ఈ విధంగా విశాఖ స్టీల్స్ ను కాపాడుకోవచ్చు.. సీఎం జగన్ కేంద్రానికి లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఓ అడుగు వేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలంటూ పలువురు కోరుతున్న తరుణంలో ప్రభుత్వం తరుపున లేఖ రాశారు. కేంద్రానికి రాసిన లేఖలో ఎటువంటి శషబిషలు లేకుండా సూటిగా వ్యవహరించారు. స్టీల్ ప్లాంట్ నష్టాలకు అసలు కారణాలను ప్రస్తావిస్తూ, దానిని పరిరక్షించే మార్గాలను కూడా సూచించారు. విశాఖ ఉక్కుని కాపాడాలని కోరారు. అదే సమయంలో కేంద్రం అమ్మకానికి పెడితే తాము బిడ్ వేయడానికి సిద్ధమంటూ ఏపీ పరిశ్రమల మంత్రి ప్రకటించడం కూడా ఆసక్తిగా మారుతోంది. వైజాగ్ స్టీల్ విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరి చర్చనీయాంశం అవుతోంది.

విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని సీఎం జగన్ కోరారు. అదే సమయంలో ప్లాంటును బలోపేతం చేయడానికి మార్గాల్ని అన్వేషించాలంటూ ప్రధానికి రాసిన లేఖలో ఆయన విజ్ఞప్తి చేశారు. 20వేలమంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్న ఈ పరిశ్రమ ద్వారా పరోక్షంగా వేలాది మంది జీవనోపాధి పొందుతున్నారని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాద వేదికగా ప్రజల పోరాట ఫలితంగా స్టీల్‌ఫ్యాక్టరీ వచ్చిందనే విషయాన్ని ఆయన ప్రస్తావించడం ద్వారా చారిత్రక అంశాలను కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దశాబ్దం కాలంపాటు ప్రజలు పోరాటంలో 32 మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.

ఐదారేళ్ల క్రితం వరకూ 2002–2015 మధ్య వైజాగ్‌స్టీల్‌ మంచి పనితీరు కనపరిచిందని లాభాల బాటలో సాగిందని లెక్కలను వివరించారు. అదే సమయంలో విస్తరణ కూడా వేగంగా జరిగిందని తెలిపారు. ప్లాంటు పరిధిలో 19700 ఎకరాల విలువైన భూములున్నట్టు పేర్కొన్నారు. తద్వారా ప్లాంట్ విలువ చాలా ఎక్కువనే సంగతిని స్పష్టం చేశారు. ఈ భూముల విలువే దాదాపు రూ.లక్ష కోట్లు ఉంటుందని జగన్ రాసిన లేఖలో పేర్కొనడం కీలకాంశం అవుతుంది.

నష్టాలకు ప్రధాన కారణం ఉత్పత్తి ఖర్చు విపరీతంగా పెరిగిపోవడం మాత్రమేనని జగన్ వివరించారు. తద్వారా సొంతంగా ఇనుప ఖనిజం గనులు లేవని, దానిని కేటాయించడంలో కేంద్రం వైఖరే మూలమని చెప్పకనే చెప్పేశారు. అదే సమయంలో పెట్టుబడుల ఉపసంహరణకు బదులు అండగా నిలబడ్డం ద్వారా ప్లాంటును మళ్లీ ప్రగతిబాటలోకి తీసుకెళ్లవచ్చని జగన్ లేఖలో సూచించడం గమనార్హం. 7.3 మిలియన్‌ టన్నుల సామర్థ్యం ఉన్నప్పటికీ 6.3 మిలియన్నులు మాత్రమే ఏడాదికి ఉత్పత్తిచేస్తున్నారని, దానికి కారణాలను కూడా జగన్ తెలిపారు. అదే సమయంలో పెరిగిన ఉత్పత్తి సామర్థ్యం, స్టీల్ ధరలు పెరగడం వంటి కారణాలు రీత్యా ఇటీవల డిసెంబర్‌ 2020లో రూ.200 కోట్ల లాభం కూడా వచ్చిందని సీఎం వివరించారు. వచ్చే రెండేళ్లలో ఇదే పరిస్థితి కొనసాగితే… ప్లాంటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.


బైలదిల్లా గనుల నుంచి మార్కెట్‌ ఖరీదుకు ముడి ఖనిజాన్ని ప్లాంటు కొనుగోలు చేస్తోందని, దాదాపు టన్ను ముడి ఖనిజాన్ని రూ. 5,260 చొప్పున కొనుగోలు చేస్తోంది. దీనివల్ల వైజాగ్‌స్టీల్స్‌కు టన్నుకు అదనంగా రూ. 3,472లు చొప్పున భారం పడుతోందని లెక్కలతో వివరించారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)‌కు సొంతంగా గనులు ఉన్నాయని, దాదాపు 200 ఏళ్లకు సరిపడా నిల్వలు సెయిల్‌కు ఉన్నాయని, దీని నుంచి వైజాగ్‌ స్టీల్స్‌కు సొంతంగా గనులు కేటాయించడంద్వారా పోటీ పరిశ్రమలతో సమాన స్థాయికి తీసుకెళ్లొచ్చనే విషయాన్ని సీఎం నేరుగా ప్రధానికి తెలియజేయడం ద్వారా వైజాగ్ స్టీల్ నష్టాలకు కారణాలు, గట్టెక్కించే మార్గాలను తెలియజేసినట్టయ్యింది.

విశాఖస్టీల్స్ కు దాదాపు 22,000 కోట్ల అప్పులున్నాయి. ఈ అప్పుల మీద 14% వడ్డీ చెల్లిస్తున్నారు. బ్యాంకుల నుంచి తెచ్చుకున్న ఈ రుణాల మొత్తాన్ని వాటా(ఈక్విటి) వడ్డీ భారం తగ్గి ఊరట లభిస్తుందని వివరించారు. రుణాల ఈక్విటీలుగా మారితే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కూడా స్టాక్‌ ఎక్సేంజీలో లిస్ట్‌ చెయ్యొచ్చు, స్టాక్‌ మార్కెట్‌ ద్వారా నిధుల సేకరణకు అవకాశం ఏర్పడుతుంది.

ఇప్పటికే కేరళ ప్రభుత్వం కూడా ఇటీవల తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ ప్రైవేటీకరణ పై సుప్రీంకోర్ట్ వరకూ వెళ్లింది. కేంద్రం అమ్మాలనుకుంటే తమకే అప్పగించాలని కోరింది. అదే రీతిలో ఏపీ ప్రభుత్వం కూడా వైజాగ్ స్టీల్ బిడ్డింగ్ సిద్ధమని ప్రకటిస్తున్న తరుణంలో కేంద్రం తన తీరు మార్చుకుని వైజాగ్ స్టీల్ ని కాపాడేందుకు సిద్ధః కాకపోతే ఏపీ ప్రభుత్వం పోటీ పడే అవకాశం కనిపిస్తోంది. సీఎం లేఖలో కూడా సూటిగానే కేంద్రానికి సరయిన మార్గాలను సూచించడంతో తదుపరి కేంద్రం స్పందన ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశం అవుతోంది.

Show comments