షాకింగ్ రిజల్ట్: కుటుంబంలో 20 ఓట్లు.. పోటీ చేస్తే 9 ఓట్లే వచ్చాయి..!

వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు నూతన చట్టాలు రద్దు చేయాలని గత మూడు నెలలుగా రైతులు చేస్తున్న ఉద్యమ ప్రభావం పంజాబ్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఈ ఉద్యమాన్ని మొదట పంజాబ్‌ రైతులే ప్రారంభించారు. ఆ తర్వాత హర్యాన, ఉత్తరప్రదేశ్‌ సహా ఇతర రాష్ట్రాల రైతులు ఉద్యమంలో భాగమయ్యారు. రైతు ఉద్యమాన్ని లెక్కచేయని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి తమ ఓటుతో పంజాబ్‌ పట్టణ ఓటర్లు బుద్ధి చెప్పారు. 8 కార్పొరేషన్లు, 109 మున్సిపల్, నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 8 కార్పొరేషన్లలో ఆరింటిని భారీ మెజారిటీతో కాంగ్రెస్‌ గెలుచుకుంది. మరో రెండింటిలో అతిపెద్ద పార్టీగా నిలిచింది. 2169 మున్సిపల్, నగరపంచాయతీ వార్డులకు గాను కాంగ్రెస్‌ పార్టీ 1399 వార్డులను గెలుచుకుంది. బీజేపీ, ఆప్, శిరోమణి ఆకాళిదల్‌ పార్టీల అభ్యర్థులకు పలు చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి.

రైతు ఉద్యమం తర్వాత జరిగిన ఈ ఎన్నికలు ద్వారా పంజాబ్‌ ప్రజలు బీజేపీపై ఏ స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారో తేటతెల్లం అవుతోంది. బత్తింద కార్పొరేషన్‌ ఏర్పడిన 53 ఏళ్ల తర్వాత తొలిసారి ఇక్కడ కాంగ్రెస్‌ తరఫున మేయర్‌పదవి చేపట్టబోతున్నారంటే.. బీజేపీ పట్ల పంజాబ్‌ ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో అర్థమవుతోంది. బత్తిందలో 50 డివిజన్లకు గాను కాంగ్రెస్‌ 41 డివిజన్లను గెలుచుకుంది. బీజేపీ తరఫున పలుమార్లు కౌన్సిలర్లుగా గెలిచిన వారు ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. పలువురుకు డిపాజిట్లు గల్లంతయ్యాయి.

గుర్‌దాస్‌పూర్‌ మున్సిపాలిటీలో 29 వార్డులు ఉంటే 29 వార్డులు కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులు గెలిచారు. 12వ వార్డులో బీజేపీ అభ్యర్థి కిరణ్‌ కౌర్‌కు 9 ఓట్లు రావడం సంచలనంగా మారింది. కిరణ్‌ కౌర్‌ ఆ వార్డు నుంచి పలుమార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. అయితే ఈ సారి ఆమెకు కేవలం 9 ఓట్లు రావడం విశేషం. తన కుటుంబం, బంధువుల ఓట్లు 20 ఉంటే.. తనకు 9 మాత్రమే వచ్చాయని ఆమె వాపోయారు. కాంగ్రెస్‌ పార్టీ ఈవీఎంలను తారుమారు చేసిందని ఆమె ఆరోపిస్తున్నారు. అందుకే తనకు 9 ఓట్లే వచ్చాయని ఆమె వాపోతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

తాజా ఫలితాలు కాంగ్రెస్‌పార్టీలో ఫుల్‌ జోష్‌ను నింపాయి. వచ్చే ఏడాదిలో జరగబోయే శాసన సభ ఎన్నికలపై ఈ ప్రభావం పడుతుందనే విశ్లేషణలు సాగుతున్నాయి. వ్యవసాయ చట్టాలపై కేంద్రం మంకుపట్టు వీడకపోతే.. పంజాబ్‌ శాసన సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర ఓటమిని మూటగట్టుకోవాల్సి వస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. ఈ భయం బీజేపీ నేతల్లోనూ కనిపిస్తోంది. అయితే ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్న నేపథ్యంలో నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తే.. పరిస్థితి బీజేపీకి కొంత ఆశాజనకంగా ఉండొచ్చు.

Show comments