా తెలంగాణలో మూడు రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దాంతో.. ఆయా చోట్ల రెడ్ అలర్ట్‌ ప్రకటించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు మెరుపులతోపాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఉపరితల ఆవర్తన నేపథ్యంలో.. తెలంగాణకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ.. భాగ్యనగరానికి ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఈ క్రమంలో నేడు అనగా మంగళవారం హైదరాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని .. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల్లో ఉండొద్దంటూ అధికారులు నగరవాసులకు సూచించారు. ఉపరితల ఆవర్తన నేపథ్యంలో వాతావరణ శాఖ.. తెలంగాణలోని వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేయగా.. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

ఏపీలో కూడా భారీ వర్షాలు..

ఉపరితల ఆవర్తన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆవర్తనం అల్పపీడనంగా మారి.. రేపటికి.. వాయుగుండంగా బలపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతో.. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమలోనూ పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Show comments