స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ఏ నిర్ణ‌యం తీసుకుంటోంది..?

విశాఖ ఉక్కు – ఆంధ్రుల హ‌క్కు పేరుతో ఏపీలో రాజ‌కీయ‌, కార్మిక‌, ఉద్యోగ ప‌క్షాలు ఉధృత‌స్థాయిలో పోరాడుతున్నాయి. వేలాది మంది కార్మికులు రోడ్డెక్కి సంస్థ‌ను కాపాడుకునేందుకు న‌డుం బిగించారు. ప్ర‌భుత్వం కూడా ప్లాంట్ ప‌రిర‌క్ష‌ణ కోసం త‌న‌వంతు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. తాజాగా జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో కార్మికుల ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని నిర్ణ‌యించ‌డంతో పాటు ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాల‌ని నిర్ణ‌యించింది. మ‌రి కేంద్రం ఏపీ లో జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న లోకి తీసుకుంటుందా..? అంటే అవున‌ని చెప్ప‌లేని ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీలో జరుగుతున్న ఆందోళనలను అస్సలు పట్టించుకోలేన‌ట్లుగా ఉంటోంది. విశాఖపట్నం ప్రజలు.. విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికుల నిరసనలు.. ఆందోళనలను లైట్ తీసుకుంటుంద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే ప్రణాళికతోనే ముందుకు సాగాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఉద్య‌మ‌కారులు కూడా త‌మ ఆందోళ‌న‌ను మ‌రింత ఉధృతం చేసేందుకు వ్యూహాలు ర‌చిస్తున్నారు.

దేశ రాజధాని ఢిల్లీ నుంచి వచ్చిన నివేదికల ప్రకారం.. ఉక్కు కర్మాగారాన్ని క్ర‌మంగా ప్రైవేటీకరించడానికి కేంద్రం బ్లూప్రింట్ సిద్ధం చేసినట్లు సమాచారం. సాంకేతిక వివరాలు ప్లాంట్ సామర్థ్యం.. దాని ఆస్తులను బిడ్ పత్రంలో చేర్చడానికి సమర్పించాలని పరిశ్రమల శాఖను పిలుపునిచ్చినట్టు తెలిసింది. వివరాలు అందిన తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ.. బిడ్డింగ్లో పాల్గొనడానికి ప్రైవేటు సంస్థలను పిలవాలని కేంద్రం డిసైడ్ అయ్యింది. ఆసక్తి గల పారిశ్రామిక సంస్థలు బిడ్ వేయాలని కేంద్రం పిలుస్తుందని వర్గాలు తెలిపాయి. విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి కేంద్రం తీసుకున్న చర్యను ఏపీలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ప్రైవేటీకరించే ప్రణాళికను విరమించుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ప్రకటించారు.

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణ ప్రణాళికను నిలిపివేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. జగన్ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయగా ఆయన మంత్రివర్గం మంగళవారం అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ఆమోదించాలని నిర్ణయించింది. అయినప్పటికీ కేంద్రం ఏపీలో జరుగుతున్న ఆందోళనలను పార్టీల ప్రయత్నాలను లైట్ తీసుకుంటున్నట్టు కనబడుతోంది. ఉక్కు కర్మాగారాన్ని వదిలించుకోవడానికి.. ప్రైవేటు పార్టీలకు అప్పగించడానికి కేంద్రం ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది.

తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో విశాఖ ఉక్కు ఉద్య‌మాన్ని మ‌రింత తీవ్ర‌త‌రం చేసేందుకు కార్మిక సంఘాలు క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. ఉద్య‌మ ప్ర‌ణాళిక‌ల ర‌చ‌న‌ల‌పై క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. ప్ర‌భుత్వం కూడా వారికి పూర్తి ఇస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో ఆందోళ‌న రూపం ఇక‌పై మార‌నుంది. ‘ఎన్నో త్యాగాల ఫలమే విశాఖ స్టీల్‌ప్లాంట్‌. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను మేం వ్యతిరేకిస్తున్నాం’’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ‘‘విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రభుత్వరంగంలో కొనసాగేలా ఉద్యమం కొనసాగిస్తాం. కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తాం. రాయలసీమ నుంచి కూడా ఉద్యమానికి మద్దతుగా నిలుస్తాం. స్టీల్‌ప్లాంట్‌ కోసం ఉక్కుదీక్షతో ముందుకెళ్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం కానివ్వం’’ అని మ‌రో ఎంపీ గోరంట్ల మాధవ్‌ పేర్కొన్నారు.

Show comments