ప్రస్తుత జీవన విధానంలో సెల్ఫీలు దిగడం అలవాటుగా మారిపోయింది. కొందరికైతే వ్యసనంగా కూడా మారింది. విపత్కర పరిస్థితుల్లో కూడా సెల్ఫీల కోసం ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్న వారు చాలామంది ఉన్నారు. కొందరికి తీవ్ర గాయాలు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
తాజాగా సెల్ఫీ కోసం ప్రయత్నించి చావు అంచులవరకూ వెళ్ళొచ్చాడో యువకుడు. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం పంట పొలాలోకి చొరబడి ఏనుగులు పాడు చేస్తుండటంతో వాటిని తరమడానికి కొందరు స్థానికులు వెళ్లారు. కానీ ఏనుగులు స్థానికులపై తిరగబడటంతో స్థానికులు పరుగులు తీశారు.
కానీ ఆ సమయంలో కూడా గోపి అనే యువకుడు ఏనుగులతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నం చేసాడు. సెల్ఫీ కోసం ప్రయత్నిస్తున్న గోపిపై ఏనుగులు దాడి చేయడానికి ప్రయత్నించాయి. దాంతో స్వల్ప గాయాలపాలయ్యాడు. ఏనుగుల గుంపుకు గోపి చిక్కి ఉంటె పరిస్థితి వేరేలా ఉండేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
సెల్ఫీల మోజు ఉండొచ్చు కానీ ప్రాణాలను పణంగా పెట్టి మరీ సెల్ఫీల కోసం ప్రయత్నించకూడదని విపత్కర పరిస్థితుల్లో లేని గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికి సెల్ఫీల కోసం ప్రయత్నం చేస్తే ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగే పరిస్థితి వస్తుందని సెల్ఫీల మోజును తగ్గించుకోవడం మంచిదని పలువురు హితవు పలుకుతున్నారు.