పోలీసులపై ప్రైవేటు కేసులు పెడతారట

పోలీసులు వైఎస్సార్‌ సీపీకి బానిసలుగా మారిపోయారు. తెలుగుదేశం నాయకులను అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తున్నారు. అలాంటి పోలీసులందరిపై ప్రైవేటు కేసులు పెడతాం.. అంటూ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు బహిరంగంగా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. అధికారం కోల్పోయినప్పటి నుంచి అసహనం పెరిగిపోయి తాను ఏం మాట్లాడుతున్నాను అనే సోయి లేకుండా ఉన్నారు. గొంతు పెంచేసి అరుస్తూ వేలు చూపుతూ బెదిరిస్తే మొత్తంగా పోలీసు వ్యవస్థ తన అడుగులకు మడుగులొత్తుతుందని ఆయన భ్రమ. గతంలో కూడా పోలీసులూ ఖబడ్దార్‌.. మీ అందరి పేర్లూ రాసుకుంటున్నా.. మేం అధికారంలోకి రాగానే శంకరగిరి మన్యాలు పట్టిస్తాం అంటూ చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయినా టీడీపీ నాయకులపై వరుసగా కేసులు పెరుగుతుండడంతో ప్రైవేటు కేసులు పెడతాం అంటూ సరికొత్త బెదిరింపులకు దిగుతున్నారు.

కేసులు ఊరికే పెట్టారా..?

హత్య కేసులో నిందితుడు కొల్లు రవీంద్ర, ఈఎస్‌ఐ స్కామ్‌ పాత్రధారి అచ్చెన్నాయుడు, సంగం డెయిరీ కుంభకోణం సూత్రధారి ధూళిపాళ నరేంద్ర చౌదరి, శాంతి భద్రతల సమస్య సృష్టించిన దేవినేని ఉమా, తాజాగా చింతమనేని ప్రభాకర్‌ వీళ్లంతా బాబు దృష్టిలో అమాయకులేనా ? నేరాల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో వీరి ప్రమేయం ఉండడం, ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతోనే పోలీసులు అరెస్ట్‌ చేశారు. తప్పులు చేసిన తమ పార్టీ నాయకులు అరెస్ట్‌ కాగానే ఆయా కులాల నేతలతో ప్రకటనలు ఇప్పించడం, ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టు అనుకూల మీడియాలో హంగామా చేయడం పరిపాటిగా మారింది. చంద్రబాబో, ఆయన కుమారుడు లోకేష్ లు అరెస్ట్‌ అయిన నేతలనో, వారి కుటుంబ సభ్యులనో పరామర్శించడం, ఆ సందర్భంగా పోలీసులూ ఖబడ్డార్‌ అంటూ స్టేట్‌మెంట్లు ఇవ్వడం సాధారణమైపోయింది. ఫలానా వెనుకబడిన కులంవారు అనో, మాజీ మంత్రి అనో, బాబుగారి చుట్టమనో కేసులు పెట్టకూడదంటే ఎలా? ఇదేనా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి చట్టంపై ఉన్న అవగాహన. అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను గౌరవించాలనడం, ప్రతిపక్షం లోకి రాగానే ఆ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం బాబుకు పరిపాటే.

Also Read : ఐఎఎస్ లకు కోర్టు శిక్ష విధించిన ఘటనలో పాపం ఎవరిది ?

పోలీసులంటే ఇంటి మనుషులా?

చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లూ పోలీసులను రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారు. అప్పటి ఇంటలిజెన్స్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు ఆయన ఇంటి మనిషిలా పనిచేశారన్నది బహిరంగ రహస్యం. రాజకీయ శత్రువులను వేధించడానికి, బెదిరించడానికి పోలీసులను పావులుగా వాడుకున్న బాబు ఇప్పుడు నీతులు వల్లించడం విడ్డూరం. నాటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగితే కోడి కత్తి కేసంటూ తేలిక చేసి పోలీసులు చేతులు కట్టేసింది ఎవరు? ఎమ్మార్వో వనజాక్షిని జట్టు పట్టుకొని ఈడ్చిన చింతమనేని ప్రభాకర్‌ను కనీసం అరెస్ట్‌ చేయకుండా పోలీసులను అడ్డుకున్నది ఎవరు? తన వియ్యంకుడు బాలకృష్ణ అభిమానులను తన్నినా, కొట్టినా పోలీసులు ఎవరి హయాంలో కిమ్మనకుండా ఉన్నారు? అధికారం కోల్పోయినా ఇప్పుడు కూడా పోలీసులు తను చెప్పినట్టే వినాలనుకోవడం, తమ నేతలు ఎంతటి నేరాలు చేసినా కేసులు పెట్టకూడదనడం ఏ రకం రాజకీయం..?

ఆత్మ విశ్వాసంతో పనిచేస్తున్నది ఇప్పుడే..

రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ఇచ్చారు. హోంగార్డుల జీతాలు పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల్లో నియమించిన మహిళా పోలీసులను పోలీసుశాఖలో విలీనం చేసేందుకు శిక్షణ ఇస్తున్నారు. ఆత్మ విశ్వాసంతో తమ విధులు నిర్వహించే వాతావరణం కల్పించి, కర్తవ్య నిర్వహణలో రాజకీయ జోక్యం లేకుండా ప్రస్తుత ప్రభుత్వం పోలీసులకు స్వేచ్ఛనిచ్చింది. బాబు బెదిరింపులకు లొంగిపోయి పోలీసులు ఆయనకు జీ హుజార్‌ అంటారనుకోవడం ఆయన అవివేకం. తప్పు చేస్తే చట్ట ప్రకారం బాబునైనా, ఆయన కుమారుడినైనా అరెస్ట్‌ చేయడానికి పోలీసులు వెనుకాడరన్న సంగతి గ్రహిస్తే ఆయనకే మంచిది.

Also Read :ఆ పదవి కోసమే బుచ్చ‌య్య రాజీనామ డ్రామా ఆడారా?

Show comments