ఫ‌లిస్తున్న విజ‌య‌సాయిరెడ్డి పోరాటం

ఉభ‌య స‌భ‌ల్లో వైసీపీ ఎంపీల పోరాటాలు ఫ‌లిస్తున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మ‌స్య‌లు, ప్ర‌త్యేకించి ఉత్త‌రాంధ్ర అభివృద్ధిపై వారు చేస్తున్న డిమాండ్ల‌లో కొన్నింటికి అక్క‌డిక‌క్క‌డే కేంద్ర మంత్రులు స‌మాధానాలు ఇస్తున్నారు. మ‌రికొన్నింటికి రాత‌పూర్వ‌కంగా కూడా హామీలు ఇస్తున్నారు. విజయనగరంలో 73.68 కోట్ల రూపాయల వ్యయంతో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి కార్మిక బీమా సంస్థ (ఈఎస్‌ఐ) ఆమోదించినట్లు కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ వెల్లడించారు. వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు బుధవారం రాతపూర్వక సమాధానమిచ్చారు. ఈ ఆస్పత్రిలో ప్రాథమిక వైద్య సేవలతోపాటు ఔట్‌ పేషెంట్‌, ఇన్‌ పేషంట్లకు ప్రత్యేక వైద్య సదుపాయాలను కల్పించబోతున్నట్లు వెల్లడించారు. ఎమర్జెన్సీ సర్వీసులు, ఆపరేషన్‌ థియేటర్‌, లేబర్‌ రూమ్‌, డయాగ్నోస్టిక్స్‌ సేవలు, మందుల పంపిణీతో వంటి సకల సదుపాయాలను అందుబాటులోకి తీసురానున్నట్లు తెలిపారు. అదే విధంగా.. ఈ ఆస్పత్రిలో ఆయుష్‌ కింద కూడా రోగులకు సేవలు అందిస్తారని చెప్పారు. ఆస్పత్రి నిర్మాణాన్ని 2023 నాటికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

గృహ రుణాల వడ్డీపై సబ్సిడీ పథకం పొడిగింపు

మధ్య తరగతి ప్రజలు తమ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ప్రవేశపెట్టిన గృహ రుణాల వడ్డీపై సబ్సిడీ చెల్లింపు పథకం (సీఎల్‌ఎస్‌ఎస్‌)ను ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి తెలిపారు. రాజ్యసభలో బుధవారం వఘెస్సార్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (అర్బన్‌) కింద అర్హులైన మధ్య తరగతి ప్రజలు గృహ రుణాలపై వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో చెల్లిస్తుందని అన్నారు.అదే విధంగా అర్హులైన లబ్దిదారులు రుణం పొందిన వెంటనే వడ్డీ మొత్తాన్ని వారి అకౌంట్‌ ద్వారా రుణం తీసుకున్న సంస్థలకు ప్రభుత్వం బదలాయిస్తుందని తెలిపారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద గృహ రుణాలపై వడ్డీ సబ్సిడీ పథకాన్ని గత ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్లు మంత్రి తెలిపారు. 2020-21 మధ్యకాలంలో ఈ పథకం కింద 1.67 లక్షల మంది లబ్ది పొందారు. పథకం ప్రారంభిన నాటి నుంచి ఇప్పటి వరకు 4.93 లక్షల మంది ప్రయోజనం పొందారని మంత్రి చెప్పారు.

ప్ర‌త్యేక హోదా కోసం వీడ‌ని ప‌ట్టు

రాష్ట్ర విభజన, కరోనా ప్రభావంతో ఆర్థికంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లోనే ప్రత్యేక హోదా ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అంత‌కు ముందే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొద్ది రోజుల క్రితం వ‌ర్చువల్‌గా జ‌రిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ ని ఆయ‌న డిమాండ్ చేశారు. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు కావాల్సి ఉందని, వాల్తేరు డివిజన్‌ను కొనసాగిసూ్తనే ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు పనులను పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు రైతు గిట్టుబాటు ధర పొందే హక్కును చట్టబద్ధం చేయాలని కోరారు. విశాఖలో జాతీయ ప్రాధాన్యం కలిగిన విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని ఆ అఖిల‌ప‌క్ష స‌మావేశంలో ప్ర‌ధానిని విజ‌య‌సాయి కోరారు.

Show comments