అయ్య‌న్న‌కు అర్థ‌మైపోయింది..!

క‌రోనా కేసులు న‌మోద‌వుతూనే ఉండ‌డం, వ్యాక్సినేష‌న్ ప్రారంభం వంటి కార‌ణాల‌తో ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు వ‌ద్ద‌ని ప్ర‌భుత్వం తొలి నుంచీ చెబుతూ ఉంది. దీనిపై తెలుగుదేశం నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తూ… ఎన్నిక‌లంటే జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నార‌ని, వైసీపీకి ఓట్లు, సీట్లు రావ‌ని తెలిసిపోయింది అంటూ ర‌క‌ర‌కాల వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌ల, ఉద్యోగుల ఆరోగ్యం రీత్యా ప్ర‌భుత్వం చెబుతున్న వాద‌న‌ను త‌మకు అనుకూలంగా మార్చుకోవాల‌ని తెగ ప్ర‌యత్నాలు చేశారు. అస్స‌లు క‌థ మొద‌ల‌య్యాక ఒక్కొక్క‌రి బండారం బ‌య‌ట‌ప‌డుతోంది.

తొలి ద‌శ పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాలు, రెండో ద‌శ నామినేష‌న్ల ఏక‌గ్రీవాలలో వైసీపీ హ‌వా కొన‌సాగుతుండ‌డంతో తెలుగుదేశం నేత‌ల‌లో క‌ల‌వ‌రం మొద‌లైంది. అప్పుడు అంత‌న్నాం.. ఇంత‌న్నాం.. ఇప్పుడు క‌నీసం పోటీ అయినా ఇవ్వ‌లేని ప‌రిస్థితి వ‌స్తుండ‌డంతో ఆగ‌మేఘాల మీద ప‌రువు కాపాడుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వారిలో ఒక‌రు తెలుగుదేశానికి చెందిన మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు.

ఎన్నిక‌ల‌కు ఈసీ షెడ్యూల్ ప్ర‌క‌టించిన అనంత‌రం.. ప్ర‌భుత్వం వ్య‌తిరేకించ‌డంతో స‌ద‌రు అయ్య‌న్న పాత్రుడు మాట్లాడుతూ.. “కరోనా విజృంభిస్తున్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తే నిమ్మగడ్డ టీడీపీ వ్యక్తి అన్నారు. కరోనా ప్రభావం తగ్గిందని పాఠశాలలు తెరిచిన ఈ ప్రభుత్వమే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయగానే నిమ్మగడ్డ టీడీపీ మనిషి అని మరోసారి ఫేక్ ప్రచారం మొదలుపెట్టింది. అసలు విషయం ఏంటంటే… రాష్ట్రంలో చెత్తపాలన చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు అనే రహస్య నివేదికలను ప్రశాంత్ కిశోర్ అందజేశాడు. అందుకే జ‌గ‌న్ కు లోకల్ ఎన్నికలు అనగానే వణుకు పుట్టి అర్థంపర్థంలేని ఆరోపణలు చేసి పారిపోతున్నాడు” అంటూ వ్యాఖ్యానించారు. తీరా రంగంలోకి దిగాక కానీ ఆయ‌న‌కు తెలిసిన‌ట్లు లేదు. ఎవ‌రి స‌త్తా ఏంటో. త‌న సొంత జిల్లా, నియోజ‌క‌వ‌ర్గంలోనే టీడీపీ మ‌ద్ద‌తుదారుల‌కు ఆద‌ర‌ణ లేక‌పోవ‌డంతో ఆందోళ‌న చెందుతున్నారు.

1983-1989, 1994-1996 మధ్య కాలంలో నర్సీపట్నం నుంచి ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు ఎన్నికైన అయ్య‌న్న పాత్రుడు 1984-1986 లో సాంకేతిక విద్యా మంత్రిగా ప‌ని చేశారు. 1994-96 లో రహదారులు, భవనాల శాఖా మంత్రిగా కూడా పని చేశారు. 1996 లో 11వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం తరుపున అనకాపల్లి ఎంపీగా కూడా ఎన్నిక‌య్యారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తరువాత అయ్యన్నను అటవీశాఖ మంత్రి పదవి వరించింది.

2004 ఎన్నికల్లో అయ్యన్న ఎమ్మెల్యేగా విజయం సాధించినా వైఎస్ ఆర్ ముఖ్య‌మంత్రిగా ఉండ‌డంతో ఆయ‌న హ‌వా సాగ‌లేదు. ఆ త‌ర్వాత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముత్యాలపాప చేతిలో అయ్యన్న ఓటమి పాలయ్యారు. మ‌ళ్లీ 2014 ఎన్నికలలో శాసనసభ్యునిగా విజయం సాధించి మంత్రి అయ్యారు. ఆశించిన స్థాయిలో త‌మ ప్రాంతాన్ని అభివృద్ధి చేయ‌లేక‌పోయారు. దీంతో నర్శీపట్నం నాది అంటూ దశాబ్దాల పాటు శాసించిన అయ్యన్నపాత్రుడుకి 2019 ఎన్నికల్లో భారీ ఓటమి ఎదురైంది. అప్ప‌టి నుంచీ ఆయ‌న‌ను ప్ర‌జ‌లు ప‌ట్టించుకోవ‌డం మానేశారు. తెలుగుదేశం పార్టీ ప్రాభ‌వం కూడా త‌గ్గుతూ వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వంతో కోట‌లు దాటేలా మాట్లాడ‌డం మాత్రం మాన‌లేదు.

పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై ఎస్ ఈసీ, ప్ర‌భుత్వం మ‌ధ్య వాద‌న‌లు జ‌రుగుతున్న సంద‌ర్భంలో కూడా అయ్య‌న్న పాత్రుడు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. తీరా ఇప్పుడు పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా క‌నిపిస్తుండ‌డంతో అయోమ‌యానికి గుర‌వుతున్నారు. నిరంత‌రం జ‌నాల్లో తిరుగుతూ వారిని ఆక‌ట్టుకునేందుకు తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇపుడు పంచాయతీ ఎన్నికల వేళ ఆయ‌న నియోజ‌క వ‌ర్గంలో 101 సర్పంచు పదవులకు గానూ నాలుగు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. ఇక మిగిలిన 97 చోట్ల ఈ నెల 13న రెండవ విడత ఎన్నికలు ఉన్నాయి. ఎక్క‌డ చూసినా వైసీపీ బ‌లంగా క‌నిపిస్తుండ‌డంతో కొన్ని పంచాయతీలైనా గెలుచుకుని సత్తా చాటాలని అయ్యన్న ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఆయన దూకుడుకు వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఎక్కడికక్కడ బ్రేకులు వేస్తున్నారు. ఇప్పుడు అయ్య‌న్న‌ను ప‌రిశీలిస్తే.. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌భుత్వంపై ఎగిరెగిరి ప‌డ్డ ఆయ‌న ప‌రువు కాపాడుకోవ‌డానికి ఎంత‌లా తాప‌త్ర‌య‌ప‌డుతున్నారో అర్థ‌మ‌వుతుంది.

Show comments