ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మకమైన యాషెస్ టెస్ట్ సిరీస్ సమరం మెుదలైంది. ఇక ఈ సిరీస్ తొలి మ్యాచ్ లో ఆసీస్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్ లో ఇరు జట్లు విజయం కోసం చివరి దాకా పోరాడాయి. చివరి రోజు తొలి సెషన్ ఆట మెుత్తం వర్షార్పణం కాగా.. మిగిలిన సెషన్స్ లో కంగారుల జట్టు పని పూర్తి చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (65), కెప్టెన్ కమ్మిన్స్ (44) వీరోచిత బ్యాటింగ్ తో ఆసీస్ అద్భుతమైన విజయం సాధించింది. ఈ క్రమంలోనే తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో అర్ధ శతకంతో చెలరేగిన ఖవాజా.. ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు.
ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ లో కంగారుల జట్టు బోణీ కొట్టింది. తొలి టెస్ట్ లో 2 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 281 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది ఆసీస్ జట్టు. ఇక ఈ మ్యాచ్ లో చివరి వరకు విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. డేవిడ్ వార్నర్, లబూషేన్, స్మిత్ లాంటి కీలక ఆటగాళ్లు అవుట్ అయినప్పటికీ.. ఒంటరి పోరాటాన్ని కొనసాగించాడు ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా. తొలి ఇన్నింగ్సలో 141 పరుగులు చేసిన ఖవాజా.. రెండో ఇన్నింగ్స్ లో 65 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఇక రికార్డు వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్ బౌలింగ్ ను ఎదుర్కొని ఈ టెస్ట్ లో 5 రోజులు బ్యాటింగ్ చేశాడు ఖవాజా. ఈ మ్యాచ్ లో మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన ఖవాజా.. మెుత్తం 518 బాల్స్ ఎదుర్కొని 206 పరుగులు చేశాడు. దాంతో టెస్టుల్లో 5 రోజులు బ్యాటింగ్ చేసిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో 13వ ప్లేయర్ గా ఖవాజా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో ఇండియన్ ప్లేయర్ ఉండటం విశేషం.
1960లోనే ML జైసింహ అనే ఆటగాడు 5 రోజులు బ్యాటింగ్ చేశారు. ఆ తర్వాత మరో ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్ ఈ ఘనత సాధించారు. వారిలో దిగ్గజ క్రికెటర్ రవిశాస్త్రీ, చటేశ్వర పుజారాలు ఉన్నారు. ఇక ఖవాజా ఈ రికార్డుతో పాటుగా మరికొన్ని ఘనతలు కూడా సాధించాడు. 8 సంవత్సరాల తర్వాత యాషెస్ సిరీస్ లో సెంచరీ కొట్టిన ఆసీస్ ఓపెనర్ గా రికార్డు కెక్కాడు. అంతేకాక ఎడ్జ్ బాస్టన్ గ్రౌండ్ లో శతకం బాదిన రెండో కంగారూ ప్లేయర్ గా నిలిచాడు. ఇక ఇంగ్లాండ్ అనుసరించిన బజ్ బాల్ స్ట్రాటజీ అన్ని జట్లపై అనుసరించదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
Usman Khawaja has become the 13th man to bat every day in a five-day Test match 😯#ENGvAUS | #Ashes pic.twitter.com/501vjSSgL8
— ESPNcricinfo (@ESPNcricinfo) June 20, 2023