చిత్తూరు టీడీపీకి ఉప‌సంహ‌ర‌ణ టెన్ష‌న్‌

చిత్తూరు జిల్లా పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఆ పార్టీ అభ్య‌ర్థులు త‌క్కువ స్థానాల్లో మాత్ర‌మే విజ‌యం సాధించారు. మొత్తం 1369 పంచాయ‌తీల‌కు గాను టీడీపీ సుమారు 174 చోట్ల క‌నీసం అభ్య‌ర్థుల‌ను కూడా నిల‌బెట్ట‌లేక‌పోయింది. జిల్లా వ్యాప్తంగా కేవ‌లం 188 పంచాయ‌తీల‌ను నిలుపుకుని ప‌రువు కాపాడుకుంది. వైసీపీ మ‌ద్ద‌తుదారులు 1136 స్థానాల్లో విజ‌య‌కేత‌నం ఎగుర‌వేశారు.

పంచాయ‌తీ ఫ‌లితాలు ఇచ్చిన షాక్ తో పురు పోరుకు తెలుగు త‌మ్ముళ్లు ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో వైసీపీకి ఉన్న ఆద‌ర‌ణ నేప‌థ్యంలో ర‌ణ‌రంగంలోకి దిగి ప‌రువు పోగొట్టుకోవ‌డం క‌న్నా దూరంగా ఉండ‌డం మంచిద‌నే అభిప్రాయానికి ప‌లువురు వ‌చ్చారు. చిత్తూరు నగరపాలక సంస్థ నుంచి సుమారు 30 మందికి పైగా సిట్టింగ్‌ కార్పొరేటర్లు పోటీకి వెనుకంజ వేసినట్లు ప్ర‌చారం జ‌రుగుతుందంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. దీంతో టీడీపీని ఉప‌సంహ‌ర‌ణ టెన్ష‌న్ వెంటాడుతోంది.

చిత్తూరు నగరపాలక సంస్థకు మొదటిసారిగా 2014లో ఎన్నికలు నిర్వహించారు. అప్పట్లో 30కి పైగా స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. ఆ పార్టీ అభ్యర్థి కఠారి అనురాధ చిత్తూరు తొలి మేయర్‌గా పీఠం అధిష్టించారు. అయితే ఆమెకు మేయర్‌ పదవి మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్‌ను వారి మేనల్లుడే చంపేశాడు. అనంతరం నలుగురు మహిళా కార్పొరేటర్ల భర్తలు కార్పొరేషన్‌ను తమ చెప్పుచేతల్లోకి తీసుకున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రూ.కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. చిత్తూరు ప్రజలు ఏకపక్షంగా మద్దతుగా పలికి ఆరణి(జంగాలపల్లి) శ్రీనివాసులును ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. అప్ప‌టి నుంచీ స్థానికంగా వైసీపీ హ‌వా పెరుగుతూ వ‌స్తోంది. పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో అధికార పార్టీ ప్రాభ‌వం పెరిగిన‌ట్లు తేలింది. ఈక్రమంలో ప్రస్తుతం కార్పొరేషన్‌ ఎన్నికలు మళ్లీ వచ్చాయి. అయితే నాడు కోట్లు కొల్లగొట్టినవారు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. బాధ్యత తీసుకుంటే దాచుకున్న మూటలను బయటకు తీయాల్సివస్తుందని ఇంటికే పరిమితమయ్యారు.

గ‌తంలో నోటిఫికేష‌న్ విడుద‌లైన‌ప్పుడు టీడీపీ తరఫున నామినేష‌న్లు వేసేందుకు అభ్య‌ర్థులే దొర‌క‌లేదు. దీంతో ఆ పార్టీ నేతలు అనామకులతో నామినేషన్లు వేయించారు. బతిమిలాడి.. డబ్బులిచ్చి బరిలో దించిన తమ్ముళ్లు ఇప్పుడు కనిపించకపోవడంతో చిత్తూరు టీడీపీలో ఆందోళన మొదలైంది. ఇప్పటి వరకు నగర పార్టీకి అధ్యక్షుడినే నియమించకపోవడంతో ఎవరికి వారు తమ కెందుకులే అని పక్కకు తప్పుకుంటున్నారు. ప్రస్తుత కీలక సమయంలో నూ కనీసం పార్టీ కార్యాలయానికి వచ్చేవారు కూడా కనిపించడంలేదు. దీంతో చిత్తూరు నగర టీడీపీలో నిస్తేజం ఆవరించింది. మరోవైపు వైఎస్సార్‌సీపీ మొత్తం 50 డివిజన్లుకు అభ్యర్థులను ప్రకటించేసింది. పోటీలో దిగిన అభ్యర్థులు ప్రచా రంలో దూసుకుపోతున్నారు. ఈ పరిణామాలను గమనించిన టీడీపీ జిల్లా నాయకులు కింకర్తవ్యం అంటూ మధనపడుతున్నారు. ఎవరికి వారు దూరంగా ఉండిపోతున్నారు. మార్చి 2, 3 తేదీల్లో ఉపసంహరణ ప్రక్రియ పూర్తయితే అసలు పోటీలో ఎవరైనా ఉంటారా అనే ప్రశ్న టీడీపీ నేతలను వేధిస్తోంది.

Show comments