నిమ్మగడ్డకు హైకోర్టులో ఎదురు దెబ్బ

చిత్తూరు, గుంటూరు జిల్లాలో ఏకగ్రీవాలైన పంచాయతీలను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ ఎస్‌ఈసీ జారీ చేసిన ఆదేశాలపై మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలు నిబంధనలకు విరుద్ధమని ఎస్‌ఈసీ ఆదేశాలను పాటించాలనే ఆలోచనతో నిబంధనలకు విరుద్ధంగా రిటర్నింగ్‌ అధికారులు వ్యవహరించొద్దని వారికి విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఎవరైనా రూల్స్ కి విరుద్దంగా సొంత అజెండాతో వ్యవహరిస్తే వారిని బ్లాక్ లిస్ట్ లో పెడతాం అని హెచ్చరికలు జారీ చేశారు.

అయితే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన ఈ వాఖ్యలను సాకుగా చూపుతూ నిమ్మగడ్డరమేష్ ఈ నెల 21వ తేదీ వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంటికే పరిమితం చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్ ను ఆదేశించారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేందుకే ఈ చర్యలు తీసుకున్నామని ఎస్‌ఈసీ తన సిఫార్సుల్లో పేర్కొన్నారు. మీడియాతో కూడా మాట్లాడనీయొద్దంటూ అందులో పేర్కొన్నారు. ఆర్టికల్‌ 243కే ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేస్తున్నానని చెప్పుకొచ్చారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన ఆదేశాలను తీవ్రంగా పరిగణించిన పెద్దిరెడ్డి నిమ్మగడ్డ రమేష్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పెద్దిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు నిమ్మగడ్డ రమేష్‌ జారీచేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పర్యటించాల్సిన బాధ్యత ఆ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డికి ఉందన్న పిటిషనర్‌ తరపు న్యాయవాదుల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. రాష్ట్ర మంత్రిగా ఆయన ఎక్కడైనా పర్యటించవచ్చని తీర్పులో స్పష్టం చేసింది. హైకోర్టు ఉత్తర్వులతో ఏకపక్షంగా వ్యవహరిస్తూ వస్తున్న నిమ్మగడ్డకు భారీ ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి.

Show comments