చివరి ఓవర్ వరకూ ఉత్కంఠ-రాయల్ లండన్ సిరీస్ ఆస్ట్రేలియాదే…

  • Published - 03:45 AM, Thu - 17 September 20
చివరి ఓవర్ వరకూ ఉత్కంఠ-రాయల్ లండన్ సిరీస్ ఆస్ట్రేలియాదే…

అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించి రాయల్ లండన్ వన్డే సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది. చివరి ఓవర్ వరకూ సాగిన ఈ థ్రిల్లర్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మరోసారి క్రికెట్ లో ఉన్న మజాను పంచింది.

నిర్ణయాత్మక మూడో వన్డేలో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ కు స్టార్క్ తొలి ఓవర్ రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి పెద్ద షాక్ ఇచ్చాడు. తొలిబంతికే జాసన్ రాయ్ వికెట్ సాధించిన స్టార్క్, రెండో బంతికి జో రూట్ క్రీజులో కుదురుకునే అవకాశం ఇవ్వకుండానే ఎల్బీగా వెనక్కి పంపాడు. దాంతో ఇంగ్లండ్ ఆత్మరక్షణలో పడిపోయింది. దీంతో కెప్టెన్ మోర్గాన్ ఓపెనర్ బెయిర్ స్టోతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ జట్టు స్కోరు 67 పరుగుల వద్ద మోర్గాన్ ఇన్నింగ్స్ కు(23;4×4,28 బంతుల్లో) ఆసీస్ స్పిన్నర్ జంపా తెరదించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బట్లర్ కూడా ఎక్కువ సేపు నిలవలేదు. దీంతో ఇంగ్లండ్ కనీసం రెండువందల పరుగులైనా చేస్తుందా అన్న అనుమానాలు మొదలైన తరుణంలో బెయిర్ స్టో తన అద్భుతమైన ఆటతీరుతో సామ్ బిల్లింగ్స్ తో కలిసి పరుగులు రాబట్టి జట్టును ఆదుకున్నాడు.

సెంచరీతో ఆదుకున్న బెయిర్ స్టో

ఒకపక్క సహచరుల వికెట్లు పడుతున్నా బెయిర్ స్టో(112; 12×4,2×6,126 బంతుల్లో) తన ఆటను కొనసాగించి సామ్ బిల్లింగ్స్ (57; 4×4,2×6,58 బంతుల్లో) తో కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. సామ్ బిల్లింగ్స్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం జంపాకి చిక్కాడు.ఓపెనర్ గా క్రీజులోకి వచ్చి 40 ఓవర్ల పాటు ఓపికగా క్రీజులో నిలిచిన బెయిర్ స్టో భారీ స్కోరు సాధించేలా కనిపించాడు కానీ పాట్ కమిన్స్ వేసిన అద్భుతమైన బంతికి బౌల్డ్ అవడంతో బెయిర్ స్టో పోరాటం ముగిసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన క్రిస్ వోక్స్(53; 6×4,0×6,39 బంతుల్లో) బ్యాట్ ఝళిపించడంతో ఇంగ్లాడ్ 300 పరుగుల మార్కును దాటింది.

73 పరుగులకే ఐదు వికెట్లు

లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా తడబడింది. 73 పరుగులకే ఐదు ప్రధాన వికెట్లు కోల్పోయింది. ప్రధాన బ్యాట్స్మెన్లు అందరూ ఇంగ్లాడ్ బౌలర్ల ధాటికి పెవిలియన్ కు క్యూ కట్టారు. క్రిస్ వోక్స్ వెంట వెంటనే కెప్టెన్ ఫించ్  మరియు స్టాయినిస్ వికెట్లు తీయగా బ్యాటింగ్ లో డకౌట్ అయిన రూట్ బౌలింగ్ లో రాణించి క్రీజులో కుదురుకుంటున్న డేవిడ్ వార్నర్ & మిచెల్ మార్ష్ వికెట్లను సాధించాడు. దీంతో 73 పరుగులకే 5 ప్రధాన వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా రెండో వన్డే ఓటమిని పునరావృతం చేస్తుందని అందరూ అనుకున్నారు.

నిలబడిన ఆ ఇద్దరూ…

73 పరుగులకే సగం జట్టు పెవిలియన్ చేరినా ఆస్ట్రేలియా విజయం సాధించిందంటే కారణం ఆ ఇద్దరే.. మాక్స్ వెల్ మరియు అలెక్స్ కేరీ జోడి మరో వికెట్ పడకుండా క్రీజులో పాతుకుపోయి పరుగులు సాధించారు. ముఖ్యంగా మాక్స్ వెల్ తనదైన విధ్వంసకర ఆటతీరుతో భారీ సిక్సులు సాధించి జట్టు చేయాల్సిన పరుగులు తగ్గిస్తూ వచ్చాడు. అలెక్స్ కేరీ మరో వికెట్ పడకుండా సహకారాన్ని అందించాడు. ఈ క్రమంలో ఆర్చర్ బౌలింగ్ లో అలెక్స్ కేరీ ఇచ్చిన క్యాచ్ ను రషీద్ అందుకున్నాడు. కానీ నోబాల్ కావడంతో అలెక్స్ కేరీ బ్రతికిపోయాడు. రషీద్ బౌలింగ్ లో మాక్స్ వెల్ ఇచ్చిన క్యాచ్ ను బట్లర్ జారవిడవడం కూడా ఇంగ్లండ్ ఓటమికి ప్రధాన కారణం.

వీరిద్దరూ కలిసి ఆరో వికెట్ కు 212 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. ఆస్ట్రేలియా తరపున ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఈ క్రమంలో మాక్స్ వెల్  (108; 4×4,7×6,90 బంతుల్లో) అలెక్స్ కేరీ (106; 7×4,2×6,114 బంతుల్లో) ఇద్దరు సెంచరీలు సాధించారు..48 వ ఓవర్ లో  మ్యాచ్ ను త్వరగా ముగించాలి అన్న తొందరలో మాక్స్ వెల్ రషీద్ బౌలింగ్ లో భారీ షాట్ కి ప్రయత్నించగా బంతి ఎడ్జ్ అయి గాల్లోకి లేవడంతో టామ్ కరణ్ క్యాచ్ అందుకోగా,49 ఓవర్ ఆర్చర్ బౌలింగ్ లో మార్క్ వుడ్ అద్భుత  క్యాచ్ అందుకోవడంతో అలెక్స్ కేరీ కూడా పెవిలియన్ చేరుకున్నాడు. చివరి ఓవర్ లో 10 పరుగులు సాధించాల్సిన స్థితిలో క్రీజులోకి వచ్చిన స్టార్క్ 50 వ ఓవర్ తొలి బంతికే సిక్స్ సాధించడంతో ఆస్ట్రేలియాపై ఒత్తిడి తొలిగింది. మూడు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సి ఉండగా స్టార్క్ బౌండరీ కొట్టడంతో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించి సంబరాల్లో మునిగిపోయింది.

ఈ విజయంతో 2-1 తేడాతో రాయల్ లండన్ సిరీస్ ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. మొదటి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించగా రెండో వన్డేలో ఇంగ్లండ్ విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో ఆస్ట్రేలియా అద్భుతంగా పోరాడి సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్ లో అద్భుతమైన ఆటతీరు కనబరిచిన మాక్స్ వెల్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ మరియు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు.

Show comments