TDP Leaders Joined In YSRCP: ఉత్తరాంధ్రలో TDPకి భారీ షాక్‌.. వైసీపీలో చేరిన కీలక నేతలు

ఉత్తరాంధ్రలో TDPకి భారీ షాక్‌.. వైసీపీలో చేరిన కీలక నేతలు

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మరి కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే సర్వేలన్ని.. ఏపీలో మరోసారి వచ్చేది వైసీపీ సర్కారే.. జగనే మరో సారి సీఎం కాబోతున్నాడని.. బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. ఇక గెలుపు కోసం టీడీపీ, జనసేన ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా.. జనాలు మాత్రం.. మా నమ్మకం నువ్వే జగన్‌ అంటున్నారు. ఎన్నికలకు మరో 6 నెలల సమయం ఉండగానే.. అధికార పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో ఉత్తరాంధ్రలో టీడీపీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. విజయనగరం, అనకాపల్లి జిల్లాల నుంచి ముఖ్య నేతలు అధికార వైసీపీలో చేరారు.

విజయనగరం జిల్లా రాజాంకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, ఆయన తనయుడు డాక్టర్‌ తలే రాజేష్ మంగళవారం.. అధికార వైసీపీలో జాయిన్‌ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.. ఈ సందర్భంగా సీఎంకు పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం సీఎం జగన్.. టీడీపీ నేతలు భద్రయ్య, రాజేష్‌లకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇక తలే భద్రయ్య.. గతంలో పాలకొండ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున 1985, 1994 ఎన్నికల్లో విజయం సాధించారు. అలాగే ఆరేళ్ల పాటు.. ఏపీపీఎస్సీ సభ్యుడిగా పనిచేశారు. భద్రయ్య, ఆయన కుమారుడు వైసీపీలో చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బా­రెడ్డి, విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ చిన్న శ్రీను, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పాల్గొన్నారు.

అలానే అనకాపల్లి జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. టీడీపీ నేత మలసాల భరత్‌ కుమార్, ఆయన తల్లిదండ్రులు రమణారావు (విశాఖ డెయిరీ డైరెక్టర్‌), ధనమ్మ (మాజీ ఎంపీపీ) వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరి.. పార్టీ కండువా కప్పుకున్నారు. భరత్‌ కుమార్‌ కుటుంబంతోపాటు గంగుపాం నాగేశ్వరరావు (మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్‌), మల సాల కుమార్‌ రాజా (విశాఖ జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి) కూడా పార్టీలో చేరారు.

Show comments