అయ్యన్నా.. ఇంత అడ్డగోలుగానా.? ఇందుకేనా మిమ్మల్ని ప్రజలు దూరం పెట్టింది..

తెలుగుదేశం నాయకుల తీరే వేరు. తాము ఏం చెప్పినా జనం ఇట్టే విశ్వసిస్తారని వాళ్లకు గట్టి ధీమా. అందుకే ఆపార్టీ అధినేత చంద్రబాబు నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు వరకూ అందరూ అదే పంథా అవలంభిస్తున్నారు. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్చనీయాంశం అయ్యింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం మీద కార్మికులు మండిపడుతున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో స్పష్టతనిచ్చేలా నేరుగా ముఖ్యమంత్రి స్పందించారు. ప్రధానికి లేఖ రాస్తూ విశాఖ ఉక్కు నిలదొక్కుకునే అవకాశం ఉందని, దానికి తగ్గట్టుగా చేయూతనివ్వాలని కోరారు. దానికి తగిన మార్గాలను నేరుగా ప్రధానికి సూచించారు. మరోవైపు ఏపీ పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరో అడుగుముందుకేసి ప్రైవేటుకి అప్పగించాలనుకుంటే తామే బిడ్డింగ్ వేస్తామని తేల్చేశారు.

టీడీపీ నేతలు మాత్రం ప్రైవేటీకరణ చేస్తున్న మోడీని పల్లెత్తు మాట అనడానికి సిద్ధంకావడం లేదు. దేశమంతా గ్యాస్ ధరలు పెరిగినా డౌన్ డౌన్ సీఎం అంటూ ఏపీలో ధర్నాలు చేస్తున్న తరహాలోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి జగన్ ని నిందించాలని నిర్ణయానికి వచ్చేశారు. మోడీ ప్రభుత్వ విధానాలను వేలెత్తిచూపాల్సిన సమయంలో దానికి విరుద్ధంగా వైఎస్సార్సీపీ మీద బురజల్లేందుకు సిద్ధమవుతున్నారు. అందుకు అనుగుణంగానే ఆపార్టీ నేతల వ్యాఖ్యలున్నాయి. తెలుగువారంతా ఐక్యంగా ఉండి పోరాడి సాధించిన స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అందరి ఐక్యత కోరాల్సిన దానికి బదులుగా టీడీపీ నేతలు ప్రజలను విభజించేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.

చింతకాయల అయ్యన్నపాత్రుడు టీడీపీలో సీనియర్ నేతగా బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. అందులోనూ విశాఖ జిల్లాకే చెందిన మాజీ మంత్రిగా మరింత జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆయన మాటలు అందుకు భిన్నంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను అమ్మేస్తుంటే దానికి జగన్ ని నిందించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో లక్ష కోట్ల ఖరీదైన బాక్సైట్ ని కాజేసేందుకు ఈ కుట్ర అని విమర్శలు చేశారు. తాటిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడకి గడ్డి కోసం అన్నట్టుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బాక్సైట్ కి ముడిపెట్టి అయ్యన్న చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి. నిజానికి బాక్సైట్ తవ్వకాల కోసం చంద్రబాబు పన్నిన కుయుక్తులు అన్నీ ఇన్నీ కావు. అందుకు అయ్యన్నపాత్రుడు అండగా నిలిచిన అనుభవం కూడా ఎవరూ మరచిపోలేదు. కానీ అదే బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా అధికారంలో ఉన్నప్పుడు పోరాడి గద్దెనెక్కగానే బాక్సైట్ తవ్వకాలను ఉపసంహరించి ముఖ్యమంత్రిగా జగన్ ని మన్యం వాసులు గుర్తుంచుకున్నారు. కానీ టీడీపీ నేతలు మాత్రం ప్రజలను వంచించాలని చూస్తున్నారు. ముగిసిపోయిన అధ్యాయంగా ఉన్న బాక్సైట్ కి, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు ముడిపెట్టి వింత, వితండ వాదనలకు పూనుకుంటున్నారు.

అయ్యన్న అడ్డగోలు వాదనలకు అంతూపొంతూ ఉండదని మరోసారి నిరూపించుకున్నారు. జగన్ మీద విమర్శలు చేయడం పెద్ద విశేషం కాదు గానీ బాక్సైట్ తవ్వకాలతో సీఎం ఏకంగా రూ. 1లక్ష కోట్లు కోసం ప్రయత్నిస్తున్నారని చేసిన విమర్శలు విస్మయకరంగా ఉన్నాయి. టీడీపీ నేతలు రానురాను అన్నీ వదిలేసి అర్థం లేని విమర్శలతో కాలం గడిపే యత్నంలో ఉన్నారని అభిప్రాయం కలిగిస్తున్నాయి.

Show comments