కంబళ రికార్డుల్లో నిజమెంత?

  • Published - 07:20 AM, Mon - 8 February 21
కంబళ రికార్డుల్లో నిజమెంత?

కంబళ క్రీడ.. మరోసారి దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. కంబళ క్రీడలో బైందూర్ నివాసి అయిన విశ్వనాథ్ వంద మీటర్ల దూరాన్ని 9.15 సెకెన్లలో పరిగెత్తి రికార్డు సృష్టించారు. కర్ణాటకలో జరిగే ఈ సాంప్రదాయ క్రీడలో గతేడాది శ్రీనివాస గౌడ,నిశాంత్ శెట్టిల రికార్డు పరుగు కారణంగా దేశవ్యాప్త ప్రాధాన్యతను సంపాదించుకుంది. అసలీ కంబళ క్రీడ ఎప్పుడు ప్రారంభం అయింది.? ఎందుకు కంబళ క్రీడను జరుపుకుంటారు? ఒకసారి చరిత్రలోకే తొంగిచూస్తే..

కర్ణాటకలో తుళు భాష మాట్లాడే కోస్తా కర్ణాటక లోని దక్షిణ కన్నడ ఉడిపి జిల్లా, కేరళ బోర్డర్ మరియు మంగుళూరు ప్రాంతంలో కంబళ క్రీడను వైభవంగా జరుపుకుంటారు.కంబళ పోటీలు ప్రతీ ఏడాది నవంబర్ నుండి మార్చ్ వరకూ జరుగుతాయి. పోటీలు ఏర్పాటు చేయడానికి నెల రోజుల ముందే నిర్వాహకులు కంబళ పోటీలకు షెడ్యూల్ ను ప్రకటిస్తారు. బురద మడుల్లో రెండు ట్రాకులు ఏర్పాటు చేసి రెండు జతల దున్నపోతులను వాటిలో వదులుతారు. దున్నపోతుల వెనుక వాటిని కంట్రోల్ చేస్తూ వాటి వెనుకే పరిగెత్తే వ్యక్తిని జాకీ అంటారు. ఈ బురద మడి ట్రాక్ 120 నుండి 160 మీటర్ల పొడవు, 8 నుండి 12 మీటర్ల వెడల్పుతో ఉంటాయి. అత్యంత వేగంగా పరిగెత్తే జాకీలను దున్నలను చూడటానికి వేలాదిమంది ప్రజలు తరలి వస్తారు. గతంలో గెలిచిన దున్నపోతులకు కొబ్బరిబొండాలు బహుమతిగా ఇచ్చేవారు. ప్రస్తుతం ట్రోఫీలు,బంగారు పతకాలు,నగదును బహుమతిగా ఇస్తున్నారు.

సుమారు 1000 సంవత్సరాల క్రితం నుండి కంబళ క్రీడలు జరుగుతున్నట్లు చరిత్రకారులు వెల్లడిస్తున్నారు. హొయసాల రాజులు దున్నపోతుల సామర్ధ్యాన్ని పరీక్షించడానికి ఈ కంబళ క్రీడను ప్రారంభించినట్లు చరిత్రకారులు చెబుతారు. కాలక్రమంలో రాజుల క్రీడ కాస్త సంప్రదాయ కంబళ క్రీడగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం భూస్వాములు కంబళ క్రీడా కమిటీ వారు ప్రతీ ఏటా వైభవంగా ఈ క్రీడను నిర్వహిస్తారు.

నిషేధం

కంబళ క్రీడలో దున్నపోతులు వేగంగా పరిగెట్టేందుకు కొరడాలతో తీవ్రంగా కొడతారు.ఈ క్రమంలో జంతు ప్రేమికులు కంబళ క్రీడను నిషేధించాలని ఆందోళనలు చేశారు. 2014లో జంతు సంక్షేమ సంస్థలు దాఖలు చేసిన వ్యాజ్యాల ఆధారంగా 2014 లో తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుతో పాటుగా కంబళను కూడా నిషేధించాలని భారత సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా జల్లికట్టు నిషేధంపై దేశవ్యాప్తంగా నిరసన చెలరేగడంతో 2017 జనవరిలో జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. కంబళ క్రీడపై ఉన్న నిషేధాన్ని కూడా ఎత్తివేయాలని పలువురు కోరడంతో కంబళపై కర్ణాటక ప్రభుత్వం చట్టాన్ని సవరించి కంబళ క్రీడపై నిషేధాన్ని ఎత్తివేసింది.

దేశవ్యాప్త గుర్తింపు

గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో కంబళ క్రీడలో శ్రీనివాస గౌడ చేసిన ప్రదర్శన దేశవ్యాప్త చర్చకు దారితీసింది. శ్రీనివాస గౌడ 142.5మీ దూరాన్ని కేవలం 13.62 సెకన్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. దీంతో భారతీయ ఉసేన్ బోల్ట్ అంటూ సోషల్ మీడియాతో పాటు న్యూస్ మీడియా శ్రీనివాస గౌడను ఆకాశానికి ఎత్తేసింది. శ్రీనివాస గౌడ వేగాన్ని లెక్కించిన ఓ నెటిజన్ అతను 100మీ పరుగుని 9.55 సెకన్లలో పూర్తి చేసినట్లు తేల్చడంతో ఒక్కసారిగా శ్రీనివాస గౌడకు, కంబళ క్రీడకు దేశవ్యాప్త గుర్తింపు లభించింది. కొద్దిరోజుల్లోనే శ్రీనివాస గౌడ రికార్డును నిశాంత్ శెట్టి బ్రేక్ చేసి సంచలనం సృష్టించాడు. నిశాంత్ 143మీ దూరాన్ని కేవలం 13.61 సెకన్లలోనే పూర్తి చేసినట్లు నిర్వాహకులు తేల్చడంతో మరోసారి కంబళ క్రీడ వార్తల్లో నిలిచింది.

తాజాగా కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని ముల్కి వద్ద శనివారం నిర్వహించిన ఐకళ కాంతాబారె బూదాబారె కంబళలో బైందూర్ నివాసి అయిన విశ్వనాథ్ 11.44 సెకన్లలో 125 మీటర్లు దూరాన్ని పరిగెత్తి రికార్డు సృష్టించారు. మొదటి వంద మీటర్ల దూరాన్ని 9.15 సెకెన్లలో చేరుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించడంతో కంబళ క్రీడలో నూతన రికార్డుగా నమోదయింది.

రికార్డులపై సందేహాలు

కంబళ క్రీడల్లో నమోదయ్యే రికార్డుల ప్రామాణికతపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాకుల్లో పరిగెత్తే రన్నర్ల వేగాన్ని కొలవటానికి అధునాతన సెన్సార్లను వినియోగిస్తారు. కానీ కంబళ క్రీడలో వేగాన్ని కొలిచే పరికారాలపై కొందరికి సందేహాలు ఉన్నాయి. వాస్తవానికి ట్రాక్‌పై పరుగెత్తడంతో పోలిస్తే బురద నీళ్లలో పరిగెత్తడం సులువు అనే వాదనలు ఉన్నాయి. కంబళ పోటీల్లో దున్నపోతుల నుండి జాకీకి వేగంగా పెరిగెట్టేందుకు సపోర్ట్ లభిస్తుంది. దున్నల సాయంతో వేగంగా పరిగెత్తే జాకీల వేగాన్ని కొలిచి నార్మల్ ట్రాకుల్లో పరిగెత్తే రన్నర్ల వేగంతో పోల్చడం సరికాదని పలువురి అభిప్రాయం. గత సంవత్సరం తన వేగంతో కంబళ పోటీల్లో రికార్డును నెలకొల్పిన శ్రీనివాస గౌడ ఈ ఏడాది క్వార్టర్ ఫైనల్ లో జరిగిన పోటీలో గాయపడడటం గమనార్హం. ఏది ఏమైనా బురద నీళ్లలో తమ సత్తా చాటుతూ వికసిస్తున్న భారత కలువలను ప్రశంసించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. రికార్డుల విషయం పక్కనబెట్టి మట్టిలో వికసిస్తున్న మాణిక్యాలను గుర్తించి వారికి ట్రైనింగ్ ఇస్తే అంతర్జాతీయ వేదికలో భారత దేశానికి పేరు తీసుకొస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Show comments