175కు 175 సీట్లు కచ్చితంగా గెలవాలి.. గ్రాఫ్‌ తగ్గొద్దు: సీఎం జగన్‌

175కు 175 సీట్లు కచ్చితంగా గెలవాలి.. గ్రాఫ్‌ తగ్గొద్దు: సీఎం జగన్‌

మరికొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2019 ఎన్నికల్లో విజయం సాధించి.. సంక్షేమ పథకాలతో.. దేశానికే ఆదర్శంగా నిలిచి.. ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఈ క్రమంలో 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో.. పూర్తి మెజారిటీ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం జగన్‌. రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలకు మరింత చేరువవ్వడం.. వారి సమస్యలు తెలుసుకుని.. పరిష్కరించేందుకుగాను వినూత్న కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు సీఎం జగన్‌. ఈ క్రమంలోనే ఆయన కొన్నాళ్ల క్రితం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం, జగనన్నకు చెబుదాం కార్యక్రమాలను తీసుకువచ్చారు.  ఈ క్రమంలో తాజాగా సీఎం జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు…

సీఎం జగన్‌ బుధవారం.. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో గడప గడపకు మన ప్రభుత్వంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. జగనన్న సురక్ష తర్వాత మరో కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘గడప గడపకు కార్యక్రమం అత్యంత కీలకం. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఇది మనకు చాలా ఉపయోగపడే కార్యక్రమం. రానున్న 9 నెలలు అత్యంత కీలకం. 175కి 175 సీట్లు కచ్చితంగా గెలవాలి. కొన్ని కోట్ల మంది మనపై ఆధారపడి ఉన్నారు. కోట్ల మంది పేదలకు మంచి జరుగుతోంది’’ అని సీఎం అన్నారు.

‘‘ఎమ్మెల్యేల పని తీరు బాగుంటేనే వారిని కొనసాగిస్తాం. పనితీరు బాగోలేని ఎమ్మెల్యేలను కొనసాగించడం వల్ల వారికీ నష్టం, పార్టీకి నష్టం. సర్వే చేసినప్పుడు మీమీ గ్రాఫ్‌లు సంతృప్తికరంగా ఉండాలి. దీని కోసం గడపగడపకు కార్యక్రమం ఉపయోగపడుతుంది. అంతేకాక ఈ కార్యక్రమం మనం ప్రజలకు చేరువగా ఉండేందుకు చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల మీ గ్రాఫ్‌ పెరుగుతుంది. పార్టీకి మేలు జరుగుతుంది. అలా జరగకపోతే ఆయా ఎమ్మెల్యేలని మార్చక తప్పని పరిస్థితి వస్తుంది’’ అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

Show comments