పుష్పగిరిలో వజ్రాల వేట… రాళ్లను కూడా వదలటం లేదు!

తెలుగు రాష్ట్రాల్లో వజ్రాలు దొరికే ప్రాంతాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా కర్నూలులోని జొన్నగిరి వజ్రాలకు చాలా ఫేమస్‌. ఇక్కడ వర్షాలు పడ్డ ప్రతీసారి వజ్రాల వేట సాగుతూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాలనుంచే కాక.. వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి జనం వస్తూ ఉంటారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. వజ్రాలు దొరికి రాత్రికి రాత్రి.. లక్షాధికారులు, కోటీశ్వరులు అయిన వారు కూడా చాలా మందే ఉన్నారు. ఇప్పుడు కడప జిల్లాలో వజ్రాల వేట కొనసాగుతోంది.

జిల్లాలోని పుష్పగిరి క్షేత్రం ఉన్న కొండపైన జోరుగా వజ్రాల వేట సాగుతోంది. కడపకు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొండకు కడప, కర్నూలు, అన్నమయ్య జిల్లాలనుంచి పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. వజ్రాల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్వేషణ సాగిస్తున్నారు. ఈ ఆలయంలోని శ్రీ చక్రాన్ని స్వయంగా ఆది శంకారాచార్యులు ప్రతిష్టించారని టాక్‌. దీంతో గుడికి వచ్చే భక్తులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొండను మొత్తం జల్లెడపడుతున్నారు.

తెల్ల రాళ్లు దొరికినా సరే వాటిని దాచుకుంటున్నారు. ఏ రాయి.. ఏ వజ్రంగా తేలుతుందోనన్న ఇదిలో ఉన్నారు. ఒక్క వజ్రం దొరికినా తమ జీవితాలు మారిపోతాయని భావిస్తున్నారు. ఇక, కొండకింద పుష్పగిరి ఊరు ఉంది. ఈ ఊరికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది పారుతూ ఉంది. అంతేకాదు! ఈ క్షేత్రానికి సమీపంలో పాపాఘ్ని, కుమ్ముద్వతి, వల్కల, మాండవి నదులు కూడా పారుతూ ఉన్నాయి. ఐదు నదులు కలిసిన పంచ నదీ క్షేత్రమైన ఇక్కడ చెన్నకేశవ, సంతాన మల్లేశ్వర ఆలయాలు ఉన్నాయి. మరి, పుష్పగిరిలో వజ్రాల వేటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments