ఏడు ఎంటర్ టైనర్స్ మధ్య ఒకే ప్రేమకథ

ఈ ఏడాది ఏప్రిల్ చాలా రసవత్తరంగా ఉండబోతోంది. ప్రతి వారం టికెట్ డబ్బుల కోసం పర్సుకు పరీక్ష పెట్టేలా అన్నీ క్రేజీ మూవీస్ బాక్సాఫీస్ వద్ద దూసుకువస్తున్నాయి. ఏప్రిల్ 1 పునీత్ రాజ్ కుమార్ ‘యువరత్న’తో దీనికి బోణీ పడనుంది. కర్ణాటకలో పవర్ స్టార్ అని పిలుచుకునే పునీత్ కు ఇక్కడ మార్కెట్ లేదు కానీ యువరత్నకు పెట్టిన బడ్జెట్, సినిమాలో ఉన్న కమర్షియల్ అంశాలు ఇక్కడ కూడా వసూళ్లు తెచ్చిపెడతాయనే నమ్మకంతో ఉన్నారు దీన్ని ప్రొడ్యూస్ చేసిన కెజిఎఫ్ నిర్మాతలు. ఆ తర్వాత మరుసటి రోజే గోపీచంద్ ‘సీటిమార్’, కార్తీ ‘సుల్తాన్’, అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ భారీ ఎత్తున రంగంలోకి దిగబోతున్నాయి.

ఇక ఏప్రిల్ 9న జరగబోయే భీభత్సం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూడేళ్ళ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన ‘వకీల్ సాబ్’ గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. పింక్ రీమేక్ అయినప్పటికీ అభిమానులు మెచ్చేలా ఇందులో చాలా మార్పులే చేశారు కాబట్టి దీన్ని సీరియస్ మూవీ గా పరిగణించలేం. ఇక 23న నాని ‘టక్ జగదీశ్’ వస్తుంది. ఇదేదో సాఫ్ట్ ఎంటర్ టైనర్ అనుకుంటే నిన్న రిలీజ్ చేసిన టీజర్ లో ఇందులో మసాలా అంశాలు కూడా ఉన్నాయనే క్లారిటీ ఇచ్చారు. 30న వచ్చే ‘పాగల్’ ఒక డిఫరెంట్ అప్పీల్ ఉన్న ఓ కుర్రాడి బయోపిక్ లాంటిది. రానా ‘విరాట పర్వం’ ఒకప్పుడు వ్యవస్థానను శాసించిన నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందింది.

ఈ ఏడు ఎంటర్ టైనర్స్ అన్నింటిలోనూ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సున్నితత్వం అంతర్లీనంగా ఉంటుంది కానీ ఇవన్నీ మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసినవే. 16న రిలీజయ్యే లవ్ స్టోరీ మాత్రం వీటికి భిన్నంగా అవుట్ అండ్ అవుట్ ప్రేమకథగా వస్తోంది. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అందులోనూ నాగ చైతన్య-సాయి పల్లవిల కాంబినేషన్ . ఎలాంటి హంగులు లేకుండా కేవలం ప్రేమను నమ్ముకుని శేఖర్ కమ్ముల ఈ సినిమా చేశారు. మరి ఇన్నేసి మాస్ ఎంటర్ టైనర్స్ ఉన్న ఏప్రిల్ లో లవ్ స్టోరీ తన ప్రత్యేకతను ఎలా చూపబోతోందో వేచి చూడాలి

Show comments