ఆ నూరవ సారి ఎప్పుడు పవన్‌?

‘ఒక మార్పుకోసం యుద్ధం చేయాల్సి వస్తే.. తొంభైతొమ్మిది సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తాను, నూరవసారే యుద్ధం చేస్తాను’ అంటూ తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనాన్ని క్రియేట్ చేస్తోంది. దీనిపై ఎవరికి తోచిన భాష్యం వారు చెప్పుకుంటున్నారు. సినీనటుడిగా తనకున్న గ్లామర్‌నే ప్రధాన వనరుగా భావించి రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ కల్యాణ్‌ వివిధ అంశాలపై స్పందించే తీరు కూడా సినిమాటిక్‌గానే ఉంటుంది. తాను ఏ తరహా డైలాగ్‌లు పలికితే అభిమానులు ఉర్రూతలూగిపోతారో తెలిసిన ఆయన అదే తరహా డైలాగులతో ఓటర్లను కూడా ఆకర్షించాలని చూస్తారన్న విమర్శలు ఉన్నాయి. అందుకే తాను చేసే ‍ప్రసంగాల్లోనూ, ట్విట్‌లలోనూ ఆ తరహా వ్యాఖ్యలనే తరచు చేస్తుంటారు. బహిరంగ సభల్లో అయితే అచ్చం సినిమాలో మాదిరిగానే అ…హ.. అంటూ ఊగిపోతూ డైలాగ్‌లు చెబుతూ అభిమానులను అలరిస్తారు.

రాజకీయాలకు ఈ ధోరణి సరైనదేనా?

సినీ నటులు రాజకీయాల్లోకి రావడం, రాణించడం అన్నది ఎప్పటినుంచో ఉన్నదే. తెలుగునాట కొంగర జగ్గయ్య మొదలు పవన్‌ కల్యాణ్‌ వరకు ఎందరో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. పదవులు చేపట్టారు. అయితే ఒక పార్టీని స్థాపించి రాజకీయాల్లో బలంగా ఎంట్రీ ఇచ్చింది మాత్రం ఎన్టీఆర్‌, చిరంజీవే. అల్లుడు చంద్రబాబు టీడీపీని కబ్జా చేయడంతో రాజకీయాల నుంచి ఎన్టీఆర్‌ హఠాత్తుగా కనుమరుగైపోగా, చిరంజీవి తన పార్టీ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి నిర్ణయాన్ని జీర్ణించుకోలేని పవన్‌కల్యాణ్‌ పంతం పట్టి, సొంతంగా జనసేనను 2014లో స్థాపించారు. కానీ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టకుండా ఎంతసేపు అభిమానులను అలరించే కోణంలోనే రాజకీయం చేస్తున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు.

తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏంచేస్తుందో చెప్పి, వారి విశ్వాసాన్ని పొంది అధికారంలోకి రావడానికి ఆయన గట్టి ప్రయత్నం ఇప్పటివరకు చేయలేదు. 2014లో బీజేపీ, టీడీపీలకు మద్దతు ఇచ్చి అసలు పార్టీని పోటీలోనే నిలుపలేదు. 2019 ఒంటరిగా పోటీ చేసినా పార్టీని, ఆయన మేనిఫెస్టోను జనంలోకి బలంగా తీసుకెళ్లలేకపోయారు. అందుకే తాను పోటీచేసిన రెండు చోట్లా ఓడిపోవడమేకాక ఒకే ఒక్క స్థానానికి జనసేన గెలవగలిగింది. అయినా ఇప్పటికి తన పంథా మార్చుకోకుండా అభిమానులను అలరించడంపైనే దృష్టి సారిస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పార్టీ స్థాపించినది మొదలు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా వైఎస్సార్‌ సీపీని విమర్శించడం తప్ప పవన్‌ మరే పార్టీని గట్టిగా ప్రశ్నించలేదు. తనకు తీరిక దొరికినప్పుడో, బుద్ధి పుట్టినప్పుడో ఒక వీడియోను వదలడం, ట్వీట్‌ చేయడం వంటివి చేస్తున్నారు. ఎక్కువ సమయం తనకు ఇష్టమైన షూటింగ్‌లకు వెచ్చిస్తున్నారు.

ప్రజాసమస్యలు పట్టవా?

రాజకీయాన్ని ఒక పార్ట్‌ టైమ్‌ వ్యవహారంలా మార్చేసిన పవన్‌ ప్రజా సమస్యలపై కూడా అడపాదడపా స్పందిస్తున్నారు. ఏ సమస్యమైనా కడదాకా పోరాడి బాధితులకు ఊరట కల్పిస్తారు అన్న భరోసా ఇవ్వలేకపోతున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై, రాష్ట్రంలో రోడ్ల సమస్యపై, 217 జీవో పై ఆయన చేసిన పోరాటాలే ఆందుకు ఉదాహరణలు. స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల తరపున పోరాడతానంటూ ఆవేశంగా ప్రసంగించిన ఆయన ఆ తర్వాత ఆ అంశంపై మాట్లాడడమే మానేశారు. రోడ్ల గురించి రాజమహేంద్రవరంలో ఒకరోజు హడావుడి చేసి ఊరుకున్నారు. మత్స్యకారుల కోసం చేసిన ఉద్యమం అంతే. ప్రజాసమస్యలపై పోరాడడానికి, వారి బతుకుల్లో గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికి ఒక జీవితకాలాన్ని రాజకీయాలకు వెచ్చించినా సంతృప్తి ఉండదంటారు. అలాంటిది ‘ఒక మార్పుకోసం యుద్ధం చేయాల్సి వస్తే నూరవసారే చేస్తాను’ అంటే ఎలా అర్థం చేసుకోవాలి. ఆయన ఇప్పటికి ఎన్నిసార్లు శాంతియుతంగా ప్రయత్నం చేశారు? ఏఏ అంశాల్లో చేశారు. ఆ నూరవసారి ఎప్పుడు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Show comments