సౌందర్య గొప్పతనం.. 5 స్టార్‌ హోటళ్లను కాదని ఆ కుటీర్‌లో!

అతి తక్కువ కాలంలో రైజ్ అయి, అతి తక్కువ కాలమే ఆ రైజ్ ని ఎంజాయ్ చేసి, తన రైజ్ తో ఎన్నో సినిమాలకి ప్రాణ ప్రతిష్ట చేసి, కాలయాపన లేకుండా మనందరి దగ్గర నుంచి శెలవు తీసుకుని తిరిగిరాని లోకాలకు మరలిపోయిన సౌందర్య1972 జూలై 18న పుట్టింది. 2004 ఏప్రిల్ 17న హెలికాఫ్టర్ ప్రమాదంలో అతి దయనీయంగా, దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. కొందరు బ్రతికున్నా గుర్తుకు రారు. కొందరు మరణించినా మరపుకు రారు. ఈ రెండింటి మధ్యనా ఉన్న వ్యత్వాసం ఒక అమూల్యమైన జీవితం మాత్రమే. అందుకు సౌందర్యే ఉదాహరణ. దాదాపు వంద సినిమాలు పూర్తి చేసినా, అందులో ఎన్నో సూపర్ హిట్లున్నా సరే ఏ మాత్రం తలబిరుసు అన్న పదానికే తావు లేకుండా ఎంతో సరళంగా,

మరెంతో సాధారణంగా తన జీవితకాలంలో కొనసాగగలగడం ఒక్క సౌందర్యకు మాత్రమే సాధ్యమైంది. ఇది అది అందరివల్లా అయ్యే పని కాదు. ప్రయోగం అంతకన్నా కాదు. నటిగా ఏనాడూ ఒక పరిమితి దాటి చేయడానికి ఇష్టపడని సౌందర్య తన మేరకు చేసిన పాత్రలతోనే ఇటు మాస్ అటు క్లాస్ ప్రేక్షకులకి అత్యంత చేరవై, కళ్ళు మూసి తెరిచేలోగా దూరమైపోయింది. రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, జగపతిబాబు లాటి హీరోలతో చేసినప్పుడు ఆమె ప్రవర్తనా సరళి ఎలా ఉండేదో, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రజనీకాంత్ లాటి సూపర్ స్టార్స్ సరసన చేసిన తర్వాత కూడా అంతే అణకువగా ఉండడం ఒక్క సౌందర్య కెరీర్లో మాత్రమే కనబడింది.

లెక్కకు మించి ఏ రోజు ఎవరి గురించి గానీ, ఎవరిపైనా గానీ సెటైర్లు వేయడం, వేరొకరిని ఎద్దేవా చేయడం, చులకన చేసి మాట్లాడడం, ఒకరి మీద నోరు పారేసుకోవడం లాటి బలహీనమైన లక్షణాలను సౌందర్యలో ఏ కోశాన కనబడేవి కావు. సెట్ కొచ్చి, తన పనేదో తాను చూసుకుని నవ్వుతూ వచ్చి, నవ్వుతూ వెళ్ళిపోయేది. ఆ ముఖంలో ఎక్కడా ఏ రోజున బడలిక గానీ, అలసట, విసుగు కనబడేవి కావు. ప్రతీ క్షణం చురుగ్గా ఉండేది. ప్రతీ పాత్రనీ అవలీలగా చేసేది. పిచ్చి డ్రసెలు వేసుకోకపోయినా కూడా అందరినీ ఆకట్టుకునేంత అందాన్ని విరజిమ్మేది. భారతీయ సినిమాలో ప్యాసా లాంటి సినిమాలు చేసిన వహిదా రెహ్మాన్ వంటి వాళ్ళుండొచ్చు.

మదర్ ఇండియా లాటి సినిమాలు చేసిన నర్గీస్ దత్ లు కూడా ఉండొచ్చు. కానీ సినిమా ప్రారంభమైన కొన్ని సన్నివేశాల తర్వాతనే రౌడీల చేతిలో అన్యాయానికి గురై, శీలాన్ని పొగొట్టుకున్న ఒక స్త్రీ మూర్తిగా ఒప్పించి, మెప్పించి, తర్వాతి సినిమా మొత్తాన్ని పండించిన హీరోయిన్ ఎవరైనా ఉంటే గింటే అది ఒక్క సౌందర్య మాత్రమే చరిత్రలో. ఆ సినిమాయే పెళ్ళి చేసుకుందాం. పెద్ద హిట్. సౌందర్యకి ప్రేక్షకలోకానికి ఉన్న గౌరవం….సౌందర్య అన్యాయానికి గురైందనే అవేదనతో చివరంటా ప్రేక్షకుడు ఆమెకు న్యాయం జరగాలనే ఆశతో, దుగ్ధతో సినిమా చూశారు. వాళ్ళు అలా చూసేలా సౌందర్య చేసింది. అదే మరో మరో హీరోయిన్ అయి ఉంటే రేపు సీను పుష్కలంగా చూపించని కారణంగా సినిమా ఫ్లాప్ అయ్యేంత స్కోపున్న కథ అది. తర్వాతి సీనులు చూడడానికి మొహం మెత్తి ఉండేది.

తొలి నుంచి హైదరాబాద్, బంజారా హిల్స్ లో ఉన్న ప్రశాంత్ కుటీర్ లో మాత్రమే స్టే చేయడానికి అలవాటు పడ్డ సౌందర్య తారా స్థాయికి చేరుకున్న తర్వాత కూడా అదే అతి సీదాసాదా గెస్ట్ హౌస్ లోనే ఉండడానికి ఇష్టపడేది. నిర్మాతలు ఫైవ్ స్టార్ హొటల్స్ ఆఫర్ చేసినా కూడా ఏనాడు ఆశపడలేదు. ప్రశాంత్ కుటీర్ని వదలిపెట్టలేదు. సింపుల్ హ్యూమన్ బీయింగ్. వెరీ సింపుల్. లక్షలకి లక్షలు సింగిల్ పేమెంట్స్ పుచ్చుకుంది. అయినా డౌన్ టు ఎర్త్ క్వాలిటీ. కెరీర్లో పోటీ లేని స్థానం చేరుకుంది. సాటి లేని వ్యక్తిత్వాన్ని ప్రదర్శించింది. ఒక ఉదాహరణగా నిలబడింది. చూడాలని ఉంది సినిమాలో మెగాస్టార్ పక్కన హీరోయిన్గా అశ్వనీదత్ ఎంపిక చేస్తే,

ఆ రోజు నుంచి బరువు తగ్గడానికి ఫుడ్ మానేసింది. వెజిటబుల్ సలాడ్స్ పైనే ఆధారపడింది. మెగాస్టార్ తో పాటు సరిసమానంగా డాన్స్ చేసింది. ఎంటర్టైన్మెంట్ సీన్లన్నిటినీ పండించింది. ఆ సినిమాతో సూపర్ స్టార్డమ్‌లోకి దూసుకుపోయింది. హిట్స్ మీద హిట్స్ ……హిట్స్ తోనే అలసిపోయింది. రాజకీయ రంగమే సౌందర్య కొంప ముంచింది. రాజకీయ సభలకి హాజరయ్యే ప్రయాసలో ఓ దిక్కుమాలిన హెలికాఫ్టర్ ఎక్కవలసి వచ్చింది. లోపలే మంటలు ఎగసిపడితే, అరచి అరచి ప్రాణాలు పోయాయి గానీ, హెలీకాప్టర్ తలుపులు తెరుచుకోలేదు.

సౌందర్య బ్రతకలేదు. అందాలొలికే అభినయాల సౌందర్య సజీవంగా దహించుకుపోయింది. ప్రపంచమంతా పాశవికంగా చూసింది. నిస్సహాయతలో నిశ్చేష్టమైపోయింది. పంచభూతాలలో సౌందర్య కలసిపోయింది. పరిశ్రమకి ఈ రోజు గుర్తులేదు. ఆమెతో నటించి, ఆమె కారణంగానే హిట్స్ సాధించిన వారికీ గుర్తులేదు. ఒక్క వైజయంతీ మూవీస్ మాత్రం ఆమె జ్ఖాపకాలను వదులు కోలేదు. కాలం బుగ్గ మీదన ఆ కన్నీటిబొట్టును తుడిచి వేయలేదు. ఈ సంస్థ నిర్మించిన ‘ఆజాద్‌’ విడుదలైన రోజు సందర్భంగా.. అందులో నటించిన చిత్రసౌందర్యలహరిని గుర్తు చేసుకుని నివాళులర్పించింది.

                                                                                              – నాగేంద్ర కుమార్‌

Show comments