సొంత పార్టీ నేత‌ల‌నే దుమ్ము దులిపేసిన దీదీ-సహాయక చర్యలకు రాజ‌కీయ రంగు పుల‌మ‌డంపై ఆగ్ర‌హం

ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణ‌ముల్ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీని ఫైర్ బ్యాండ్ ముఖ్య‌మంత్రి అంటారు. కేంద్ర ప్ర‌భుత్వంపైన‌, బిజెపిపైన ముక్కుసూటి విమ‌ర్శ‌లు చేస్తున్న ముఖ్య‌మంత్రుల్లో ఆమె ఒక‌రు. అయితే ఆమె ప్ర‌తిప‌క్షాల‌పై ఎలా అయితే ఉంటారో…సొంత పార్టీ నేత‌లు ప‌ట్ల కూడా అలానే వ్య‌వ‌హ‌రిస్తారు.

ఇటివ‌లి మ‌మ‌తా బెనార్జీ సొంత పార్టీ కార్యకర్తలను, నాయకులను ప‌ట్టుకొని దుమ్ము దులిపేసింది. క‌రోన వైర‌స్ (కోవిడ్-19) సహాయక చర్యల్ని, ఆంఫన్ తుపాను సహాయక చర్యలకు రాజకీయ రంగు పులమడంపై నేతలకు ఆమె తీవ్రంగా తలంటారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు చేసే సహాయక చర్యలను రాజకీయాల ప్రచారానికి వాడుకోవడం ఏంటని తీవ్రంగా మందలించారు.

అయితే గత తొమ్మిదేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను, ప్రభుత్వ విజయాల్ని మాత్రం సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో ప్రచారం చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ‘‘పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ వ్యవహరించకూడదు. ముఖ్యంగా కోల్‌కతా నేతలను దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నా. ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చు. తలుపులు తెరిచే ఉన్నాయి’’ అని మమతా తీవ్రంగా హెచ్చరించారు.

కోల్‌కతాలో మమతా బెనర్జీ ముఖ్య కార్యకర్తలు, నాయకులతో అంతర్గత సమావేశాన్ని నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో మార్పులు చేర్పులు చేపట్టాల్సిందేనని ఆమె దృఢ నిర్ణయానికి వచ్చినట్లు నాయకులు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, విజయవంతమైన తీరు… ప్రతి ఇంటింటికీ చేరాలని పార్టీ కార్యకర్తలకు నిక్కచ్చిగా తేల్చి చెప్పారు. ‘‘తుపాను, కోవిడ్ సహాయక చర్యల్లో పార్టీ కార్యకర్తలు జోక్యం చేసుకోకూడదు. వాటిని ప్రభుత్వానికి వదిలేయండి. బాధితులందరికీ, ఇతర పార్టీల మద్దతుదార్లకూ సహాయం అందేలా చూడాలి’’ అని తమను ఆదేశించారని ఎంపి పేర్కొన్నారు.

‘‘ఇప్పటికే ప్రతిపక్ష బిజెపి ప్రచారంలో దూసుకుపోతోంది. తానూ సోషల్ మీడియా మాధ్యమంగా ఇకపై ప్రచారాన్ని ముమ్మరం చేస్తా, ప్రజలకు మరింత చేరువవుతా’’ అని ఈ సమావేశంలో మమతా పేర్కొన్నారు. ప్రభుత్వ విజయాలు, పథకాలు ఇంటింటికీ చేరేలా చూడాలని, బిజెపి సోషల్ మీడియాపై తాను చూసుకుంటానని ఆమె స్పష్టం చేసింది. అయితే ఇవేవీ కూడా మీడియాతో పంచుకోకూడదని మమత నిబంధన విధించింది.

ప్ర‌ధాని మోడీని తొల‌గించాల‌న్నామా?

‘‘ఓవైపు క‌రోనా, మ‌రోవైపు అంఫ‌‌న్‌తో పోరాడుతుంటే కొన్ని పార్టీలు మ‌మ్మ‌ల్ని అధికారం నుంచి తొల‌గించాలని చూస్తున్నాయి. ఇది నిజంగా బాధాకరం. మేం ఏమైనా ప్ర‌ధాని పీఠం నుంచి న‌రేంద్ర మోడీని తొల‌గించాల‌ని కోరామా?’’ అని మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారు. కోవిడ్ సంక్షోభ స‌మ‌యంలో బిజెపి రాజ‌కీయాలు చేయ‌డంపై ఆమె తీవ్రంగా మండిప‌డ్డారు. రాజ‌కీయాలు చేసేందుకు ఇది త‌గిన స‌మ‌య‌మేనా అని మమతా సూటిగా ప్ర‌శ్నించారు. మీరంతా గ‌త మూడు నెల‌లుగా ఏమైపోయార‌ంటూ ప్రశ్నలు సంధించారు.

తాము క్షేత్ర‌స్థాయిలో ప‌ని చేస్తున్నామ‌ని, ‌క‌రోనా వైర‌స్‌పై పోరాటంతో పాటు, రాజ‌కీయ కుట్ర‌పైనా బెంగాల్ ప్ర‌భుత్వం గెలుస్తుంద‌ని పేర్కొన్నారు. కాగా అంఫ‌న్ తుపాను వ‌ల్ల రూ.1 లక్ష కోట్ల న‌ష్టం వాటిల్లింద‌ని, దాన్ని భ‌ర్తీ చేయాల‌ని ప‌శ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీనిపై ఆ రాష్ట్ర బిజెపి అధ్య‌క్షుడు దిలీప్ ఘోష్ ‌వ్యంగ్యంగా స్పందించారు. విప‌త్తుల్లో ఆదాయం వెతుక్కునేందుకు ఇదో వ్యూహ‌మ‌ని పేర్కొన్నారు. వ‌చ్చే ఏడాది రాష్ట్రంలో ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో బిజెపి, తృణ‌మూల్ మ‌ధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.

Show comments