SNP
SNP
ఆసియా కప్ 2023లో పసికూన నేపాల్‌పై విజయం సాధించిన టీమిండియా టోర్నీలో సూపర్ 4 దశకు చేరింది. సోమవారం పల్లెకెలె వేదికగా జరిగిన మ్యాచ్‌లో నేపాల్ బ్యాటింగ్‌లో టీమిండియాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. తమ బౌలర్లకు బౌలింగ్ ప్రాక్టీస్ కోసం ముందుగా బౌలింగ్ ఎంచుకుంటున్నట్లు టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. కానీ, మ్యాచ్ మొదలైన తర్వాత అది టీమిండియా బౌలర్లకు బౌలింగ్ ప్రాక్టీస్ కంటే కూడా.. నేపాల్ బ్యాటర్లకు ప్రాక్టీస్‌లా మారిపోయింది.
వచ్చిన క్యాచ్‌లను వచ్చినట్లే టీమిండియా టాప్ ఫీల్డర్లుగా పేరున్న విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ వదిలేయడం, వీళ్లకు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ సైతం తోడవ్వడంతో.. నేపాల్ ఇన్నింగ్స్‌లో ఆరంభంలోనే వచ్చిన మూడు అవకాశాలు చేజారాయి. ఆ తర్వాత నేపాల్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారనే చెప్పాలి. ప్రపంచంలోనే అగ్రశ్రేణి జట్టుగా ఉన్న భారత్‌తో తొలి సారి మ్యాచ్ ఆడుతున్నా.. ఆ జట్టులో ఏ మాత్రం భయం, బెరుకు కనిపించలేదు. వందలకొద్ది మ్యాచ్‌లు ఆడి, చిత్తుగా ఓడిన జట్టుపై ఆడుతున్నట్లు ఆడారు నేపాల్ బ్యాటర్లు.
పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా లేకపోవచ్చు. కానీ, తొలిసారి తమను ఎదుర్కొంటున్న ఓ పసికూన జట్టుకు మన బౌలర్లు ఏకంగా 230 పరుగులు సమర్పించుకోవడం ఆందోళనకలిగించే విషయం. ఇదే నేపాల్ ప్లేస్‌లో ఏ ఆస్ట్రేలియానో, ఇంగ్లండ్ టీమో ఉండి ఉంటే.. నిన్నటి మ్యాచ్‌లో కచ్చితంగా 400 పరుగులు బాదేవారు. అంత ఆర్డినరీగా ఉంది మన బౌలింగ్. నేపాల్ బ్యాటర్లలో 8వ స్థానంలో వచ్చిన సోంపాల్ కామి ఏకంగా 48 పరుగులు చేశాడంటేనే అర్థం అవుతుంది. మన బౌలర్లు ఏ రేంజ్‌లో తేలిపోయారో.
చివర్లో 8వ వికెట్ రనౌట్ రూపంలో వచ్చింది. అది కూడా నేపాల్ బ్యారట్ల పోరపాటుతోనే ఆ వికెట్ దక్కింది కానీ, లేకుంటే నేపాల్ ఆలౌట్ కాకుండా 50 ఓవర్లు ఆడి ఉంటే.. టీమిండియా పరువు మరింత గంగలో కలిసేది. అప్పటికీ 48.2 ఓవర్ల పాటు టీమిండియా బౌలింగ్ ఎటాక్‌ను ఎదుర్కొని 230 పరుగులు చేశారంటే.. నేపాల్ జట్టును మెచ్చుకోవాల్సింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్, ఫీల్డింగ్‌లో దారుణంగా విఫలమైంది. కానీ, భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో నిర్దేశించిన 145 పరుగుల టార్గెట్‌ను ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించడంతో కాస్త పర్వాలేదనిపించింది. రోహిత్ 74, గిల్ 67 పరుగులతో రాణించారు. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్, ఫీల్డింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
231 Runs target for India#AsiaCup2023 #INDvNEP pic.twitter.com/DVBBplVFeY
— RVCJ Media (@RVCJ_FB) September 4, 2023
ఇదీ చదవండి: వైరల్ వీడియోపై గౌతం గంభీర్ రియాక్షన్.. మళ్లీ అలాగే చేస్తానంటూ..!