అబద్ధం అతికేలా ఉండాలి బాబు..!

కృష్ణా జిల్లా పెడన మండలం అర్థనూరు పంచాయతీలో టీడీపీ 72 ఓట్లతో గెలిచిందని, ఆ సమయంలో కరెంట్‌ పోయిందని, ఆ తర్వాత రీ కౌంటింగ్‌లో వైసీపీ గెలిచిందని చెప్పారు.

విజయనగరం జిల్లా గుర్ల మండలం గిరడ పంచాయతీలో 16 ఓట్లతో టీడీపీ గెలిస్తే.. కరెంట్‌ తీసివేసి తర్వాత రీ కౌంటింగ్‌ పెట్టి 110 ఓట్లతో వైసీపీ గెలిచిందని ప్రకటించారు.

కర్నూలు జిల్లా డోన్‌ మండలం చింతలపేటలో టీడీపీ అభ్యర్థి 120 ఓట్లతో గెలిస్తే.. 252 ఓట్లు చెల్లనివి ఉన్నాయని చెప్పి వాటిని తీసేసి వైసీపీ గెలిచినట్లు ప్రకటించారు.

ఈ మాటలు అన్నది ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు. పంచాయతీ మూడో విడత ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన ఈ విధంగా చెప్పుకొస్తున్నారు. అబద్ధం చెబితే అతికేటట్లుగా ఉండాలంటారు. కానీ చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధాలకు అంతూపంతూ ఉండదని మరోమారు రుజువైంది. రెట్టించిన స్వరంతో, కళ్లార్పకుండా మాట్లాడితే నిజమని ప్రజలు నమ్ముతారని చంద్రబాబు భావిస్తారో ఏమో గానీ.. ఆయన తీరు మాత్రం అలానే ఉంటుంది. కరెంట్‌ తీసేసి ఫలితం తారుమారు చేయడం సాధ్యమేనా..? కౌంటింగ్‌ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలిసిన వారికి చంద్రబాబు చెప్పేవి పచ్చి అబద్ధాలని ఇట్టే అర్థమవుతుంది.

కౌటింగ్‌ ఎలా చేపడతారు..?

పోలింగ్‌ ఎలా నిర్వహిస్తారో, కౌటింగ్‌ అంతకన్నా పకడబ్బంధీగా చేపడతారు. టేబుల్‌కు ఒకరు చొప్పన అభ్యర్థుల తరఫున కౌంటింగ్‌ ఏజెంట్‌ను అనుమతిస్తారు. తమ ఏజెంట్‌గా ఎవరు ఉండాలో అభ్యర్థి లేదా అభ్యర్థి తరఫున ఎలక్షన్‌ ఏజెంట్‌గా ఉన్న వ్యక్తి నిర్ణయిస్తారు. కౌంటింగ్‌ కేంద్రంలో అభ్యర్థుల తరఫున ప్రతి టేబుల్‌కు ఒకరు చొప్పున ఏజెంట్, అభ్యర్థి, ఎలక్షన్‌ ఏజెంట్, వార్డు సభ్యులుగా పోటీ చేసేవారు ఉంటారు. వారు లోపలికి వచ్చే సమయంలో పెన్ను, పేపర్‌ తప్పా.. ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులు, సెల్‌ఫోన్లు అనుమతించరు. వారి సమక్షంలో కౌటింగ్‌ చేపడతారు. కౌంటింగ్‌ చేపట్టే ముందు.. చెల్లే ఓట్లు ఎలా ఉంటాయి..? చెల్లని ఓట్లు ఎలా ఉంటాయి..? అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోట్‌ను చూపుతూ రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌ఓ) వివరిస్తారు. స్వస్తిక్‌ ముద్ర తప్పా.. వేలి ముద్ర వేసినా, పెన్నుతో టిక్‌ చేసినా, మరే ముద్రతో ఓటు వేసినా చెల్లదని ఆర్‌వో చెబుతారు. ఒకసారి చెల్లని ఓటుగా నిర్ణయించి.. పక్కన పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అవి మళ్లీ తిరిగి లెక్కింబోమని ఆర్‌ఓ స్పష్టంగా చెబుతారు. దీనికి అందరూ కట్టుబడి ఉండాలని, ఎలాంటి వివాదాలకు, డిమాండ్లకు తావు ఉండదని తేల్చి చెబుతారు.

సందేహాలు నివృత్తి.. సమ్మతి..

ఆర్‌ఓ చెప్పిన అంశాలపై అభ్యర్థులు, వారి తరఫు ఎలక్షన్‌ ఏజెంట్లు, కౌటింగ్‌ ఏజెంట్లు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకుంటారు. అందరూ తమ సమ్మతిని తెలియజేసిన తర్వాత ఆర్‌ఓ ఆదేశాల మేరకు కౌటింగ్‌ సిబ్బంది వార్డుల వారిగా ఒక్కొక్క బ్యాలెట్‌ బాక్సును తెరుస్తారు. తెరిచే ముందు సీల్‌సరిగా ఉందో లేదో ఏజెంట్లకు చూపిస్తారు. అంతా సరిగా ఉందని అందరు చెప్పిన తర్వాతనే ఆ సీల్‌ను ఓపెన్‌ చేస్తారు. బాక్సులోని బ్యాలెట్లను టేబుల్‌పై పోస్తారు. బ్యాలెట్‌ బాక్సు లోపలి భాగాన్ని మరోసారి చెక్‌ చేస్తారు. దాన్ని ఏజెంట్లకు చూపిస్తారు. అందులో ఏమీ లేదని వారు చెప్పిన తర్వాత అధికారులు బాక్సును పక్కనపెడతారు. సదరు వార్డులో ఎన్ని ఓట్లు పోలయ్యాయనే సమాచారాన్ని అధికారి ఏజెంట్లకు చెబుతారు. దాన్ని కౌటింగ్‌ ఏజెంట్లు నమోదు చేసుకుంటారు. టేబుల్‌పై ఉన్న బ్యాలెట్లను ఒకొక్కొటిగా తెరిచి గుర్తుల వారీగా వేరు చేస్తారు. చెల్లని ఓట్లు ఎందుకు చెల్లలేదో అందరికీ చూపించి, వివరించి.. పక్కన పెడతారు. నోటా ఓట్లు వేరు చేస్తారు. గుర్తులు వారీగా వచ్చిన బ్యాలెట్లను 25 చొప్పున కట్టలు కడతారు. బాక్సు తెరిచిన సమయంలో చెప్పిన ఓట్ల సంఖ్యకు, ఓట్లను వేరు చేసి కట్టలు కట్టిన తర్వాత ఓట్లకు సరిపోల్చుతారు. పోలైన ఓట్లు, బాక్సులో ఉన్న ఓట్లు సమానంగా ఉంటే.. గుర్తులు వారీగా వేర్వేరు డబ్బాలో వేస్తారు. ఆ లెక్క సరిపోకపోతే.. మరోసారి కట్టలు లెక్కిస్తారు. ఇలా అన్ని ఓట్లు వార్డుల వారీగా తెరిచి, గుర్తుల వారీగా వేరు చేసి, 25 చొప్పున కట్టలు కట్టి డబ్బాలో వేస్తారు.

బ్యాలెట్‌ చూపించి.. ఆ తర్వాత లెక్కింపు..

ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఓట్ల లెక్కింపును చేపడతారు. లెక్కించే ముందు బారీకేడ్లకు ఆవలవైపు ఉన్న అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లకు ఒకొక్క ఓటును చూపుతారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చు. వాటిని పరిష్కరించిన తర్వాత ఆ ఓటు ఎవరికి వస్తుంది..? చెల్లుతుందా..? లేదా..? అనేది ఆర్‌వో నిర్ణయిస్తారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమ్మతి తర్వాత మళ్లీ ఓట్లను చూపడం ప్రారంభిస్తారు. ఒక అధికారి 25 ఓట్ల చొప్పున కట్టిన కట్టలను చూపుతుంటే.. మరో అధికారి అందులో 25 ఓట్లు ఉన్నాయో లేదో మరోసారి లెక్కించి డబ్బాలో వేస్తారు. అన్ని కట్టలను లెక్కించిన తర్వాత.. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయన్నది లెక్కగడతారు. ఎప్పటికప్పుడు అభ్యర్థులు, ఏజెంట్లు కూడా వాటిని నమోదు చేసుకుంటారు. చివరలో ఆర్‌వో చెప్పిన లెక్కకు తాము నమోదు చేసుకున్న లెక్క సరిపోయిందో లేదో అన్నది ఏజెంట్లు సరిచూసుకుంటారు. అధికారులు లెక్క సరిపోల్చుకుంటారు.

పోలైన ఓట్లు.. బాక్సుల్లో ఉన్న ఓట్లు సమానంగా ఉంటేనే..

సదురు పంచాయతీలో మొత్తం ఓట్లు ఎన్ని, పోలైన ఓట్లు ఎన్ని..? అందులో చెల్లనివి ఎన్ని..? నోటాకు ఎన్ని వచ్చాయి..? ఏ గుర్తుకు ఎన్ని ఓట్లు వచ్చాయి..? ఏ గుర్తు గల అభ్యర్థి గెలిచారు..? ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచారు..? అనే వివరాలను ఆర్‌ఓ ప్రకటిస్తారు. పోలైన ఓట్లలో అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్లు, చెల్లనివి, నోటా ఓట్లు కలిపితే.. మొత్తం పోలైన ఓట్లతో సరిపోవాలి. ఇందులో ఒక్క ఓటు తేడా ఉన్నా.. మళ్లీ సిబ్బంది లెక్కింపు చేపడతారు. ఎన్ని సార్లు లెక్కించిన.. బాలెట్‌ బాక్సుల్లో ఉన్న ఓట్లు మొత్తం పోలైన ఓట్లతో సరిపోవాలి. అభ్యర్థులు అడిగితే.. మళ్లీ అన్ని ఓట్లను చూపుతారు. కానీ ఒక సారి చెల్లవు అని పక్కనపెట్టిన బాలెట్లను తిరిగి లెక్కింపులోకి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోరు.

కుమ్మక్కైయి తారుమారు చేసే పరిస్థితి ఉందా..?

ఈ మొత్తం ప్రక్రియను వీడియలో రికార్డు చేస్తారు. పైగా మైక్రో అబ్జర్వర్‌ కూడా అక్కడ ఉంటారు. చంద్రబాబు చెబుతున్నట్లు ఆర్‌వోలు ఎవరితోనూ కుమ్మక్కైయ్యే పరిస్థితి ఉండదు. లెక్కింపు పూర్తయ్యే వరకూ కౌటింగ్‌ హాలు నుంచి ఎవరూ బయటకు వెళ్లేందుకు వీలు లేదు. వారి సెల్‌ఫోన్లు కూడా హాలులోకి అనుమతించరు. సదరు కౌంటింగ్‌ కేంద్రం కాంపౌండ్‌లోకి ఎవరినీ అడుగుపెట్టనీయరు. లోపల వారు కాంపౌడ్‌ దాటేందుకు వీలు ఉండదు. పోలీసులు పర్యవేక్షణ నిత్యం ఉంటుంది. ఇలా జరిగే కౌంటింగ్‌ ప్రక్రియలో చంద్రబాబు చెబుతున్నట్లుగా.. కరెంట్‌ తీసేసి ఫలితాలు తారుమారు చేయడం సాధ్యమా..? అందుకే మొదట్లో చెప్పుకున్నట్లు అబద్ధం చెబితే అతికినట్లు ఉండాలి. లేదంటే బండారం బయటపడుతుంది. 

Read Also : సత్తా చాటిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. ఒక్క దెబ్బకు మూడు పిట్టలు..

Show comments