“సీఎం” ప్ర‌చారంపై సీరియ‌స్..!

ఊహించిన‌ట్లుగానే టీఆర్ఎస్ రాష్ట్ర కార్య‌వ‌ర్గం స‌మావేశం కొన‌సాగింది. ఎన్నో ప్ర‌శ్న‌ల‌కు సీఎం కేసీఆర్ సూటిగా స‌మాధానాలు ఇచ్చారు. మ‌రోసారి అటువంటి ప్ర‌చారాలు చేసినా.. లూజ్ ఠంగ్ వాడినా ప‌రిణామాలు క‌ఠినంగా ఉంటాయంటూ నేత‌ల‌ను హెచ్చ‌రించారు. మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌వుల ఎంపికై కూడా క్లారిటీ ఇచ్చేశారు. కాబోయే సీఎం కేటీఆర్.. అంటూ కొద్ది రోజులుగా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు స‌హా ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు వంత పాడుతున్నారు. ఎక్క‌డ ఏ స‌మావేశం జ‌రిగినా దీనిపైనే చ‌ర్చ‌. డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మారావు అయితే.. కేటీఆర్ ముందే.. కాబోయే సీఎం కేటీఆర్ అంటూ జై కొట్టారు. దీనిపై రాజ‌కీయ వ‌ర్గాల‌లో క‌ల‌క‌లం రేగింది. ప్ర‌తిప‌క్ష నేత‌లు కూడా సీఎం ప్ర‌చారంపై విమ‌ర్శ‌నాత్మ‌క వ్యాఖ్య‌లు చేశారు. జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల ముందు నుంచీ కొన‌సాగుతున్న ఈ ప్ర‌చారంపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు.

తెలంగాణ సీఎం మార్పు ఉండబోతోందంటూ జరుగుతున్న ప్రచారంపై స్పష్టత ఇచ్చారు. సీఎంగా తానే కొనసాగుతానని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఆదివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ ప‌లు అంశాల‌పై స్పందించారు. దాదాపు రెండున్నర గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, సీఎంగా తానే కొనసాగుతానని వెల్లడించారు. సీఎం మార్పుపై ఎవరూ మాట్లాడొద్దని సూచించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సీల్డ్ క‌వ‌ర్ లో మేయ‌ర్.. చివ‌రి నిమిషం వ‌ర‌కూ ఉత్కంఠ‌

ఈ నెల 12 నుంచి టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుందని, మార్చి 1 నుంచి పార్టీ కమిటీల నియామకం జరుగుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఏప్రిల్‌లో లక్షలాది మందితో టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ఎవరూ పోటీ లేరని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరిస్తే చాలు విజయం టీఆర్‌ఎస్‌దే అని తెలిపారు. ఈ నెల 11న గెలిచిన కార్పొరేటర్లు తెలంగాణ భవన్‌కు రావాలని సూచించారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలకు సంబంధించి చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సీల్డ్‌ కవర్‌లో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థుల పేర్లను పంపిస్తామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.

Show comments