బాబు రాజకీయం : అధికారంలో అణచివేతలు.. ప్రతిపక్షంలో పరామర్శలు..

రాజకీయాల్లో అవసరానికి, పరిస్థితులకు తగినట్లుగా నేతల వ్యవహార శైలి, విధానాలు, మాటలు మారుతుంటాయంటారు. కొన్ని ఘటనలను చూస్తే అది నిజమేనని నమ్మకతప్పదు. అధికారంలోకి వచ్చేందుకు ఒక మాట, వచ్చిన తర్వాత మరో మాట.. అధికారం పోయిన తర్వాత మళ్లీ పాత పాట.. ఇలా సాగుతుంటుంది కొంత మంది నేతల రాజకీయం. ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు ముందు వరసలో ఉంటుందంటారు విమర్శకులు. ఆ విమర్శలు నిజమనేలా ఆయన వ్యవహార శైలి కూడా ఉంటోంది.

తాజాగా చంద్రబాబు.. మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను పరామర్శించారు. ఇటీవల ఢిల్లీలోని హోటల్‌లో ప్రమాదవశాత్తూ జారిపడి మంద కృష్ణ కాలి గాయం కావడంతో సర్జరీ చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న మంద కృష్ణ మాదిగను చంద్రబాబు వెళ్లి పరామర్శించారు. అనంతరం ఇంటి వద్దనే మీడియాతో మాట్లాడారు.

టీడీపీ అన్ని వర్గాల సామాజిక న్యాయం కోసం పని చేసిందని చెప్పారు చంద్రబాబు. ఎస్సీలు, బీసీ, మైనారిటీలకు సామాజిక న్యాయం చేశామని పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీలకు న్యాయం చేశానని, భవిష్యత్‌లోనూ న్యాయం చేస్తానని చెప్పారు.

బాబు మాటలు విన్న వారికి ఆశ్చర్యం, అనుమానం కలిగింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం న్యాయం చేశారనేది అందరిలోనూ కలిగిన అనుమానం. ఏం న్యాయం చేశామో చంద్రబాబు కూడా చెప్పలేదు.

2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని పొందుపరిచారు. ఎలాగైతేనేం అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన హమీ ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేయాల్సిన సమయం వచ్చిందని 2014 సెప్టెంబర్‌లో మందకృష్ణ మాదిగ మీడియా ద్వారా కోరారు. అఖిలపక్షం, తెలంగాణ సీఎం కేసీఆర్‌లతో కలసి ప్రధాని మోదీని కలసి వర్గీకరణ ఒప్పించాలని లేదంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అయితే చంద్రబాబులో చలనం లేదు.

Also Read : బీజేపీతో జనసేన పొత్తు పెటాకులేనా?

పలుమార్లు అడిగినా కూడా బాబు స్పందించకపోవడంతో.. మందకృష్ణ మాదిగ ఉద్యమకార్యాచరణ ప్రకటించారు. విశ్వరూపయాత్ర పేరుతో పాదయాత్ర చేయాలని 2016లో సంకల్పించారు. ఓ వైపు ముద్రగడ పద్మనాభం.. ఇచ్చిన హామీ ప్రకారం కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్‌ చేస్తున్నారని, ఈ సమయంలో మరో ఉద్యమం చేస్తే.. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందంటూ చెబుతూ.. పాదయాత్రను విరమించుకోవాలని అప్పటి ఆర్టీసీ చైర్మన్, ప్రస్తుత టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మందకృష్ణను కోరారు. చంద్రబాబు మాదిగలకు తప్పక న్యాయం చేస్తారన్నారు.

రెండేళ్లు పూర్తయినా ఎస్సీ వర్గీకరణపై బాబు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడంతో మందకృష్ణ మాదిగ పాదయాత్రకు సిద్ధమయ్యారు. కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినా పాదయాత్రకు సిద్ధమైన మందకృష్ణ మాదిగను అడుగు బయటపెట్టనీయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్‌పీఎస్‌ నేతలను హౌస్‌ అరెస్ట్‌లు చేశారు. చంద్రబాబు మమ్మల్ని మోసం చేశారని మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు.

2019 ఎన్నికలకు మూడు నెలల ముందు కూడా మందకృష్ణ మాదిగ.. ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు ఇచ్చిన హామీని గుర్తు చేశారు. హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీకి ముట్టడిని కూడా పోలీసులతో అణచివేయించారు. కనీసం ఎస్సీ కార్పొరేషన్‌ను విభజించి.. మాల, మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్లను అయినా ఏర్పాటు చేయాలని మందకృష్ణ కోరారు. ఆ వినతిని కూడా చంద్రబాబు బుట్టదాఖలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాల, మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు.

ఇచ్చిన హామీని అమలు చేయాలని అడిగిన మందకృష్ణ మాదిగ మాటను పరిగణలోకి తీసుకోకుండా, కనీసం పిలిచి మాట్లాడకుండా, హామీని అమలు చేయాలని ఒత్తిడి చేసిన ప్రతిసారి పోలీసులతో అణచివేయించిన చంద్రబాబు.. ఇప్పుడు పరామర్శకు వెళ్లడం ఎంఆర్‌పీఎస్‌ నేతలకు ఆశ్చర్యం కలిగించింది. న్యాయం చేశాం.. న్యాయం చేస్తామన్న బాబు.. గతంలో ఏం న్యాయం చేశారు..? రాబోయే రోజుల్లో ఏం న్యాయం చేస్తారో..? ఎంఆర్‌పీఎస్‌ నేతలు తెలుసుకోవాలనుకోవడం సహజమే.

Also Read : వామ్మో తాడిపత్రిలో ఇంత మెజారిటీనా..? జేసీ వర్గంలో కలవరం

Show comments