9 ఓట్ల ఎంపీ కొణతాల రాజకీయాలు వదిలేశాడా ?

ఎన్నికల్లో ఒక్క ఓటుతోనే అభ్యర్థుల జాతకాలు తారుమారు అయిపోతుంటాయి. అందుకే నాయకులు ప్రతి ఓటును కీలకంగా భావించి శక్తియుక్తులు ఒడ్డుతుంటారు. వార్డు ఎన్నికల్లోనే ఒక ఓటు తేడా వచ్చినా నానా హడావుడి చేసి రీ కౌంటింగుకు పట్టు పడుతుంటారు. అలాంటిది ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమాహారమైన పార్లమెంటు నియోజకవర్గాన్ని కేవలం 9 ఓట్ల తేడాతో గెలుచుకోవడం చిన్న విషయం కాదు. ఆ ఘనత సాధించిన మొదటి నేత మన రాష్ట్రంలోనే ఉన్నారని నేటి తరంలో చాలామందికి తెలియకపోవచ్చు. ఆ నేతే కొణతాల రామకృష్ణ. అనకాపల్లికి చెందిన ఈయన ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.సుమారు రెండు దశాబ్దాలు కాంగ్రెసులో కీలక పాత్ర పోషించి.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహితుల్లో ఒకరిగా పేరుపొందిన కొణతాల గత మూడేళ్లుగా తెరమరుగయ్యారు.

ఉద్యమాలతో వెలుగులోకి..

వ్యాపార వర్గానికి చెందిన కొణతాల ఉద్యమాల ద్వారా వెలుగులోకి వచ్చారు. 1980లలో కాంగ్రెసులో చేరిన ఆయన కుటుంబం అనకాపల్లి వర్తక సంఘంలో ఇప్పటికీ కీలకపాత్ర పోషిస్తోంది. బెల్లం వ్యాపార వర్గాల్లోనూ మంచి పట్టు ఉంది. కాంగ్రెసు నుంచి రెండుసార్లు ఎంపీ అయిన కొణతాల రైవాడ జలాశయం నీటిని విశాఖ నగరానికి తరలించడాన్ని నిరసిస్తూ జరిగిన ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఈ ఉద్యమం విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో కొణతాల ఎదుగుదలకు తోడ్పడింది. అలాగే నల్ల బెల్లం నిషేధానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలోనూ కీలకపాత్ర వహించారు. సారా తయారీకి ఉపయోగిస్తున్నారంటూ నల్ల బెల్లంపై ప్రభుత్వం నిషేధం విధించడంతోపాటు బెల్లం వ్యాపారానికి కేంద్రమైన అనకాపల్లి వ్యాపారులపై కేసులు పెట్టడంతో దీనిపై ఆ ప్రాంత రైతులు, వర్తకులు నిర్వహించిన ఉద్యమానికి నాయకత్వం వహించి కొంత విజయం సాధించారు.

Also Read: సైకిల్ ఎమ్మెల్యే గురించి తెలుసా!

తొలి విజయమే సంచలనం

1989 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం ద్వారా కొణతాల తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పెతకంశెట్టి అప్పలనరసింహంపై కేవలం 9 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. అప్పటివరకు అంత తక్కువ మెజారిటీతో లోకసభ సభ్యుడిగా ఎన్నికైన వారెవరూ లేరు. ఆ ఎన్నికల్లో కొణతాలకు 2,99,109 ఓట్లు లభించగా.. టీడీపీ అభ్యర్థి అప్పలనరసింహానికి 2,99,100 ఓట్లు వచ్చాయి. 1991 ఎన్నికల్లో మళ్లీ అనకాపల్లి ఎంపీగా నెగ్గిన కొణతాల 1996లో మాత్రం ఓటమి పాలయ్యారు.

1990 నుంచి 1992 వరకు విశాఖ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1999 ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీ బరిలోకి దిగిన ఆయన టీడీపీ అభ్యర్థి దాడి వీరభద్రరావు చేతిలో ఓడిపోయారు. 2004లో అదే దాడి వీరభద్రరావును ఓడించి అసెంబ్లీలోకి ప్రవేశించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడమే కాకుండా ఆయనకు సన్నిహితునిగా వ్యవహరించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కొణతాల.. ఆ తర్వాత వైఎస్ మరణం, జగన్ వైఎస్సార్సీపీ ఏర్పాటు వంటి పరిణామాల్లో జగన్ వెంట నిలిచి ఆ పార్టీలో చేరారు.

2014 ఎన్నికల్లో విజయమ్మ పోటీ చేసిన విశాఖ పార్లమెంటు స్థానానికి పార్టీ ఎన్నికల ఇంఛార్జిగా వ్యవహరించిన కొణతాల తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేకపోయారన్న ఆరోపణలు వినిపించాయి. ఆ ఎన్నికల తర్వాత వైఎస్సార్సీపీకి దూరమైన కొణతాల మధ్యలో కొన్నాళ్లు టీడీపీలోకి వెళ్లారు. గత ఎన్నికల సమయంలో మళ్లీ వైఎస్సార్సీపీలోకి వస్తారన్న ప్రచారం జరిగింది. కానీ అది వాస్తవం కాలేదు. అప్పటి నుంచి ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కుమార్తెలు వివాహాలు, వ్యాపార వ్యవహారాలతోనే గడుపుతున్నారు.

Also Read : మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ గుర్తున్నారా ?

Show comments