iDreamPost
iDreamPost
ఇటీవలి కాలంలో సినిమాల కంటే ఎక్కువగా క్వాలిటీ వెబ్ సిరీస్ ల మీద ఫోకస్ పెడుతున్న సోనీ లివ్ దానికి తగ్గట్టే మంచి కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. అందులో భాగంగా వచ్చిన స్కామ్ 1992 ఎంత ఆదరణ పొందిందో చూస్తున్నాం. చందాదారులు కూడా ఈమధ్య కాలంలో బాగా పెరిగినట్టు ఓటిటి వర్గాల సమాచారం. ఇటీవలే విడుదలైన ఏ సింపుల్ మర్డర్ కూడా బాగానే అంచనాలు రేపి ఆడియన్స్ లో ఆసక్తి కలిగించింది. మరి టైటిల్ లోనే హత్యను పెట్టుకున్న ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం
కథ
మనీష్(మొహమ్మద్ జీషాన్ అయ్యుబ్)ఉద్యోగం లేక స్టార్టప్ బిజినెస్ కోసం పెట్టుబడులు వెతుకుతూ ఉంటాడు. భార్య రిచా(ప్రియా ఆనంద్)సంపాదన మీదే ఇల్లు గడుస్తూ ఉంటుంది. ఓసారి ఇన్వెస్టర్ ని కలుసుకునే క్రమంలో పొరపాటున మాఫియా డాన్ పండిట్(యష్ పాల్ శర్మ)తో పరిచయం ఏర్పడుతుంది. డబ్బుకు ఆశపడిన మనీష్ అతను చెప్పిన ఓ హత్యకు ఒప్పుకుని అయిదు లక్షలు అడ్వాన్స్ తీసుకుంటాడు. అయితే పండిట్ చెప్పిన అమ్మాయిని కాకుండా పక్కింటి గృహిణిని పొడిచేసి అక్కడ దొరికిన కోట్ల రూపాయల డబ్బు సంచితో పారిపోతాడు.
చనిపోయిన ఆమె భర్త హంతకుడు ఎవరో తెలియక మనీష్ వేటలో పడతాడు. నిజానికి ఆ కాంట్రాక్టు దక్కాల్సింది హిమ్మత్(సుశాంత్ సింగ్)కు. ఇతనూ మనీష్ ని టార్గెట్ చేసుకుంటాడు. ఇక అక్కడి నుంచి దాగుమూతలా దొంగాట మొదలవుతుంది. ఈ కథకు ఇంట్లో నుంచి ముస్లిం ప్రియుడితో పారిపోయిన హోమ్ మినిస్టర్ కూతురికి లింక్ ఉంటుంది. ఊహించని పరిణామాలలో వరస మర్డర్లు జరుగుతాయి. ఎన్నో ప్రాణాలు పోతాయి. దీనికంతా కారణమైన మనీష్ ప్రయాణం చివరికి ఎక్కడ ముగిసిందనేది సిరీస్ లోనే చూడాలి
నటీనటులు
కథకు మూలకేంద్రమైన జీషాన్ అయ్యుబ్ సంపాదన, వంచన, నేరం మధ్య నలిగిపోయే సగటు మనిషిగా చాలా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. మనీష్ పాత్ర కోరుకున్న వేరియేషన్స్ ని చక్కగా పండించాడు. తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న ప్రియా ఆనంద్ ఇందులో జిత్తులమారి భార్యగా ఆశ్చర్యపరుస్తుంది. ఇంత గ్యాప్ తర్వాత కూడా గ్లామర్ ని మైంటైన్ చేసిన తీరుని మెచ్చుకోవచ్చు. యష్ పాల్ శర్మ పాత్ర నిడివి తక్కువే అయినా తన టైమింగ్ తో గుర్తుండిపోయేలా చేశాడు.
జీషాన్ తర్వాత అంత స్కోప్ దొరికిన క్యారెక్టర్ దుబాయ్ శీనులో విలన్ గా నటించిన సుశాంత్ సింగ్ ది. కరుడుగట్టిన గూండాగా ఎమోషనల్ టచ్ ఉన్న తన క్యారెక్టర్ ని నిలబెట్టాడు. తర్వాత చెప్పుకోవాల్సింది అమిత్ సియాల్ గురించి. పైకి కనిపించకుండా లోపల దుర్మార్గంగా ఆలోచించే వాడిగా చివరి ఫ్రేమ్ వరకు తన ఉనికిని చాటుకున్నాడు. గోపాల్ దత్, అయాజ్ ఖాన్ తదితరులు చాలా న్యాచురల్ గా నటించేసి మెప్పించారు. ప్రతి క్యారెక్టర్ కు సరిపోయే తారాగణం దీనికి దన్నుగా నిలిచింది.
డైరెక్టర్ అండ్ టీమ్
సచిన్ పాఠక్ తీసుకున్న ప్లాట్ లో బోలెడు ఉపకథలు, అయోమయం అనిపించే ట్విస్టులు చాలా ఉన్నాయి. కానీ ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా చాలా జాగ్రత్తగా రాసుకున్న స్క్రీన్ ప్లే ఏ సింపుల్ మర్డర్ ని డీసెంట్ వాచ్ క్యాటగిరీలో నిలబెట్టాయి. అన్ని ఎపిసోడ్లు కలిపి మొత్తం 3 గంటల 59 నిమిషాల నిడివితో సాధ్యమైనంత బోర్ లేకుండా చూసుకున్నాడు. టైటిల్ లో ఏ సింపుల్ మర్డర్ అని పెట్టారు కానీ ఇందులో చాలా హత్యలు జరుగుతాయి. అయితే ఏదీ కూడా జుగుప్సాకరంగా,సెన్సార్ లేని అడ్వాంటేజ్ ని తీసుకుని ఓవర్ వయొలెంట్ గా చూపించే ప్రయత్నం చేయలేదు. అసలు ఆ అవసరమే రాలేదు. అయినా కూడా థ్రిల్స్ కి లోటు లేకుండా చూసుకున్నారు.
క్యాస్టింగ్ లో తీసుకున్న శ్రద్ధ ఈ వెబ్ సిరీస్ కు చాలా ఉపయోగపడింది. చూస్తున్నది క్యారెక్టర్లు కాదు నిజంగా జరిగిన సంఘటనలు అనిపించేలా తన చిత్రీకరణకు తగ్గ నటీనటులను సచిన్ తెలివిగా ఎంచుకుని వాళ్ళ నుంచి కోరుకున్న అవుట్ ఫుట్ రాబట్టుకున్నాడు. నిజానికి క్రైమ్ థ్రిల్లర్స్ కు టెంపో చాలా ముఖ్యం. ఇందులో అది పుష్కలంగా ఉంది. ఒక మలుపు తర్వాత మరొకటి ప్లాన్డ్ గా వచ్చేలా సెట్ చేసుకున్న విధానం ఆకట్టుకుంటుంది. అయితే ఇందులో మైనస్సులు లేకపోలేదు. చాలా చోట్ల లాజిక్స్ ని కన్వీనియంట్ గా వదిలేయడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కొన్ని రిపీట్ సీన్స్ కూడా ఉన్నాయి.
నేపధ్య సంగీతం అందించిన కర్ష్ కాలే సబ్జెక్టుకు తగ్గ మూడ్ ని బాగానే క్యారీ చేశాడు. పరీక్షిత్ ఝా ఎడిటింగ్ పర్వాలేదు. నిడివి కోసమే కొంత సాగతీత ఉంటుంది కాబట్టి మరీ ఎంచాల్సిన అవసరం లేదనిపిస్తుంది. భరత్ వాజ్ ఛాయాగ్రహణం నీట్ గా సాగింది. ఫ్రేమ్స్ బాగా కుదిరాయి. ప్రతీక్ పయోధి డైలాగులు అక్కడక్కడా పేలాయి. ఇతనితో పాటు స్క్రీన్ ప్లేలో పాలు పంచుకున్న అఖిలేష్ జైస్వాల్ కూడా ప్రశంసలకు అర్హుడే. ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి. ఎక్కువ అవుట్ డోర్ లొకేషన్స్ డిమాండ్ చేసినా రాజీ పడకుండా అక్కడే షూట్ చేశారు.
కంక్లూజన్
వెబ్ సిరీస్ లను సినిమాలతో పోలిక తెచ్చి సమీక్షించలేం కాబట్టి వీటిని ప్రత్యేకమైన కోణంలో చూడాల్సిందే. ఆ రకంగా చెప్పుకుంటే ఏ సింపుల్ మర్డర్ ఫైనల్ గా మరీ అద్భుతం అనిపించకపోయినా టైటిల్ కి న్యాయం చేకూరుస్తూ ఈ జానర్ లవర్స్ ఏం కోరుకుంటారో దాన్ని సంపూర్ణంగా అందించింది. విచ్చిలవిడి శృంగార సన్నివేశాలు, హద్దులు మీరిన బూతులు లేకుండా ఇంత సుదీర్ఘమైన సిరీస్ ని నడిపించడం ఇందులోని ప్రధాన ఆకర్షణ. మొత్తం చూశాక ఖచ్చితంగా టైం వేస్ట్ అయ్యిందని మాత్రం అనిపించదు.
ఏ సింపుల్ మర్డర్ – డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్