రాజ్యసభకు మల్లాడి కృష్ణారావు!

సుదీర్ఘకాలం పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలు అందించిన మల్లాడి కృష్ణారావు తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. వచ్చే నెల నాలుగో తేదీన పుదుచ్చేరిలో ఖాళీగా ఉన్న ఒకే ఒక్క రాజ్యసభ స్థానానికి ఎన్నిక జరగనుండగా.. ఆయన జీవితంలో తొలిసారి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగనున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెసుకు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఆయన అంతవరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న యానాం అసెంబ్లీ స్థానాన్ని ముఖ్యమంత్రి అభ్యర్థి రంగస్వామి కోసం త్యాగం చేశారు. దానికి ప్రతిగా రాజ్యసభ సీటు ఇస్తామని అప్పట్లోనే బీజేపీ నాయకత్వం హామీ ఇచ్చింది.

పుదుచ్చేరి రాజకీయాల్లో కీలక నేత

పుదుచ్చేరి రాజకీయాల్లో మల్లాడి కీలక నాయకుడిగా ఎదిగారు. 1996 నుంచి యానాం అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. మొదట్లో రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి సత్తా చూపిన ఆయన తర్వాత కాంగ్రెసులో చేరి అదే స్థానం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2006 నుంచి పుదుచ్చేరి మంత్రిగా పనిచేస్తూ 2021 వరకు కొనసాగారు. రెవిన్యూ, ఆర్థిక, పర్యాటక తదితర కీలక శాఖలు నిర్వహించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు పుదుచ్చేరిలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల్లో అనేకమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఆ సందర్బంగా బీజేపీ నాయకత్వం వారికి పలు ఆఫర్లు ఇచ్చింది. వారిలో మల్లాడి కృష్ణారావు ఒకరు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. తన సీటును ముఖ్యమంత్రి అభ్యర్థి రంగస్వామికి ఇచ్చారు. దానికి బదులుగా రాజ్యసభ సీటు ఇస్తామని బీజేపీ అగ్రనేతలు ఆయనకు ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు అవకాశం కల్పిస్తున్నారు.

ఎన్నిక లాంఛనమే

మొన్నటి ఎన్నికల్లో బీజేపీ, ఎన్ ఆర్ కాంగ్రెస్ కూటమి మెజారిటీ సీట్లు దక్కించుకుని అధికారంలోకి వచ్చింది. రంగస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. అసెంబ్లీలో బీజేపీ కూటమికి మెజారిటీ ఉన్నందున రాజ్యసభ సీటును కచ్చితంగా గెలుచుకుంటుంది. గతంలో మల్లాడికి ఇచ్చిన హామీ ప్రకారం ఆయన్నే తమ అభ్యర్థిగా నిలబెట్టాలని అధికార కూటమి నిర్ణయించింది. రాజ్యసభ ఎన్నికకు ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 15 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. వచ్చే నెల నాలుగో తేదీన పోలింగ్ జరుగుతుంది. ఐదో తేదీన విజేతను ప్రకటిస్తారు.

Also Read : గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా

Show comments