Idream media
Idream media
నిధులు, నీళ్లు, నియామకాలు.. అనే నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్.. నీళ్ల విషయంలో తన వైఖరిని తాజాగా స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులను ఆయా నదీ యాజమాన్య బోర్టులకు అప్పగించాల్సి ఉండగా.. తెలంగాణ సర్కార్ ఆ పని చేసేలా కనిపించడం లేదు. ఇందుకు కేసీఆర్ ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ప్రాజెక్టుల అప్పగింతపై మీడియా అడిగిన ప్రశ్నకు కేసీఆర్.. తనదైన శైలిలో సమాధానం ఇచ్చి.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం ఇప్పట్లో తేలేది కాదని చెప్పనే చెప్పారు.
కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీలు అనేవి ఏమీ లేవని, అవన్నీ దొంగ డ్రామాలన్న కేసీఆర్.. ఆయా బోర్డుల పట్ల తన వైఖరిని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముందు నదీ జలాల్లో తెలంగాణ వాటాను తేల్చాలని స్పష్టం చేయడంతో.. ఆ విషయం తేలే వరకూ బోర్డులకు ప్రాజెక్టుల అప్పగింత లేనట్లేనని కేసీఆర్ వ్యాఖ్యలతో అర్థమవుతోంది. ప్రాజెక్టుల అప్పగించనంత వరకూ రెండు బోర్డులు పేరుకు మాత్రమే ఉండనున్నాయి.
తెలుగు రాష్ట్రాల మధ్య ముఖ్యంగా కృష్ణా నదీ జలాల విషయంలో వివాదం నెలకొంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి కృష్ణా నదీ జలాలు తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్రాల మధ్య పంపకాలు జరిగాయి. ఆ పంపకాల ఆధారంగానే రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా నీటి వాడకం జరుగుతోంది. అయితే ఇటీవల మరోమారు మొదలైన జల వివాదంలో తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ జలాల విషయంలో సమాన వాటా కావాలని డిమాండ్ చేస్తోంది. కృష్ణా నదిలో 811 టీఎంసీల లభ్యత ఉండగా.. ఆ మొత్తాన్ని ఏపీ, తెలంగాణల మధ్య 70 – 30 శాతం చొప్పన పంచారు. అయితే రెండు బోర్డుల గెజిట్‌ను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నది జలాలను 50 – 50 శాతం చొప్పన పంచాలని డిమాండ్ చేస్తోంది.
నిన్న అధ్యయనం తర్వాత.. నేడు వాటా తర్వాత..
వాస్తవంగా రెండు రాష్ట్రాలు గెజిట్ జారీ అయిన మూడు నెలలకు ప్రాజెక్టులను.. రెండు బోర్టులకు అప్పగించాలి. ఆ గడువు గత నెల 14వ తేదీనే వచ్చింది. ప్రాజెక్టులు అప్పగించేందుకు ఏపీ సిద్ధమైంది. అయితే తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 14వ తేదీ వరకు తేల్చలేదు. ఆ రోజు.. ప్రాజెక్టుల అప్పగింతపై అధ్యయనం తర్వాతే అప్పగిస్తామంటూ ఈఎన్‌సీ మురళీధర్ రావు అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక తర్వాత.. ప్రాజెక్టుల అప్పగింతపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. కమిటీ నివేదిక ఇచ్చేందుకు 15 రోజుల గడువు కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు కేసీఆర్.. ముందు కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని పట్టుబడుతున్నారు. అయితే కమిటీ నివేదికతో ఇప్పుడు పక్కకుపోయింది. కృష్ణా నదీ జలాల్లో వాటా తేలిన తర్వాతే.. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించనుందని స్పష్టమవుతోంది.