పెట్రో ధరలు ప్రజలకు ఊరట లేదా, కేంద్రం కనికరించకుండా రాష్ట్ర ప్రభుత్వాలపై భారమా

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ బకాయిలు కూడా సకాలంలో విడుదల చేయడం లేదు. ఇటీవల కరోనా కారణం చూపించి రాష్ట్రాలకు ఇవ్వాల్సిన బకాయిలను వాయిదా వేసింది. దాంతో అనేక రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. అప్పులపై ఆధారపడిన రాష్ట్రాలు అనేకం. ఆంధ్రప్రదేశ్ వంటి ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు కేంద్రం చేయూత ఇవ్వాల్సి ఉంది. విభజన చట్టం ప్రకారం రెవెన్యూ లోటు సహా అనేక విధాలుగా ఆదుకోవాల్సి ఉంది. కానీ మోడీ ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రత్యేక హోదా సహా వెనుకబడిన జిల్లాలకు నిధులు వంటి విషయాల్లో మొండికేస్తోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాల్లో సామాన్యులకు ఊరట కల్పించే అనేక నిర్ణయాలకు ఆస్కారం లేకుండా పోయింది.

సోషల్ మీడియాలో మాత్రం బీజేపీ వర్గాలు పెట్రో ధరల విషయంలో కొన్ని రాష్ట్రాలను ఉదాహరణగా చూపించి ఏపీ ప్రభుత్వంపై విమర్శలకు పూనుకుంటున్నారు. గుజరాత్ లో ధరలను పోల్చి ఏపీలో జగన్ ప్రభుత్వమే అదనంగా పన్నులు వేస్తోందని విమర్శించారు. వాస్తవానికి లీటర్ పెట్రోల్ మూల ధర రూ 33.60గా ఉంది. దానిపై కేంద్రం రూ. 32.90 పన్నులు వేస్తోంది. ఏపీ ప్రభుత్వం రూ. 26.42 పన్నులుగా వసూలు చేస్తోంది. ఇక రవాణా, డీలర్ మార్జిన్ కలిపి లీటర్ కి రూ. 96వరకూ పెట్రోల్ ఉంది. డీజిల్ ధరలపై కూడా పన్నులు దాదాపుగా అదే రీతిలో ఉన్నాయి. గడిచిన ఆరేళ్లలో కేవలం పెట్రోల్ పై వేసిన పన్నులు ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 23 లక్షలు అర్జించిందని విపక్ష కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ తాజాగా విమర్శించారు. అంటే దాదాపుగా ఒక సంవత్సర కాలపు బడ్జెట్ మొత్తాన్ని ప్రజల నుంచి పెట్రోల్ పై పన్నుల రూపంలో కేంద్రం రాబట్టుకోవడం గమనార్హం

భారీ మొత్తంలో పెట్రో ధరల పెరగడానికి కేంద్రం పన్నులు పెంచడమే ప్రధాన కారణంగా ఉంది. ఇక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలన్నా ప్రస్తుతం ఆర్థిక సమస్యల్లో ఉన్న వారికి అసలు సాధ్యం కాని స్థితి ఉంది. కేంద్రం జీఎస్టీ సహా రాష్ట్రాలకు రావాల్సిన వాటాలు, చట్టంలో పేర్కొన్న, స్వయంగా మోడీ చెప్పిన మాటలన్నీ అమలు చేసి ఉంటే ఏపీలో కూడా పన్ను మినహాయింపులకు ఆస్కారం ఉంటుంది. కానీ కేంద్రం తాను చేయాల్సింది చేయకపోగా ఏపీ ప్రభుత్వం మీద కమలనాథులు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. వాస్తవానికి పెట్రోల్ ధర సెంచరీకి చేరిన తొలి రాష్ట్రం కాంగ్రెస్ కాగా, రెండో రాష్ట్రం మధ్య ప్రదేశ్. అంటే మొన్నటి వరకూ బీజేపీ ఏలిన రాష్ట్రం, ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రంలోనే ధరలు ఎక్కువగా ఉన్నాయన్నది సుస్పష్టం. అయినప్పటికీ బీజేపీ నేతలు పెట్రో ధరలపై కూడా ప్రజలతో పరిహాసమాడుతున్నట్టు వ్యవహరించడం విస్మయకరంగా మారింది.

పెట్రో ధరల విషయంపై ప్రజలు ఆందోళనతో ఉన్నారు. చివరకు ప్రభుత్వం కూడా తన చేతుల్లో లేదన్నట్టుగా ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించడం ద్వారా చేతులెత్తేసినట్టు స్పష్టమవుతోంది.ప్రజల మీద భారం మోపుతూ ఏటా సుమారుగా రూ. 2.5లక్షల కోట్లు కేవలం పెట్రో ధరల నుంచి అర్జిస్తూ అదే సమయంలో కార్పోరేట్ ట్యాక్స్ మినహాయింపుల ద్వారా గత బడ్జెట్ లో సుమారు. 1.8లక్షల కోట్లు బడా సంస్థలకు ప్రయోజనం కల్పించడం కేంద్రం రెండు నాలుకల ధోరణిని చాటుతోంది.

గతంలో విపక్షంలో ఉన్న సమయంలో పెట్రో ధరలు అంతర్జాతీయంగా అత్యధికంగా ఉన్న దశలో దేశంలో పెరుగుదలను బీజేపీ నేతలు తీవ్రంగా నిరసించారు. మోడీ, సుష్మా, అరుణ్ జైట్లీ వంటి వారు చేసిన ట్వీట్లు, కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ధరలు తగ్గుతున్నా దేశంలో మాత్రం దినదిన ప్రవర్థమానంగా పెరిగిపోతున్న తీరు ప్రజలను కలచివేస్తోంది. ఇప్పటికే రవాణా ఛార్జీల పెరుగుదలతో నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. సామాన్యుడి జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కేంద్రం పునరాలోచన చేసి ఉపశమన చర్యలకు పూనుకోకపోతే పెద్ద సమస్యగా మారబోతోంది.

Show comments