రామచంద్రపురం మీద మంత్రి వేణు ముద్ర

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం రాజకీయ ఉద్దండులకు కేంద్రం. ఇద్దరు నేతల మధ్య మూడు దశాబ్దాల వైరానికి చిరునామా. ముఖాముఖీ పోటీతో అనేక సార్లు హోరాహోరీగా తలపడిన నియోజకవర్గం. అలాంటి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు ఏపీ బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబోయిన వేణు పాగా వేసే పనిలో పడ్డారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన పట్టు పెంచుకోవడానికి పలు విధాలుగా కృషి చేస్తున్నారు. అందుకు అనుగుణంగా జనంలో చొచ్చుకుపోయేందుకు కార్యక్రమాలు చేపడుతున్నారు. క్షేత్రస్థాయి అనుభవంతో రాజకీయంగా అమాత్య హోదా స్థాయికి ఎదిగిన చెల్లుబోయిన వేణు ప్రజల్లో బలం పెంచుకునే దిశలో వేస్తున్న అడుగులు రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నాయి.

రామచంద్రాపురం అసెంబ్లీ నియోకవర్గం అనగానే పిల్లి సుభాష్‌ చంద్రబోస్, తోట త్రిమూర్తులు పేర్లే వినిపించేవి. కాపు కులానికి చెందిన త్రిమూర్తులు, శెట్టిబలిజ కులస్తుడు బోస్ ఆ రెండు కులాల మద్ధతుతో బరిలో కనిపించేవారు. 1994 నుంచి 2014 వరకూ ఈ ఇద్దరే ఎదురెదురుగా తలపడ్డారు. అ క్రమంలో త్రిమూర్తులు నాలుగు సార్లు, బోస్ మూడు సార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

2019 ఎన్నికల్లో 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా పిల్లి బోస్ మండపేటకి మారిపోయారు. కానీ ఆయన అక్కడ ఓటమి పాలయినప్పటికీ ఎమ్మెల్సీగా జగన్ మంత్రివర్గంలో చోటు దక్కింది. ఆ తర్వాత మారిన పరిణామాలతో ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ రామచంద్రాపురం వ్యవహారాల్లో ప్రత్యక్ష పాత్రకు దూరమయ్యారు.

Also Read : వయసైపోతోంది నాయకా..!

ఇక తోట త్రిమూర్తులు టీడీపీ తరుపున రంగంలో దిగి 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణ చేతిలో ఆయన పరాజయం చవిచూశారు. తొలిసారిగా రామచంద్రాపురం నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పటికీ వేణు వ్యూహాత్మకంగా వ్యవహరించడం, జగన్ ఛరిష్మా కలిసి ఆయన్ని గట్టెక్కించాయి.

ఇక ఓటమి తర్వాత టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన తోట త్రిమూర్తులుకి మండపేట ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడంతో ఆయన కూడా తన సొంత నియోజకవర్గం నుంచి దూరమయ్యారు. ఇలా ఏడాది వ్యవధిలో రామచంద్రాపురంతో ఎన్నో అనుబంధం ఉన్న ఇద్దరు నేతలు దూరం కావడం వేణుకి బాగా కలిసొచ్చింది. ప్రస్తుతం ఆయన తనదైన శైలిలో దూసుకుపోయే ప్రయత్నంలో ఉన్నారు.

తోట త్రిమూర్తులు దూరమయిన తర్వాత టీడీపీ అక్కడ ఢీలా పడింది. తగిన నాయకుడే కరువయ్యారు. దాంతో కొత్తపేట నియోజకవర్గానికి చెందిన శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. కానీ ఆయన మాత్రం అర్థమనస్కంగా అంగీకరించి, అరకొరగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల నాటికయినా రామచంద్రాపురంలో టీడీపీ తగిన నేతలను సిద్ధం చేస్తుందా లేదా అనేది సందేహమే. ఈ పరిస్థితులను ఉపయోగించుకుని ఆలోగా అంతా చక్కదిద్దుకోవాలనే సంకల్పంతో వేణు ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు సీనియర్ల పాత్ర ప్రస్తుతం తగ్గడం, ప్రత్యర్థి పార్టీలో తగిన నేత లేకపోవడం వంటి పరిణామాలు వేణుకి తోడ్పడుతున్నాయి.

Also Read : ఇక జ‌నాల్లోకి జ‌గ‌న్.. ఏం జ‌ర‌గ‌నుందో వేచి చూడాల్సిందే..!

వాటికి తోడుగా వేణుకి స్వతహాగా ఉన్న చొరవ మరింత ఉపయోగపడుతున్నట్టు కనిపిస్తోంది. జెడ్పీటీసీ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికయ్యి, 2014 ఎన్నికల్లో కాకినాడ రూరల్ సీటు నుంచి పోటీ చేసినా ఓటమి పాలయినప్పటికీ వేణు మాత్రం పట్టువీడలేదు. జగన్ వెంట నడుస్తూ ఆయన ఆశీస్సులు పొందారు. దాంతో రాజోలు నియోజకవర్గానికి చెందిన నేత అయినప్పటికీ రామచంద్రాపురం పంపించి ఆయన్ని అసెంబ్లీలో కూర్చోవడానికి అవకాశం ఇవ్వడమే కాకుండా, ఏకంగా క్యాబినెట్ లోకి తీసుకుని సహచరుడిని చేశారు.

ఈ నేపథ్యంలో అధికారం ఉండడం, అనేక సానుకూలాంశాలు కలిసి రావడంతో వేణు పట్టు పెంచుకోవడానికి వేగంగా పావులు కదుపుతున్నారు. ఇటీవల ఉదయాన్నే పర్యటనలు, బ్రేక్ ఫాస్ట్ విత్ మినిస్టర్ వంటి కార్యక్రమాలు మంచి ఆదరణ పొందుతుండడం వేణు హవాకి ఆనవాళ్లుగా కనిపిస్తున్నాయి.

Show comments