కవరింగ్ టైం: బాబు వదిలేశాడు కాబట్టే ఆ పాప గెలిచిందంట …!

కుప్పం నియోజకవర్గం అనగానే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు కంచు కోట అనే మాట తెలుగుదేశం పార్టీ అంటూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఆ నియోజకవర్గం నుంచి వరుసగా విజయం సాధించడంతో ఆ నియోజకవర్గంలో ఆయనకు ఎదురు లేదు అనే భావన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎక్కువగానే ఉంటుంది. దానికి తోడు సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పెద్దగా ప్రచారం చేయకపోవడం పార్టీ నాయకులతో పెద్దగా మాట్లాడకపోవడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. దీనితో అక్కడ చంద్రబాబు కి తిరుగు లేదని అది చంద్రబాబు ఆస్థానం అనుకుని కొంత మంది భావిస్తూ ఉంటారు.

కానీ వాస్తవ పరిస్థితులు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బయట పడ్డాయి. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు అనుకున్నంత అనుకూలమైన పరిస్థితులు లేవని కార్యకర్తలు భ్రమలో ఉన్నంత బలం అక్కడ లేదని స్పష్టంగా అర్థమైంది. పంచాయతీ ఎన్నికల్లో గాంధీ మున్సిపల్ ఎన్నికల్లో గాని కుప్పం నియోజకవర్గంలో పెద్దగా పార్టీ ప్రభావం చూపించ లేదు. కార్యకర్తలకు పార్టీ అధిష్టానం నుంచి సరైన మద్దతు లేకపోవడంతో స్థానిక నాయకులు కూడా పార్టీ మీద ఎక్కువ నమ్మకంతో సరైన ప్రచారం నిర్వహించి లేకపోవడం పోటీ చేసే అభ్యర్థులకు ధైర్యం చెప్పలేక పోవడం వంటివి కుప్పం నియోజకవర్గంలో ఎక్కువగా జరిగాయి.

అయితే ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో కుప్పం ఎంపీటీసీగా అశ్విని అనే 23 ఏళ్ల అమ్మాయి విజయం సాధించింది. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో సాధించిన ఈ విజయం అత్యంత భారీగానే ఉంది. దాదాపుగా 1,100 ఓట్ల పైచిలుకు మెజారిటీ తో ఈ నియోజకవర్గంలో ఆమె గెలుపొందింది. దీంతో టిడిపి నేతలు కార్యకర్తలు అందరూ కూడా షాక్ అయ్యారు. అక్కడ వైసీపీ అభ్యర్థి పోటీలో ఉండటంతో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఒకరు పోటీలో దిగారు. టిడిపి అభ్యర్థికి కేవలం 73 ఓట్లు మాత్రమే రావడం పార్టీ కార్యకర్తలను కన్నీరు పెట్టించిన పరిస్థితి.

అయితే దీనిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు కొంతమంది నాయకులు సోషల్ మీడియాలో బాగానే కవర్ చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు పరిషత్ ఎన్నికల మీద దృష్టి పెట్టలేదని అందుకే అటువంటి పరిస్థితి వచ్చిందని చంద్రబాబు నాయుడు దృష్టి పెడితే పరిస్థితి మరోలా ఉండేదని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చిన ఫలితాలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇదే విధంగా కవర్ చేసుకోవడం గమనార్హం. టీడీపీ ఎన్నికలను బహిష్కరించింది కాబట్టి వైసీపీ గెలిచింది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

పరిషత్ ఎన్నికలకి ముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అలాగే మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. అదేవిధంగా తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ బరిలోకి దిగింది. కానీ ఈ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ పైకి చెప్పుకునే విధంగా ప్రభావం చూపించలేదు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం మేము పోటీ చేయలేదు కాబట్టి మీరు గెలిచారని చెప్పుకోవడం టిడిపిలో ఉన్న కొంత మంది కార్యకర్తలను కూడా ఆశ్చర్య పరిచింది. ఏది ఎలా ఉన్నా సరే కుప్పం నియోజకవర్గంలో అశ్విని గెలవడం మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గాని నాయకత్వాన్ని గాని మింగుడుపడని అంశం.

Show comments