అభ్యర్థులకు ఉన్న ధైర్యం అధినేతకు లేదా…?

ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా పరిషత్ ఎన్నికల తంతు ముగిసింది. ప్రతిపక్షాలన్నీ ఎన్నికల్లో పోటీ చేసినా సరే ప్రధాన ప్రతిపక్షం మాత్రం పోటీ చేయడానికి ఆసక్తి చూపించలేదు. అక్రమాలు జరుగుతున్నాయని దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ఏదో ఒక కారణం ఎంచుకుని తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉన్న సమయంలో చంద్రబాబు తీసుకున్న బహిష్కరణ నిర్ణయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బాగా ఇబ్బంది పెట్టింది. గతంలో జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంది.

అయితే కొంత మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చారు. ఇక్కడ వారిని పొగడడం కాదు కానీ ఆ పార్టీ అధిష్టానం వద్దన్నా సరే మేము పోటీ చేస్తామని ఆ పార్టీ నాయకులు తమతో కలిసి రాకపోయినా సరే పోరాటానికి దిగుతామని కొంత మంది కార్యకర్తలు ధైర్యంగా ముందుకు అడుగులు వేశారు. తెలుగుదేశం పార్టీ గుర్తుపై పోటీ చేసి వారిలో వారికి విభేదాలు ఉన్నా సరే ముందడుగు వేసి ప్రచారం చేసుకున్నారు. పార్టీ అధిష్టానం నుంచి ఏమాత్రం సహకారం అందక పోయినా కనీసం ప్రచారానికి కూడా పార్టీ నాయకులు రాకపోయినా పోటీ చేసిన అభ్యర్థులు మాత్రం దూకుడుగా ముందుకు వెళ్ళారు.

అయితే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం కనీసం పార్టీ కార్యకర్తలకు ధైర్యం ఇచ్చే ప్రసంగాలు చేయలేకపోయారు. క్షేత్రస్థాయిలో కష్టపడే వాళ్ల కోసం పార్టీ నాయకులను పంపించడానికి కూడా చంద్రబాబు ఇష్టపడలేదు. తన మాటను కాదని కార్యకర్తలు పోటీ చేయడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేక పోయారు అని అందుకే కొంతమంది ఆయన నుంచి ప్రోత్సాహం రాలేదని కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలంటున్నాయి. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించి మరీ పోటీ చేసిన వాళ్లకు పార్టీ సహాయ నిరాకరణ పాటిస్తూ ఉంటుంది అనే సంకేతాలను చంద్రబాబు నాయుడు పంపారు.

ఇక ఎన్నికల కౌంటింగ్ నాటకీయ పరిణామాల మధ్య నేడు మొదలైంది. కౌంటింగ్ నీ ఏదో ఒక విధంగా అడ్డుకోవాలని చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేసినా సరే కౌంటింగ్ మాత్రం హైకోర్టు తీర్పుతో ముందుకు నడిచింది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా పెద్దగా కౌంటింగ్ కి అంతరాయం కలగలేదు. అయితే కౌంటింగ్ రోజు కూడా పార్టీ నాయకులను చంద్రబాబు నాయుడు పోటీ చేసిన అభ్యర్థులు వద్దకు పంపలేకపోయారు.

1, 2 ఓట్ల తేడాతో ఓడిపోయిన వాళ్లకు లేదా పది ఓట్ల తేడాతో ఓడిపోయిన వాళ్లకు పార్టీ నాయకత్వం నుంచి మద్దతు లేకపోవడంతో కౌంటింగ్ కేంద్రాల వద్ద వాళ్ళు చేతులెత్తేశారు. రీకౌంటింగ్ అడిగే పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు లేకుండా పోయింది. ఇతర పార్టీల అభ్యర్థులు ఎక్కువ మెజారిటీతో గెలుపొందిన చోట కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు రీకౌంటింగ్ అడిగే సాహసం చేయలేకపోయారు. అదే పార్టీ నాయకత్వం నుంచి సపోర్టు ఉండి ఉంటే కచ్చితంగా కార్యకర్తలు అలాగే పోటీ చేసిన అభ్యర్థులు రీకౌంటింగ్ కోసం పట్టుబట్టిన పరిస్థితి ఉండేది.

పోటీ చేయొద్దని చెప్పడం ఆ తర్వాత పోటీ చేసిన వాళ్ల కోసం ప్రచారం చేయకపోవడం అలాగే పోటీ చేసిన వారికి పార్టీ నాయకత్వం నుంచి భరోసా ఇవ్వలేకపోవడం వంటివి తెలుగుదేశం పార్టీని పరిషత్ ఎన్నికల్లో మరింతగా వెనక్కి తగ్గే విధంగా చేశాయి. అగ్ర నాయకులు నియోజకవర్గాల్లో కూడా కనీసం ఫోన్లు చేసి పోటీ చేసిన అభ్యర్థులు ధైర్యం చెప్పే సాహసం చేయలేకపోయారు. దీనితో కర్చు పెట్టిన వాళ్ళు కూడా పోతే పోయింది అని అనుకుని వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి కొన్ని నియోజకవర్గాల్లో ఉంది. చివరకు చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో కూడా అటువంటి పరిస్థితిలే ఉన్నాయి.

Show comments