iDreamPost
iDreamPost
చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అరుణ్ జైట్లీ స్మారకోపన్యాసమిచ్చారు. పార్లమెంటులో ప్రస్తుతం 13 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారని వెంకయ్య నాయుడు చెప్పారు. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించాలని రాజకీయ పార్టీలను కోరారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 23 నుంచి ప్రారంభం కానున్నాయి. లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల్లో మూడింట ఒక వంతు స్థానాలను మహిళలకు కేటాయించాలని ప్రతిపాదించిన బిల్లు చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉంది. ఈ బిల్లును 2010లో రాజ్యసభ ఆమోదించింది.
పార్లమెంటు పనితీరులో భారీ సంస్కరణలు అవసరమని చెప్పారు. ఎంపీలకు ప్రవర్తన నియమావళి ఉండాలని, సభ కార్యక్రమాలకు అంతరాయం కలిగించే సభ్యులపై సభాపతి తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండాలని అన్నారు. నాణ్యమైన చట్టాలను, సంపూర్ణ సమాచారం తెలిసియుండి రూపొందించేందుకు వీలుగా చట్టాల రూపకల్పనకు ముందు, ఆ తర్వాత దాని ప్రభావాన్ని మదింపు చేయాలని చెప్పారు. చట్టాల రూపకల్పనలో ప్రమేయమున్నవారినందరినీ భాగస్వాములను చేయడంతోపాటు సాంఘిక, ఆర్థిక, పర్యావరణ, పరిపాలనా ప్రభావాలను ప్రకటించడం ద్వారా లక్షిత ఫలితాల గురించి విస్తృత అవగాహన కలిగించేందుకు ఈ మదింపు దోహదపడుతుందని చెప్పారు.