టీడీపీ…మహిళా నేతలకు ఓ కుచ్చుటోపీ..!

  • Published - 05:18 PM, Wed - 24 February 21
టీడీపీ…మహిళా నేతలకు ఓ కుచ్చుటోపీ..!

మహిళా కార్యకర్తలను ‘జయము జయము చంద్రన్న’ అంటూ కీర్తించమంటారు…! ప్రజలు కాస్త గుర్తుపడతారు, తమ వాగ్ధాటి ఇతరత్రాలతో వార్తల్లో నిలువగలరు అనుకుంటే ప్రతిపక్షాలపై అస్త్రంగా వాడుకుంటారు…! కష్టానికి ప్రతిఫలం లభించకపోతుందా అంటూ పనిచేసుకుంటూ వెళ్తే పదవుల విషాయానికొచ్చే సరికి కూరలో కరివేపాకులా తీసిపడేస్తారు…! ఇదీ స్థూలంగా తెలుగుదేశం పార్టీలో మహిళా నేతలకు లభిస్తున్న ఘనమైన సత్కారం. ఆనాటి నన్నపనేని రాజకుమారి, రోజాలతోపాటు నిన్న మొన్నటి కవిత, సాధినేని యామినిల ఉదంతాలు వీటికి చక్కటి ఉదాహరణలు. కాగా, ప్రస్తుతం ఇదే పరంపరలో సినీ నటి దివ్యవాణి, వంగలపూడి అనితలు పోటాపోటీగా చంద్రబాబు పెట్టే కుచ్చుటోపీని అందుకునేందుకు పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాన్ని ‘అవకాశవాదమంత’లోతుకు తీసుకెళ్లిన నేత ఎవరయా అంటే కచ్చితంగా చంద్రబాబే అని చెప్పాలి. రాజకీయమంటే ప్రజలకు సేవ చేసి..ప్రజల మనసులను గెలవడం అనే కాన్సెప్టును ఏమాత్రం విశ్వసించని చంద్రబాబు…తనదైన వ్యూహాలను అమలుచేస్తూ వచ్చారు. అందులో కీలకమైన ఒక వ్యూహం.. ప్రతిపక్షాలపైకి మహిళా నేతలను ఎగదొయ్యడం. రాజకీయ పబ్బం గడుపుకున్నాక వారిని పూచికపుల్లల్లా తీసిపక్కనపెట్టడం.

ఈ జాబితాలో తొలుత చెప్పుకోవాల్సిన నేత నన్నపునేని రాజకుమారి. పార్టీ వల్ల నా జీవితం నాశనమైందంటూ ఆమె బహిరంగంగానే వ్యాఖ్యానించారంటే విషయాన్ని అర్థంచేసుకోవచ్చు. టీడీపీతోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నన్నపనేని రాజకుమారి సత్తెనపల్లి, వినుకొండల నుంచి ఎమ్మెల్యేగానూ పనిచేశారు. తనదైన వాగ్ధాటితో ఏపీ రాజకీయాల్లో ప్రముఖంగా నిలిచేవారు. అయితే తదనంతర కాలంలో చంద్రబాబు పార్టీ, ప్రభుత్వాల్లో నన్నపనేనికి ఎలాంటి గౌరవం దక్కకుండా తీవ్ర మనోవేదనకు గురిచేశారు. బహుశా ఇది చూశేనేమో రాజకుమారి సొంత కూమార్తె సుధా వైఎస్సార్‌సీపీలో చేరడంతోపాటు 2014లో వినుకొండ నుంచి పోటీ చేశారు.

ఈ జాబితాలో తర్వాత చెప్పుకోవాల్సిన పేరు…రోజా. సినిమాల్లో పాపులారిటీ సంపాదించుకున్న రోజా…సహజంగానే సినీ ఇండస్ట్రీకి దగ్గరైన పార్టీగా పేరొందిన తెలుగుదేశంలో చేరారు. టిక్కెట్టు ఆశించిన రోజాకు మొండిచెయ్యి చూపి తెలుగు మహిళా అధ్యక్షురాలి పదవిని కట్టబెట్టారు. రోజా మంచి వక్త కావడంతో అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలకు తొలి ఛాయిస్‌గా ఆమెనే ఎంచుకొనే వారు. ఇంత కష్టపడిన నాకేందుకు టిక్కెట్టు ఇవ్వరు అని రోజా గట్టిగా ప్రశ్నించడంతో 2009లో నగరి కాకుండా ఓడిపోయే సీటైన చంద్రగిరికి పంపి బలిపశువును చేశారు. దీంతో టీడీపీలో తాళలేక ఆమె పార్టీ మారిన సంగతి తెలిసిందే. ఇదే వరుసలో మరో సినీనటి కవిత సైతం టీడీపీ తీర్థం పుచ్చికుని కన్నీటి పర్యంతం అయిన సంగతి తెలిసిందే.

ఇటీవల కాలంలో ఇన్‌స్టెంట్‌ కాఫీ లాగా ఇన్‌స్టెంట్‌గా టీడీపీలో మెరిసిన మరో మహిళా నేత సాధినేని యామిని. స్వతహాగా ఉన్న చొరవ, లోకేశ్‌ ప్రోత్సాహంతో అతి తక్కువ కాలంలో సాధినేని యామిని టీడీపీలో క్రియాశీలకంగా మారారు. పార్టీ తరపున టీవీ డిబేట్లలో పాల్గొంటూ ప్రత్యర్థులపై విమర్శలు కురిపిస్తుండేవారు. ఎల్లో మీడియా సైతం యామినికి విపరీతమైన ప్రచారం కల్పించేంది. అయితే టీడీపీ ఓడిపోయిన వెంటనే సాధినేని యామిని టీడీపీది అంతా అవకాశవాద రాజకీయం అంటూ బీజేపీ కండువా కప్పుకున్నారు.

సాధినేని యామిని ఎల్లో స్క్రీన్‌పై నిష్క్రమించిన వెంటనే టీడీపీ పెద్దలు ఆ స్థానంలో సినీ నటి దివ్యవాణిని ప్రవేశపెట్టారు. దాంతో ఇదే మహద్భాగ్యం అనుకున్న దివ్యవాణి సైతం దిగజారి వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేస్తున్నారు. దేశంలో బెస్ట్‌ సీఎంగా నిలిచిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై స్థాయి మరిచి నోరు పారేసుకుంటున్నారు. అదే సమయంలో అసమర్థుడుగా గుర్తింపు పొందిన, ప్రజలు తిప్పికొట్టిన లోకేశ్‌ను దివ్యవాణి ఆకాశానికి ఎత్తుతున్నారు. ఎంతలా అంటే దేశంలో వినియోగించే 10 మొబైల్‌ ఫోన్లలో 3 ఏపీలోనే తయారవుతున్నాయి. దానికి కారణం ఎవరో తెలుశా…వన్‌ అండ్‌ ఓన్లీ లోకేశ్‌….! చూస్తుంటే తెలుగుదేశంలో మహిళా నేతలను బలిపశువులను చేసే ప్రహసనం భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లా మారిందా అనిపిస్తోంది!

Show comments