హైదరాబాద్‌ చివరి నిజాం మనవడు మృతి.. నేడు హైదరాబాద్‌లో అంత్యక్రియలు

హైదరాబాద్‌ చివరి నిజాం మనవడు మృతి.. నేడు హైదరాబాద్‌లో అంత్యక్రియలు

హైదరాబాద్ రాష్ట​ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవడు ప్రిన్స్ షహమత్ ఝా(70) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ కుమారుడు మోజమ్ జా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ప్రస్తుతం మరణించిన షహమత్‌ ఝా.. ఉస్మాన్‌ అలీఖాన్‌ రెండో భార్య అన్వరీ బేగం కుమారుడు. ఇక షహమత్‌ ఝా కూడా ఇద్దరిని వివాహం చేసుకున్నారు. కానీ విబేధాల కారణంగా వారి నుంచి విడిపోయి.. ఒంటరిగా జీవించారు. రెండు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికి ఆయనకు సంతానం లేరు. షహమత్‌ ఝా కొన్నేళ్ల క్రితం రెడ్‌హిల్స్‌లోని తన ఇంటిని విక్రయించి.. బంజారహిల్స్‌లో ఉంటున్న తన సోదరి దగ్గర ఉంటున్నారు.

షహమత్‌ మేనల్లుడు హిమాయత్ అలీ మీర్జా ఆయన బాగోగులను చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం షహమత్‌ అనారోగ్యానికి గురికావడంతో మేనల్లుడు ఆయనని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నప్పటికి.. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆదివారం మృతి చెందారు. షహమత్ ఝూ మరణంతో ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. షహమత్‌ ఝా తండ్రి మోజం ఝా పేరు మీదుగానే.. నిజాం ప్రస్తుతం ఉన్న మోజమ్‌ జాహీ మార్కెట్‌కు ఆ పేరు పెట్టారు.

సోమవారం ఉదయం షహమత్‌ ఝా అంత్యక్రియలను జరపనున్నారు. కోఠిలోని మస్జిద్-ఎ-జూడి ప్రాంతంలో తాత ఉస్మాన్‌ అలీ ఖాన్‌ సమాధి పక్కనే షహమత్ ఝూ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా షాజీ అనే పెనుపేరుతో షహమత్ ఝూ ఒక కవిత్వం కూడా రాశారు.

Show comments