రూట్ డబుల్ సెంచరీ – పటిష్ట స్థితిలో ఇంగ్లండ్

  • Published - 11:28 AM, Sat - 6 February 21
రూట్ డబుల్ సెంచరీ – పటిష్ట స్థితిలో ఇంగ్లండ్

టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ పట్టు బిగించింది.. ఇంగ్లండ్ సారథి జోరూట్‌ ద్విశతకంతో రెచ్చిపోగా బెన్‌స్టోక్స్‌ అర్ధ శతకంతో రాణించాడు. కాగా 100 వ టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా కెప్టెన్ గా ఇంగ్లండ్ సారధి రికార్డు సృష్టించాడు. 98, 99, 100వ టెస్టుల్లో కూడా 150+ స్కోర్లు సాధించిన ఏకైక ఆటగాడిగా జో రూట్ రికార్డు నెలకొల్పాడు.

శనివారం 263/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టును సారథి జో రూట్(377 బంతుల్లో 218; 19 ఫోర్లు, 2 సిక్సర్లు‌)ముందుండి నడిపించగా బెన్‌స్టోక్స్(82; 118; 10×4, 3×6) అర్ధ సెంచరీ సాధించాడు. నాలుగో వికెట్‌కు రూట్,బెన్‌స్టోక్స్ జోడీ 124 పరుగులు జోడించగా ప్రమాదకరంగా మారుతున్న బెన్‌స్టోక్స్ ను నదీమ్ ఔట్ చేసాడు. అనంతరం రూట్‌-పోప్‌ అయిదో వికెట్‌కు 86 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా పోప్‌ (34)ను అశ్విన్‌ చక్కని బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కొద్దిసేపటికే జో రూట్‌ (218)ను నదీమ్‌ ఎల్బీగా ఔట్‌ చేశాడు. వరుస బంతుల్లో ఇషాంత్ శర్మ బట్లర్(30),జోఫ్రా ఆర్చర్ లను బౌల్డ్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. అప్పటికే ఇంగ్లండ్ జట్టు పటిష్ఠస్థితిలో నిలవడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. డొమినిక్ బెస్(28),జాక్ లీచ్(6) పరుగులతో క్రీజులో ఉన్నారు. దాంతో ఇంగ్లండ్ 180 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 555 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా, అశ్విన్‌, నదీం,ఇషాంత్ శర్మ తలో రెండు వికెట్లు సాధించారు.

రికార్డుల రూట్

ఈ మ్యాచ్ ద్వారా అత్యుత్తమ ఫామ్ లో ఉన్న ఇంగ్లండ్ సారధి జో రూట్ పలు రికార్డులను నమోదు చేశాడు. 100 టెస్టులో సెంచరీ సాధించిన 9వ బ్యాట్స్‌మన్‌గా రూట్‌ నిలిచాడు. 100 వ టెస్టులో డబుల్ సెంచరీ చేసి అత్యధిక స్కోరు సాధించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు..అంతేకాకుండా 98,99,100 టెస్టుల్లో 150 కి పైగా స్కోర్ చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా, ఆస్ట్రేలియా దిగ్గజం,మాజీ సారథి డాన్‌బ్రాడ్‌మన్‌ తర్వాత వరుసగా మూడు టెస్టుల్లో 150కి పైగా పరుగులు సాధించిన ఏకైక కెప్టెన్‌గా రూట్ రికార్డు సృష్టించాడు. తాజా డబుల్ సెంచరీతో ఐదో డబుల్ సెంచరీ తన ఖాతాలో వేసుకున్న రూట్ ఆసియా ఖండంలో వరసగా మూడు సెంచరీలు చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.

Show comments