విశాఖ జింక్ కర్మాగారం ప్రైవేటీకరణ చేస్తే ఏం జరిగింది, కొనుగోలు చేసిన సంస్థ ఏం చేసింది.

విశాఖ నగరంలో స్వతంత్ర్యకాలం నుంచి పలు భారీ పరిశ్రమలకు అవకాశం ఏర్పడింది. ప్రధానంగా సహజ సిద్ధమైన డాల్ఫిన్ నోస్ కారణంగా ఏర్పడిన షిప్ యార్డ్ ప్రారంభంతో అనేక పరిశ్రమలకు అవకాశం వచ్చింది. అందులో నౌకారవాణా అందుబాటులో ఉన్న నగరం కావడం వల్ల అనేక మంది మొగ్గు చూపారు. ఆ క్రమంలోనే 1966లో విశాఖలో జింక్ పరిశ్రమ ఏర్పాటుకి ప్రభుత్వం ముందుకొచ్చింది. దానిని 1974లో నాటి పరిశ్రమల మంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రారంభించారు. అప్పట్లో ఎకరాకి రూ.850 చొప్పున నష్టపరిహారంగా చెల్లించి 350 ఎకరాలను 250 మంది రైతుల నుంచి సేకరించారు. మింది, నక్కవానిపాలెం, చుక్కవానిపాలెం, ములగాడ తదితర గ్రామాల నుంచి 250 మందికి ఉద్యోగాలు కూడా లభించాయి. నిర్వాసితుల్లో అత్యధికులకు అర్హతను బట్టి ఉపాధి కల్పించారు.

అయితే 2002లో కేంద్రంలో వాజ్‌పేయి, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండగా జింక్‌ ఫ్యాక్టరీ ప్రయివేటీకరణకు శ్రీకారం చుట్టారు. 2004 నుంచి ఉద్యోగులను విఆర్‌ఎస్‌తో తొలగించే చర్యలు ప్రారంభమయ్యాయి. మొత్తం 1,800 మంది ఉద్యోగులను విఆర్‌ఎస్‌ ఇవ్వడం, తొలగింపుల ద్వారా 2013 నాటికి వదిలించుకున్నారు. అనంతరం పరిశ్రమను ‘వేదాంత’ కంపెనీకిధారాదత్తం చేసేశారు. కేంద్రం తన వాటాని కేవలం 27 శాతానికి కుదించడంతో మైనర్ భాగస్వామిగా మిగిలింది. వేదాంత ఆడింది ఆటగా సాగింది.

2013లో జింక్ పరిశ్రమ మూతపడే సమయానికి విశాఖ ఎంపీగా, కేంద్ర మంత్రిగా పురందేశ్వరి ఉన్నారు. జింక్ ఉద్యోగులకు నష్టం జరగకుండా చూస్తామని చెప్పిన ఆమె హామీలు నెరవేరలేదు. తొలుత పరిశ్రమ మూతను తాము వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. కానీ తీరా వేదాంత యాజమాన్యానికి ఆమె సరెండర్‌ అయిపోయి ప్రయివేటీకరణ మంచిదంటూ వ్యాఖ్యలు చేయడం పట్ల అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ 2013 నాటికి మిగిలి ఉన్న 236 మంది ఉద్యోగులకి కూడా విఆర్‌ఎస్‌ అమలు చేయడంతో పరిశ్రమ మూతపడింది.

పూర్వపు హిందూస్తాన్ జింక్ లిమిటెడ్‌కు చెందిన 365 ఎకరాలను విక్రయించేందుకు వేదాంత ప్రయత్నం చేసింది. మింద్ సమీపలో ఉన్న ఈ భూముల విలువ ప్రస్తుతం మార్కెట్ రేట్ ప్రకారం ఎకరా 10 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఆ లెక్కన కేవలం ఈ 365 ఎకరాలను చూసినా 3500 కోట్లు పైమాటే. లండన్ లిస్టెడ్ లండన్-లిస్టెడ్ వేదాంత రిసోర్సెస్ అనుబంధ సంస్థ అయిన స్టెర్లైట్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ పేరుతో ఈ భూములున్నాయి. నిజానికి జింక్‌ పరిశ్రమ ఉత్పత్తిని ప్రారంభించినప్పటి నుంచీ లాభాల్లోనే నడిచింది. ప్రభుత్వ నవరత్నాల్లో ఒక కంపెనీగా జింక్‌ గుర్తించబడింది.

2002లో లెడ్‌ ప్లాంట్‌ను కాలుష్య కారణంతో మూసేశారు. మూతవేసిన తర్వాత ఆ భూములను అమ్మకానికి పెట్టి భారీగా లాభాలు అర్జించారు. జింక్ పరిశ్రమ భూముల్లో సాగిన రియల్ ఎస్టేట్ కారణంగా వేదాంత కంపెనీకి పెద్ద మొత్తంలో ప్రయోజనం జరిగిందంటూ గతంలో మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. జింక్ ఉదంతంపై సీబీఐ విచారణ చేయాలని కూడా కోరారు. అయితే మోడీ ప్రభుత్వం దానిని బుట్టదాఖలు చేయడంతో ప్రైవేటు పరం అయిన ప్రభుత్వ రంగ నవరత్న సంస్థ భూములు విల్లాలుగా మారినట్టు కనిపిస్తోంది.

Show comments