ఒక్క పాట చేసే అద్భుతాలు

సినిమాల్లో సంగీతానికి అందులోనూ పాటలకు ఉన్న ప్రాధాన్యత ఎంతో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడంటే ఆల్బమ్ లో మహా అయితే ఒకటి లేదా రెండు పాటలు బాగుండటం చూస్తున్నాం కానీ అప్పట్లో ఇళయరాజా, రెహమాన్, కీరవాణి, రాజ్ కోటి, మణిశర్మల ఆడియో క్యాసెట్ ప్లే చేయడం మొదలుపెడితే మధ్యలో ఎక్కడా ఫార్వార్డ్ చేసే అవకాశం ఇచ్చే వాళ్ళు కాదు. ఇప్పటికీ ఈ దిగజాలు స్వరాలు సమకూరుస్తున్నా మునుపటి మేజిక్ చేయలేకపోతున్నారన్న మాట వాస్తవం. ఇక వర్తమానం విషయానికి వస్తే ఒక పాట తాలూకు సక్సెస్ సినిమా ఓపెనింగ్స్ మీద ఎంత గొప్ప ప్రభావం చూపిస్తుందో చెప్పేందుకు కొన్ని ఉదాహరణలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

ఇటీవలే విడుదలైన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అటు రివ్యూస్ పరంగా ఇటు పబ్లిక్ టాక్ పరంగా ఏమంత గొప్ప రెస్పాన్స్ తెచ్చుకోని మాట వాస్తవం. కానీ ఊహించని రీతిలో ప్రదీప్ లాంటి కొత్త హీరోకి మొదటి రోజు ఏకంగా కోటిన్నర దాకా షేర్ రావడం అంటే మాములు విషయం కాదు. ఇందులో సింహ భాగం క్రెడిట్ అనూప్ రూబెన్స్ స్వరకల్పనలో చంద్రబోస్ రాసిన ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా’ పాటకే దక్కుతుంది. కేవలం ఆ సాంగ్ కోసమే థియేటర్ కు వచ్చిన వాళ్ళు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. యుట్యూబ్ దశలోనే అది సృష్టించిన సంచలనం అలాంటిది. ఈ పాట లేకుండా సినిమాను కనీసం ఊహించుకోవడం కూడా కష్టమే.

గతంలో హుషారు అనే చిన్న సినిమా వచ్చినప్పుడు కూడా అందులో ‘ఉండిపోరాదే గుండె నీదేలే’ సైతం ఇదే తరహాలో ఆ మూవీ కి బజ్ తేవడంలో దోహదపడింది. ఈ సాంగ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అంటే అల వైకుంఠపురములో త్రివిక్రమ్ శ్రీనివాస్ వాడుకునేంత. ఇప్పటి జెనరేషన్ బెస్ట్ లవ్ సాంగ్స్ లో ఇది టాప్ 3 లో ఉంటుంది. అంతకన్నా ముందు విజయ్ దేవరకొండ గీత గోవిందంలో ‘ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలే’ సైతం యూత్ లో మారుమ్రోగిపోయింది. మిలియన్ల వ్యూస్ లో తడిసిముద్దయిపోయింది. రిలీజ్ కు ముందే ఇదో సంచలనం. ఈ మూడు సినిమాల్లో మిగిలిన పాటలు బాగున్నప్పటికీ ఈ స్థాయిలో రెస్పాన్స్ దక్కించుకోకపోవడం ఇక్కడ గమనించాలి.

Show comments