Idream media
Idream media
తెలుగుదేశం పార్టీ అంటే నందమూరి అనే పేరు వినిపించకుండా నారా ఫ్యామిలీ పేరు వినిపించేలా చేయడంలో నారా చంద్రబాబునాయుడు ఓ విధంగా సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. దివంగత నేత నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీని చేజిక్కుంచుకుని మొత్తం టీడీపీని చెప్పుచేతల్లో పెట్టుకున్నారు చంద్రబాబు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా చక్రం తిప్పుతున్నారు.
కానీ, 2019లో తెలుగుదేశం ఘోరం ఓడిపోయినప్పటి నుంచీ పార్టీతో పాటు బాబుకు కూడా డౌన్ ఫాల్ మొదలు కావడం ప్రారంభమైంది. ఎంతలా అంటే.. జూనియర్ ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు)ను తీసుకురావాలంటూ చంద్రబాబు పర్యటనలోనే నినాదాలు ఇచ్చేటంతగా. గతంలో బాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే ఆయనకు ఎదురైన ఈ అనుభవం నిజానికి పెద్ద షాకే అని చెప్పాలి.
Also Read:పంజ్ ‘షేర్’ పంజా దెబ్బకు పిట్టల్లా రాలిన తాలిబన్లు..?
ఇది అంతటితో ఆగలేదు.. ఆ తర్వాత కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ జెండాను 40 అడుగుల ఎత్తున ఎగరేశారు. భారీ స్థాయిలో ఫ్లెక్సీలు పెట్టారు. ఇలా టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్‌పై చర్చ కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి 2009 ఎన్నికల్లో టీడీపీకి స్టార్ క్యాంపెయినర్ జూనియర్ ఎన్టీఆరే. తన వాళ్లకు కూడా టిక్కెట్లు కూడా ఇప్పటించుకున్నట్లు చెబుతారు. ఆ పార్టీ తరఫున జోరుగా ప్రచారం చేశారు. ప్రమాదానికి గురైనప్పటికీ మంచంపై ఉండి మరీ టీడీపీకి, చంద్రబాబు ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. ఆ తర్వాత ఎన్నికలకు ఆయన దూరంగా ఉన్నారు. లేదు.. దూరం పెట్టారనే ప్రచారం జరిగింది. అందుకు కారణం.. 2009 ఎన్నికలు టీడీపీకి కలిసి రాకపోయినా.. జూ.ఎన్టీఆర్ ప్రచారానికి, ప్రచార స్టైల్ కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఈ క్రమంలో మున్ముందు నారా వారసుడికి పోటీ వస్తాడన్న భయంతో చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను కావాలనే పక్కన పెట్టారని చాలా మంది భావించారు.
వాస్తవం కూడా అంతే కావచ్చు. జూనియర్ ఎన్టీఆర్ తెరపైకి వస్తే.. ఆయనకున్న స్టార్ డమ్, వాక్చాతుర్యం ముందు లోకేశ్ కనుమరుగు కావాల్సిందే. అందుకే ఓ ప్లాన్ ప్రకారం.. ఎన్టీఆర్ ను పక్కన పెడుతూ వచ్చినట్లు కనిపిస్తోంది. తమ హీరోను చంద్రబాబు పట్టించుకోకపోవడాన్ని ఎన్టీఆర్ అభిమానులు జీర్ణించుకోలేపోతున్నారు. తమ అభిమాన కథానాయకుడికి మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆశాభావంతో ఉన్నారు.
Also Read:కోగంటి సత్యం – ఎందుకిలా?
ఇదిలాఉండగానే గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి కావడంతో టీడీపీలోకి ఎన్టీఆర్ రావాల్సిందేనన్న డిమాండ్ ఊపందుకుంది. చంద్రబాబు ముందే తెలుగు తమ్ముళ్లు ఆ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. అంతేకాదు.. సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి వంటి వారు కూడా ఆరు నెలల క్రితం పార్టీ ఆవిర్భావ దినోత్సాల వేళ జూనియర్ ఎన్టీయార్ పార్టీ పగ్గాలు చేపట్టి ముందుకు నడిపించాలని గట్టిగా కోరారు. టీడీపీకి ఆయన అవసరం ఇపుడు చాలానే ఉందని కూడా గోరంట్ల అభిప్రాయపడ్డారు.
బుచ్చయ్య చౌదరి కామెంట్స్ పై అంతర్గతంగా పార్టీలో పెద్ద చర్చకే దారి తీసింది. తెలుగుదేశం పార్టీ అంటే నారా ఫ్యామిలీదే అనే ముద్ర పడేలా చేసిన చంద్రబాబును ఈ తరహా పరిణామాలు సహజంగానే కలవరానికి గురి చేస్తాయి. తన తర్వాత తనయుడు నారా లోకేష్ కే పగ్గాలు దక్కేలా చాలా ఏళ్ళ నుంచే జాగ్రత్త పడుతూ రాజకీయాలు నడిపిస్తున్నారు. పదేళ్ళ క్రితమే జూనియర్ ఎన్టీఆర్ ని దూరం పెట్టేశారు. ఆయన కుమారుడినే ప్రోత్సహిస్తున్నారు. పార్టీలో అందరూ లోకేష్కే జై కొట్టాలి అనుకుంటున్న తరుణంలో బుచ్చయ్య నోట జై జూనియర్ ఎన్టీఆర్ మాట రావడంతో బాబు వెంటనే అప్రమత్తమైనట్లు కనిపించింది. నాటి నుంచే గోరంట్లకు పార్టీలో పొగ పెట్టడం మొదలైందన్న వాదన ఉంది. చివరికి బుచ్చయ్య చౌదరి రాజీనామా చేస్తాననడం వరకు వెళ్లడం వెనుక ప్రధాన కారణం ఆయన నోట జూ.ఎన్టీఆర్ ప్రస్తావన రావడం, దీంతో ఆయనను వెనక్కి నెట్టడానికి మరో వర్గాన్ని కావాలనే ప్రోత్సహించారనే ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత పార్టీకి భారీ నష్టం జరుగుతుందనే సంకేతాలు రావడంతో మళ్లీ బుచ్చయ్య చౌదరితో చర్చలు జరిపారు.
Also Read:పవన్ కళ్యాణ్ కంటే బండి సంజయ్ బెటర్ అవుతున్నాడా …?
బుచ్చయ్య చౌదరి ఎపిసోడ్ ను పరిశీలిస్తే అది కనిపించేటంత చిన్నదేమీ కాదు. ఆయన టీడీపీలో ఉంటూ తమ నాయకత్వాన పనిచేస్తూ జూనియర్ ఎన్టీఆర్ అంటూ కలవరించడంతోనే ఆయనకు తిప్పలు మొదలైనట్లుగా కనిపిస్తోంది. దీన్ని బట్టి పార్టీలో ఎన్టీఆర్ పేరు ఎవరి నోట వినిపించకుండా గోరంట్ల కు ఇచ్చిన ట్రీట్ మెంట్ కొనసాగుతుందన్న వార్నింగ్ చంద్రబాబు, లోకేశ్ పరోక్షంగా ఇతర నేతలకు ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి పార్టీ పరిస్థితి బలంగా ఉంటే, బుచ్చయ్యతో బాబు మాట్లాడేవారు కాదన్న వాదనా ఉంది. ప్రచారాలు, వాదనలు ఎలాగున్నా నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీలో అదే వంశానికి చెందిన జూ.ఎన్టీఆర్ పేరు కొద్ది కాలంగా పదే పదే ప్రస్తావనకు రావడం మున్ముందు ఎటువంటి పరిణామాలకు దారి తీయనుందో వేచి చూడాల్సిందే.