Idream media
Idream media
ఒక రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే.. పారిశ్రామికంగా సుస్థితరమైన వృద్ధి అత్యంత అవసరం. ఆ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగానే గుర్తించింది. మొదటి నుంచీ పారిశ్రామికీకరణపై దృష్టి సారిస్తూ వినూత్న పంథాలో ముందుకు వెళ్తోంది. ప్రతిపక్షాల ప్రచారం, ఓ వర్గం మీడియా అల్లుతున్న కథనాలకు విరుద్ధంగా వాస్తవ పరిస్థితి ఉంటోంది. కీలకమైన పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేలా ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న కృషి ఫలిస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం కూడా వారితో చర్చలు జరిపి పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఎగుమతుల్లో ఇరవై శాతం వృద్ధి సాధించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
పారిశ్రామిక విధానంలో కూడా అన్ని ప్రాంతాల సుస్థిరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ప్రాంతాల వారీగా, రంగాల వారీగా ప్రోత్సాహకాలను అందిస్తోంది. కొత్తగా ఏర్పాటయ్యే రాజధానులతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేసేలా ఇప్పటికే కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తోంది. ప్రజలు, పారిశ్రామిక వేత్తల భాగస్వామ్యంతో పరిశ్రమల అభివృద్ధి జరిగేలా గత విధానంలో పలు మార్పులు చేసింది. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో కుంటుపడిన పరిశ్రమలను ఆదుకునేలా పలు చర్యలు చేపట్టింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రోత్సాహకాలు అందించింది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఉన్న విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవడం, ప్రాంతాల మధ్య సమతుల్యం, అంతర్జాతీయంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా అందుబాటులో ఉన్న నైపుణ్యాల వృద్ధి, అత్యంత తక్కువ సమయంలో పెట్టుబడుల ఆకర్షణకు హామీ ఇవ్వడం ఆవశ్యమని ప్రభుత్వం గుర్తించింది.
రాష్ట్రంలో భారీగా ఉద్యోగాల కల్పన, పరిశ్రమల తలసరి ఆదాయం జాతీయ సగటుకు చేరుకునేలా చేయడం, రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు, కులాల మధ్య పారిశ్రామిక అభివృద్ధి సమతుల్యం చేయడం, పర్యావరణ అనుకూల అభివృద్ధి సాధించడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించింది ఏపీ సర్కారు. ప్రోత్సాహకాలు, పారిశ్రామికవేత్తలకు నిరంతరం సాయం అందించడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు బాటలు నిర్మించుకుంది. మెగా ప్రాజెక్టులకు వాటి పెట్టుబడి ప్రతిపాదనలకు అనుగుణంగా అదనపు రాయితీలు కల్పిస్తోంది. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా పథకాలు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఉపాధి కల్పించే పరిశ్రమలను ఎక్కువగా ప్రోత్సహించనుంది.
నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా సింగపూర్ తరహాలో వైఎస్సార్ ఏపీ వన్ పేరుతో సేవలు పారిశ్రామికవేత్తలకు సేవలు అందిస్తోంది. కేవలం సులభతర వాణిజ్య అవకాశాలే కాకుండా ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలకు నిర్వహణ వ్యయం భారీగా తగ్గించే విధంగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం రాష్ట్రంలో వస్తువుల ఉత్పత్తి ధరలో సరుకు రవాణా వ్యయం 13 శాతంగా ఉందని, దీన్ని 8 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా పటిష్ట ప్రణాళికలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధితోపాటు గోడౌన్లు, లాజిస్టిక్ సౌకర్యాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించింది.
రాష్ట్రం నుంచి వెళ్తున్న మూడు కారిడార్లలో అన్ని మౌలిక వసతులతో నోడ్‌లను అభివృద్ధి చేస్తోంది. క్లిష్ట సమయంలో కూడా వీసెజ్ అద్భుతమైన పనితీరు కనబరుస్తుండడంతో ఈ ఆర్థిక ఏడాదిలో సెప్టెంబర్ నాటికి గతేడాదితో పోలిస్తే ఎగుమతులు 26 శాతం పెరిగాయి. ఎగుమతుల్లో 90 శాతం పోర్టుల ద్వారానే జరుగుతుండడంతో కొత్త పోర్టుల నిర్మాణంతో పాటు, పోర్టు ఆథారిత పరిశ్రమలపై ప్రత్యేకంగా జగన్ సర్కార్ దృష్టి సారించింంది. రాష్ట్రంలో కొత్తగా మూడు పోర్టులను అభివృద్ధి చేస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గమనిస్తున్న పారిశ్రామిక వర్గాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నట్లుగా తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.