చంద్ర‌బాబు మ‌ళ్లీ వాడేసుకున్నారు..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు సంబంధించి ఏ అంశంలోనైనా మంచి పేరొస్తే.. అది నా వ‌ల్లే అన‌డం.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డం ప‌రిపాటిగా మారిన ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి త‌న పంథా మార‌ద‌ని నిరూపించుకున్నారు. ఎవ‌రేమ‌నుకుంటే నాకేంటి.. నాకు నేనే సాటి అని గొప్ప‌లు చెప్పుకోవ‌డం ఆయ‌న‌కు అల‌వాటుగా మారిన‌ట్లు ఎన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా ఆయ‌న తీరు మార‌డం లేదు. ఆ టైంలో నేను ముఖ్య‌మంత్రిగా ఉన్నానా… ఉంటే ఎన్నాళ్లు ఉన్నాను. అందులో నా పాత్ర ఎంతుంది.. అనే అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా నా వ‌ల్లే ఏపీకి ఆ పేరొచ్చింది.. నా వ‌ల్లే తెలంగాణ ఇలా ఉంది.. అని త‌ర‌చూ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చే చంద్ర‌బాబు మ‌రోసారి అదే ప‌ని చేశారు. కీలకమైన ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్‌లో (సులభతర వ్యాపార నిర్వహణ) ఆంధ్ర‌ప్ర‌దేశ్ నెంబర్‌వన్‌ స్థానం రావ‌డానికి కూడా తానే కార‌ణ‌మ‌ని ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చేశారు. క‌నీసం నా పాత్ర కూడా ఉందని కాదు.. నేనే అంతా చేశానంటూ చెప్పుకుంటున్నారు.

187 సంస్క‌ర‌ణ‌ల్లో బాబు తెచ్చిన‌వి ఎన్నో చెప్ప‌గ‌ల‌రా..?

ఈ ఏడాది కాలంలో ఏపీలో అమ‌లు చేసిన 187 సంస్కరణల ఆధారంగా కేంద్రం నెంబ‌ర్ వ‌న్ ర్యాంక్ ప్ర‌క‌టించింది. ఆ 187లో చంద్ర‌బాబు తెచ్చిన‌వి ఎన్ని ఉన్నాయో చెప్ప‌గ‌ల‌రా.. అంటే స‌మాధానం ఇచ్చే ప‌రిస్థితి లేదు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ ర్యాంకింగ్‌లకు సంబంధించి గతం కంటే భిన్నంగా ఈసారి స‌ర్వే నిర్వ‌హించారు. తొలిసారి పారిశ్రామిక వేత్తలు, వినియోగదారుల సర్వే చేయగా.. ఇదే అసలైన ర్యాంకింగ్ ప్రక్రియగా పారిశ్రామికవేత్తలుఅభి ప్రాయపడుతున్నారు. గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన నివేదికల ఆధారంగా ర్యాంకింగ్ ప్రకటించేవారు. ఈసారి పారిశ్రామిక వేత్తలు సర్వే నిర్వహించగా.. ఏపీలో 187 సంస్కరణలు అమలు చేసినట్లు గుర్తించారు. అన్నింటినీ అమలు చేసినందున నూటికి నూరు శాతం మార్కులు పొందటంతో మొదటిస్థానంలో నిలిచింది. కానీ చంద్ర‌బాబు మాత్రం ఇది గ‌త ప్ర‌భుత్వ ఘ‌న‌త‌. ప్ర‌జ‌ల ప‌ట్ల టీడీపీ ప్ర‌భుత్వ కృషి, అంకిత‌భావం ఫ‌లిత‌మిది. ఏపీ ప్ర‌జ‌ల‌కు నా అభినంద‌న‌లు. ఈ ప్ర‌య‌త్నాలు వృథా కాకూడ‌దు అని ట్వీట్ చేశారు.

టాప్ ర్యాంక్ కు కార‌ణాలివే…

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న చర్యల వల్లే టాప్‌ ర్యాంక్‌ వచ్చిందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి అన్నారు. కీలకమైన ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్‌లో (సులభతర వ్యాపార నిర్వహణ) రాష్ట్రం తొలి స్థానంలో నిలిచినందుకు ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కరోనా దుర్భర పరిస్థితుల్లోనూ ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం తోడ్పాటునిచ్చారని పేర్కొన్నారు. పరిశ్రమలు మళ్లీ నడిచేలా ఆర్థిక తోడ్పాటు, భరోసాను ముఖ్యమంత్రి కల్పించారని ఆయన అన్నారు. పెట్టుబడిదారులు ఉన్న విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ఇచ్చారన్నారు. సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌లో పరిశ్రమలకు భూ కేటాయింపులతో పాటు వాణిజ్య వివాదాలకు ఈ ఫైలింగ్‌ సౌకర్యం ఉందని మంత్రి మేకపాటి తెలిపారు. విజయవాడ, విశాఖలో వాణిజ్య వివాదాలకు ప్రత్యేక న్యాయస్థానం, ఔషధాల విక్రయ లైసెన్స్‌ ఆన్‌లైన్‌లోనే పొందే సౌకర్యం ఉందన్నారు. ఏటా రెన్యువల్‌ చేసుకునే అవసరం లేకుండా షాపులకు మినహాయింపు, కార్మిక చట్టాల కింద సింగిల్‌ ఇంటిగ్రేటెడ్‌ రిటర్న్స్‌ దాఖలుకు పెద్దపీట వేసినట్లు చెప్పారు. ప్రతి పరిశ్రమలో స్థానికంగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇస్తున్నామని అన్నారు. హిందూపురం, విజయవాడ, విశాఖ ఇండస్ట్రీయల్‌ పార్క్‌ల్లో వాణిజ్యవేత్తలతో పలుమార్లు ప్రభుత్వం సమావేశాలు నిర్వహించి వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించామ‌ని మంత్రి వివ‌రించారు.

Show comments