బుచ్చిబాబుకి భలే ఆఫర్లు

టైటిల్ కు తగ్గట్టే వసూళ్లలో ఉప్పెన చూపిస్తున్న తీరు దర్శకుడు బుచ్చిబాబుని మాములు ఆనందంలో ముంచెత్తడం లేదు. తొలుత మిశ్రమ స్పందన దక్కించుకున్నప్పటికీ రిలీజ్ విషయంలో మైత్రి పాటించిన టైమింగ్ వల్ల ఏకంగా యాభై కోట్ల షేర్ ని ఉప్పెన టార్గెట్ పెట్టేసుకుంది. ఈ శుక్రవారం నాలుగు కొత్త సినిమాలు వస్తున్నప్పటికీ వాటి ప్రభావం అంత తీవ్రంగా ఉండబోదని ట్రేడ్ అంటున్న మాట. వాటిలో దేనికైనా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప ఉప్పెన స్పీడ్ కి బ్రేకులు వేయడం కష్టం. మాములుగా చాలా స్లో అవ్వాల్సిన వీక్ డేస్ లోనూ ఉప్పెన సోమ, మంగళవారాల్లో వరసగా 4 కోట్లు, 3.5 కోట్లు రాబట్టుకుంది.

దెబ్బకు దర్శకుడు బుచ్చిబాబు డిమాండ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అగ్ర నిర్మాతలు అతని డేట్ల కోసం తెగ ట్రై చేస్తున్నారు. అయితే మైత్రి మేకర్స్ చాలా తెలివిగా ఇతనితో ముందస్తుగా రెండు ప్రోజెక్టులతో అగ్రిమెంట్ చేసుకున్నారట. అందులో ఒకటి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక స్టార్ హీరోతో మొదలవుతుందని ఇప్పటికే టాక్ వచ్చేసింది. అదే ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో 80వ దశకంలో జరిగిన కథగా చూపించబోతున్నట్టు వినికిడి. అయితే ఆ పెద్ద హీరో ఎవరై ఉంటారనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఉప్పెన విజయానందంలో మునిగి తేలుతున్న బుచ్చిబాబు కోలుకున్నాక పూర్తి వివరాలు తెలియవచ్చు.

ఇది కాగానే మరొకటి కూడా మైత్రి సంస్థలోనే ఉంటుందని తెలిసింది. ఇది లవ్ స్టోరీనా మరో జానారా అనేది తెలియాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో ఏ డెబ్యూ డైరెక్టర్ కు రానంత డిమాండ్ బుచ్చిబాబు తెచ్చుకున్న మాట వాస్తవం. ఏడాది పాటు పడిన ఎదురుచూపులకు తగిన ఫలితం అయితే దక్కింది. దెబ్బకు కృతి శెట్టి, వైష్ణవ్ ల రేంజ్ కూడా పెరిగిపోయింది. అసలే హిట్టు దర్శకుల కొరత టాలీవుడ్ ని విపరీతంగా వేధిస్తోంది. ఫామ్ లో ఉన్నవాళ్లు రెండేళ్లకు ఒకటి తీయడమే కష్టమవుతోంది. అలాంటి తరుణంలో బుచ్చిబాబు లాంటివాళ్లు ముందుకు వచ్చి వేగం పెంచి సినిమాలు చేస్తే థియేటర్లు ఎక్కువ రోజులు కళకళలాడతాయి

Show comments